ఆర్ధిక స్వాతంత్ర్యానికి పాతికేళ్లు..

ఆర్ధిక సంస్కరణలు.. దేశ గతిని మార్చి..ప్రపంచంలోనే ప్రబల ఆర్ధిక శక్తిగా భారత్‌ ఎదగడానికి కారణమైన సాహసోపేత నిర్ణయాలు. అలా దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు. పాముల్ని ఆడించుకునే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన భారతదేశాన్ని తిరుగులేని ఆర్థికశక్తిగా తీర్చిదిద్ది..ప్రపంచం ముందు నిలబడేలా చేసిన ఘనత తెలుగుబిడ్డ పీవీ నరసింహరావుదే. 1991 జూన్ 21 అప్పటికి రాజీవ్ హత్య జరిగి సరిగ్గా నెల రోజులైంది. ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు మందిర్-మండల్ ఉద్యమాలు. దేశంలో పూర్తిగా అస్థిరత నెలకొన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు. ఓ పక్క ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది..విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పెను సవాళ్ల పద్మవ్యూహంలో చిక్కుకున్న పీవీ స్వాతంత్ర్య భారతావనిలో అత్యంత కఠోర పరీక్షకు సిద్ధమవ్వాలని గుర్తించారు.

 

సంస్కరణలు తీసుకురాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రహించిన పీవీ పెద్ద సాహసం చేశారు. ఆర్ధిక మంత్రుల్ని కాదని..అప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ని ఆర్థిక మంత్రిగా చేశారు. కాని మన్మోహన్‌కు ఆర్థిక మంత్రి పదవి ఇవ్వడంపై సొంతపార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటికే ప్రధాని పీఠంపై కన్నేసిన శరద్‌పవార్, అర్జున్ సింగ్, ఎన్డీ తివారీ లాంటి వారు పీవీ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించారు. వీటిని ఏ మాత్రం లెక్కచేయని నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌కు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అటు ప్రధాని తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని మన్మోహన్ వమ్ము చేయలేదు. సరళీకరణ విధానాలకు బాటలు పరిచారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశ ముఖచిత్రాన్నే మార్చివేశారు. ఈ విధానాల వల్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట సాగించే కమ్యూనిస్టులు, తదితర వర్గాలను దానికి అనుకూలంగా ఒప్పించగలిగారు పీవీ. సంస్కరణల ఫలితంగా ఐటీ అన్నది భారతదేశంలో కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక వ్యవస్థను ఇండియాలోకి విస్తరింపచేశాయి.

 

పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. అలా కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు నిలబడింది. ఈ విధంగా దేశానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు పీవీ. ఇంత కష్టపడిన మనిషిని దేశం సరిగా గుర్తించలేదు. ఢిల్లీలో దివంగత ప్రధానుల కోసం స్మారక ఘాట్‌లు కట్టించడం ఆనవాయితీ. కానీ పీవీకి ఇది వర్తించదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ఇప్పించిన ధీశాలికి ఇంతవరకు భారతరత్న రాలేదు. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు మృతదేహన్ని కూడా సరిగా కాల్చకుండా వదిలివేసిన ఘనత ఆనాటి నేతలకే చెల్లింది. ఏదేమైనా పీవీ నాటిన సంస్కరణలు అనే మొక్క మహావృక్షమై ఇప్పుడు దేశానికే నీడనిస్తోంది. ఎవరు గుర్తించినా గుర్తించకున్నా నవ భారత నిర్మాతగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు.