2016 - ఆరోగ్య రంగంలో ఐదు సంచలనాలు

 


ఏదన్నా విషయం మనదాకా వస్తేకానీ ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలిసేది కాదు. కానీ సమాచార విప్లవం పుణ్యమా అని ఇప్పుడు ఏ మూల ఏం జరుగుతున్నా కూడా సెకన్లలో వార్త మన ఇంటికి చేరిపోతోంది. అలా 2016లో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన ఆరోగ్య విషయాలు ఇవిగో...

 

జికా వైరస్

ఈడిస్ దోమ ద్వారా వ్యాపించే జికా వైరస్ ప్రపంచానికి ఏమీ కొత్త కాదు. అయితే 2016లో ఈ వైరస్‌ విశ్వరూపాన్ని చూపించడంతో అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. ఈ వైరస్‌ సోకినవారికి అది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, తల్లి గర్భంలో ఉండగా ఈ వైరస్‌ సోకిన పిల్లల బతుకు మాత్రం నరకమైపోతుంది. అలా పుట్టిన పిల్లలు ‘మైక్రోసెఫిలీ’ అనే వ్యాధి బారిన పడి మెదడు సంబంధ వ్యాధులకు లోనవుతారు.  అదృష్టవశాత్తూ ఈడిస్ దోమల వ్యాప్తిని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో... ఈ వైరస్ ఇక మీదట ప్రపంచానికి ప్రమాదం కాదంటూ WHO ప్రకటించింది.

 

పోకెమాన్‌ గో

మన కళ్ల ముందే దోబూచులాడుతున్నట్లు కనిపించే పోకెమాన్‌ గో అట 2016ని ఓ కుదుపు కుదిపేసింది. ఈ ఆటతో జనం వెర్రెత్తిపోతున్నారనీ, కాల్పినిక జంతువుల వెంట పడుతూ ప్రమాదాలకు లోనవుతున్నారనీ విమర్శలు వినిపించాయి. ఆశ్చర్యంగా పోకెమాన్‌ గోతో ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉందని తేలింది. ఇప్పటి వరకూ నాలుగు గోడల మధ్య ఉన్న జనాలు పోకెమాన్‌ పుణ్యమా అని ఇప్పుడు ఓ నాలుగు అడుగులు వేస్తున్నారనీ పరిశోధనలు తేల్చాయి. పోకెమాన్‌ గోతో పరుగులు తీయడం వల్ల ఊబకాయం తగ్గుతోందనీ, డయాబెటిస్ అదుపులోకి వస్తోందనీ ఆశావహులు మురిసిపోయారు.

 

జీన్‌ ఎడిటింగ్

మన జన్యవులలో తగిన మార్పులు చేయడం ద్వారా ఏ అవయవాన్నైనా తిరిగి ఆరోగ్యవంతంగా మార్చివేయవచ్చునని తేల్చారు పరిశోధకులు. ఈ అంశం మీద అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ 2016లో చైనా, అమెరికాకు చెందిన పరిశోధకులు పూర్తిస్థాయి ఫలితాలను సాధించగలిగారు. Crispr-Cas9 అనే ఈ చికిత్స అందుబాటులోకి వస్తే... మన శరీరంలో ఏ జన్యువు కారణంగా అనారోగ్యం ఏర్పడుతుందో ఆ జన్యువులని మార్చివేయడం కానీ, సరిచేయడం కానీ చేయవచ్చు. అంటే ఇక మీదట గుండె వంటి అవయవాలు దెబ్బతిన్నా, శరీరాన్ని క్యాన్సర్‌ కబళించినా కూడా తిరిగి పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

 

నిద్ర

మనిషికి నిద్ర ఎంత అవసరమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆ నిద్ర ఎలా ఉండాలో, తగిన నిద్ర లేకపోతే ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలియచేస్తూ రకరకాల పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. రాత్రివేళ నిద్రపోయేందుకు కనీసం రెండు గంటలు ముందుగానే ఆహారం తీసుకోవాలనీ, సెల్‌ఫోన్లని చూస్తూ పడుకుంటూ నిద్ర సరిగా పట్టదనీ పరిశోధనలు వెలువడ్డాయి. ఇక రాత్రివేళ ఉన్నది నిద్రపోవడానికే అనీ, ఆ సమయంలో నిద్రపోకుండా పనిచేస్తూ కూర్చుంటే శరీరంలోని రోగనిరోధక శక్తి క్షీణించిపోతుందన్న పరిశోధనా వెలువడింది. నిద్రకి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ, ఆఫీసు పనిలో మునిగితేలేవారి ఆరోగ్యమూ అంతంతమాత్రమే అని తేలింది.

 

శీతల పానీయాల మీద యుద్ధం

పెప్సీ, కోకోకోలా... పేరేదైతేనేం శీతల పానీయాలు మన జీవితాలతో ఆడుకుంటున్నాయన్న నిజం బహిరంగమే! వీటి వ్యసనానికి లోనైన పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారనీ, చిన్నతనంలోనే డయాబెటిస్ ఉచ్చులో చిక్కుకుంటున్నారనీ పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శీతల పానీయాలతో నేటి తరం శరీరం డొల్లగా మారిపోతోంది. అందుకనే ఇంగ్లండ్, అమెరికా, కెనడా వంటి దేశాలు ఇప్పుడు శీతల పానీయాల మీద యుద్ధాన్ని ప్రకటించాయి. పాఠశాలల దగ్గర వాటి విక్రయాన్ని నిషేదించడం, పన్నుల రేటుని విపరీతంగా పెంచేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో తమ పానీయాల వల్ల పెద్దగా నష్టం లేదని బుకాయిస్తూ వచ్చిన సంస్థలు ఇప్పుడు నష్టనివారణకు పూనుకోక తప్పడం లేదు. ఇందులో భాగంగా పెప్పీ కంపెనీ 2025 నాటికి తాము ఉత్పత్తి చేసే పానీయాలలో చక్కెర శాతాన్ని వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తామని ప్రకటించింది.

 

 

- నిర్జర.