దుమ్మురేపుతున్న ఆంధ్రా పొలిటికల్ సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఓ సర్వే.... అధికార, ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ సర్వేను ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఇటు టీడీపీ.... అటు వైసీపీ.... రెండింటికీ పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీ చెక్‌ పెట్టడం ఖాయమంటోంది.

 

 

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీకి 71 సీట్లు, జనసేన 65 స్థానాలు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితమవుతుందని లెక్కగట్టింది. అదీ కూడా వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమ నాలుగు జిల్లాల్లోనే 20కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, మిగతా 9 జిల్లాల్లో వచ్చే సీట్లన్నీ కలిపి పదిహేనుకి మించవంటోంది.

 

 

ఉత్తరాంధ్రలో వైసీపీ అసలు బోణీ కూడా చేయదని సర్వే సంస్థ  తేల్చింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన దెబ్బకు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా దెబ్బతింటాయని లెక్కగట్టింది. తూర్పుగోదావరిలో వైసీపీ ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంటుందన్న సర్వే సంస్థ.... పశ్చిమలో ఈసారి కూడా ఖాతా తెరబోదని చెప్పింది. 

 

 

ఇక కృష్ణాజిల్లాలోనూ జనసేన దెబ్బకు వైసీపీ ఖాతా తెరవబోదని తాజా సర్వేలో తేలింది. అయితే రాయలసీమ తర్వాత ఎంతో కొంత పట్టున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తలో నాలుగు సీట్లు చొప్పున గెలుస్తుందని అంచనా వేసింది. ఇక గుంటూరు జిల్లాలో కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది.

 

 

అంటే ఇప్పటిదాకా రెండు కులాలకి మాత్రమే పరిమితమయిన రాజకీయాలు ఇకమీదట మరో కులం కూడా చేరి మరింత ఆసక్తికర ఆటగా మారబోతున్నాయి అన్నమాట..కాపు సామాజిక వర్గం కి ఎప్పటి నుంచో సరైన ప్రాతినిద్యం లేదని , పవన్ రాకతో ఆ కొరత తీరుతుందని రాజకీయ విశ్లేషకుల ..ఉవాచ. అంటే ఉత్తరప్రదేశ్‌లా అవశేష ఆంద్రప్రదేశ్ కూడా కులాల ప్రదేశ్ గా మారబోతోందన్న మాట . ఇంకో ఇంట్రస్టింగ్ గెస్ (guess) ఏంటంటే BC, ST, SC లకి కూడా ఒక కొత్త పార్టీ రాబోతోందిట . వచ్చినా రావచ్చు ..కులానికో పార్టీ అవసరం ఎంతయినా వుంది అంటున్నారు ...రాజకీయ నాయకులు.