కష్టకాలంలో జగన్.. రాజధానిలో వైసీపీ ఖాళీ..!

 

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ విలవిల్లాడిపోతోంది. వైకాపాకు చెందిన సీనియర్ నాయకుల నుండి.. నిన్న మొన్న అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు, ఆఖరికి బంధువులు కూడా జగన్ తీరు నచ్చక పార్టీని వీడి టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పార్టీ నుండి దాదాపు 15 మంది నేతలకు పైగా టీడీపీ పార్టీలోకి జంప్ అవ్వగా.. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని ఆపార్టీ నేతలు చెబుతుండటంతో వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భూమా నాగిరెడ్డి నుండి మొదలైన ఈ వలసల పర్వం..ప్రస్తుతం బుడ్డా రాజశేఖర్ రెడ్డి వరకూ వచ్చి ఆగింది ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు చేరుతారో తెలియని పరిస్థితి.

 

ఇదిలా ఉండగా తాజా పరిస్థితులను చూస్తుంటే ఏపీ రాజధానికి కేంద్ర బిందువైన కృష్ణజిల్లాలో కూడా వైసీపీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు ఆయన బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కృష్ణా జిల్లా తిరువూరు నియోజక వర్గ సభ్యులు రక్షణ నిధి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లా ప్రతినిధి పార్థసారధి కూడా జంప్ అయ్యే లిస్టులో ఉన్నారు. ఇంకా వీరేకాదు.. చెప్పుకుంటూపోతే చాలా మంది నేతలే టీడీపీలోకి చేరేందుకు సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బందరు నుండి పేర్ని నాని, కైకలూరు, గన్నవరం, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, అవనిగడ్డ తదితర నియోజక వర్గాల్లోని వైసీపీ నేతలు కూడ జగన్ తో సరైన సఖ్యత లేనందున వైసీపీ ని వీడి టీడీపీలోకి చేరేందుకు సిద్దపడుతున్నట్టు రాజకీయ వర్గాల టాక్.

 

అయితే పార్టీలోని నేతలంతా వరుసపెట్టి టీడీపీలోకి చేరుతుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచే విషయం. ఒకపక్క వైసీపీ నేతలు జంప్ అవుతుంటే జగన్ మాత్రం తీరిగ్గా హస్తినకు వెళ్లి చంద్రబాబుపై చాడీలు చెప్పే పనిలో పడ్డారు. అంతేకాదు ఇంతా జరుగుతున్నా జగన్ నిఘా పెట్టకపోవడంలో ఆతర్యం ఏంటీ.. ఇంతమంది పార్టీ మారుతున్నా కనీసం వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదేంటి అని జుట్టు పీక్కునేవారు కూడా ఉన్నారు. మరోవైపు టీడీపీ మాత్రం ఎంతమంది వస్తే అంతమందికి స్వాగతం పలకడానికి రెడీగా ఉంది. దీంతో చిన్నా చితకా నేతలు కూడా వైసీపీకీ గుడ్ బై చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో రాజధాని కేంద్ర బిందువైన కృష్ణాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం అని అనుకుంటున్నారు రాజకీయ పెద్దలు. ఏం జరుగుతుందో ఎంతమంది నేతలు ఉంటారో.. ఎంత మంది నేతలు వెళతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu