లక్నోలో బీజేపి సక్సెస్ కి ... ముస్లిమ్ లేడీసే కారణమా?


 

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకేసారి విడుదలవుతున్నా అందరి దృష్టీ ఆకర్షిస్తోంది మాత్రం ఉత్తర్ ప్రదేశ్! పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, నాలుగు కలిస్తే ఎంత ప్రభావం చూపిస్తాయో అంతకన్నా ఎక్కువ ప్రభావం యూపీ చూపించగలగటమే ఇందుకు కారణం! ఉత్తర్ ప్రదేశ్ లో కేవలం మెజార్జీ సీట్లు కాకుండా మూడొంతుల ఎమ్మెల్యే స్థానాల్ని కమలం కైవసం చేసుకోటం నిజంగా పెద్ద సంచలనమే! అయితే, మోదీ సేన ఇతర పక్షాలపై చేసిన ఈ ఊచకోత వెనుక కొన్ని ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి...

 

యూపీలో బీజేపి గెలుపుకు మత రాజకీయాలు కారణమని కొందరు రొటీన్ గా చెప్పొచ్చు. కాని, నమో విభిన్నమైన మత పాచిక విసిరారు! ఎప్పటిలా ఈ సారి బీజేపి ముస్లిమ్ వ్యతిరేకత మీద ఆధారపడ లేదు. రివర్స్ లో వచ్చింది. ముస్లిమ్ మహిళల్ని తీవ్రంగా దెబ్బ తీస్తోన్న ట్రిపుల్ తలాఖ్ పై ఎప్పట్నుంచో యుద్ధం ప్రకటించింది. అసలు దేశంలో ముస్లిమ్ పురుషులు కొందరు దుర్వినియోగం చేస్తోన్న ట్రిపుల్ తలాఖ్ గురించి మాట్లాడే పార్టీయే మరేది లేదు. కేవలం కాషాయదళమే గళం విప్పుతూ వస్తోంది. మిగతా పార్టీలన్నీ ముస్లిమ్ సమాజంలోని మహిళల దుస్థితిని పట్టించుకోకుండా ఓటు బ్యాంక్ కాపాడుకునే వ్యూహంలో ఇరుక్కుపోయాయి. అక్కడే మోదీ, అమిత్ షాల ఆలోచన ఫలించింది. కోర్టు బయటా, లోపలా కేంద్రంలోని మోదీ సర్కార్ ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చింది. ఇది యూపీలోని ముస్లిమ్ మహిళల ఓట్లను సంపాదించి పెట్టిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!

 

ఏదో ముక్కుతూ మూలుగుతూ మ్యాజిక్ ఫిగర్ దాటటం కాకుండా ఏకంగా మూడు వందల మార్క్ కూడా దాటాలంటే అందుకు ముస్లిమ్ ల నుంచి ఎంతో కొంత మద్దతు బీజేపికి అవసరం. ఆ సపోర్ట్ మైనార్టీ మహిళల రూపంలో అందివచ్చిందంటున్నారు! అలాగే, మాయవతి పార్టీ అత్యంత దారుణంగా పర్ఫామెన్స్ చూపటం కూడా దళితుల విషయంలో అన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది! దళితుల ఓట్లపై తమకు గుత్త హక్కు వుందని భావించిన బీఎస్పీ బొక్కా బోర్లా పడింది. ఎస్పీల నుంచీ బీజేపికి మద్దతు లభించకుంటే యూపీలోని అన్ని ప్రాంతాల్లో సీట్లు గెలవటం అసాధ్యం. ఇదే న్యాయం ఎస్పీ కూడా అవగతం చేసుకోవాలి. ఎప్పుడూ బీసీలకు, ముస్లిమ్ లకు తామే పెద్ద దిక్కని భావించే సమాజ్ వాది ఇక మీదట నిజంగా ఆయా వర్గాల కోసం పోరాటాలు చేయాలి. లేదంటే, వారు తిరిగి కమలం గూటి నుంచి వెనక్కి రావటానికి చాలా సమయమే పడుతుంది!