ఆమె తూర్పు.. అతను పడమర...

మౌలికంగా స్త్రీ, పురుషుల ఆలోచనా విధానంలోనే తేడా వుంటుంది. అందుకే ఒకరు చేసేది మరొకరికి నచ్చదు అంటున్నారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. భార్యాభర్తల బంధంలో ‘అర్థం చేసుకోవడం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఎవరు ఎవర్ని అర్థం చేసుకోవాలన్నదే సమస్య. నన్ను అర్థం చేసుకుని నాకు నచ్చినట్టు నడిస్తే బావుంటుందని ఎవరికి వారు కోరుకుంటారుట భార్యాభర్తలిద్దరూ. అదిగో అక్కడే మొదలవుతుందిట సమస్యంతా.

భార్యాభర్తల గొడవల్లో ఎక్కువగా వినిపించే కారణం ‘అర్థం చేసుకోలేకపోవడం’. అయితే ఒకే విషయానికి స్త్రీ, పురుషులు స్పందించే తీరు వేరే వేరేగా వుంటుంది. అది సర్వ సాధారణం. ఈ ఒక్క విషయాన్ని గ్రహించగలిగితే ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వుండవు అంటున్నారు పరిశోధకులు. వీరు స్త్రీ, పురుషుల మనస్తత్వాలు, వివిధ సందర్భాలలో వారు స్పందించే విధానంపై ఓ అధ్యయనం చేపట్టారు. ఏ విషయం వారిని ఎక్కువగా బాధిస్తుంది అన్న విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో తేడా వుందని గుర్తించారు.


స్త్రీలు ఎక్కువగా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాల విషయంలో చాలా సున్నితంగా వుంటారుట. ఆ సన్నిహితుల విషయంలో, సంబంధాల విషయంలో ఏవైనా వైఫల్యాలు ఎదురైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు అంటున్నారు పరిశోధకులు. అదే మగవారిని ఆ విషయాలు అంతగా కదిలించవట. తమ ఉద్యోగం, సంపాదన, తన మాటకి విలువ, గౌరవం, సమాజంలో, కుటుంబంలో గుర్తింపు వంటివి మగవారికి ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయట. వీటిల్లో వచ్చే హెచ్చుతగ్గులు వారిని డిప్రెషన్‌కి గురి చేస్తాయట.


డిప్రెషన్‌కి గురైన స్త్రీలు నిస్సహాయంగా, నిరాశగా, ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతుంటే, మగవారు మాత్రం కోపం, పంతం వంటి లక్షణాలు కనబరుస్తారని గుర్తించారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. అలాగే పగ, కసి, శత్రుత్వం వంటి లక్షణాలు మగపిల్లల్లో టీనేజ్ నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా వీరి పరిశోధనలో తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మగపిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తన, మానసిక స్థితి వంటివాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని కూడా హెచ్చరిస్తున్నారు వీరు.


నిరాశ, నిస్పృహ వంటివి మనిషిని కృంగదీసినప్పుడే మరో వ్యక్తి తోడు, ఆసరా అవసరం అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో భార్య భర్త నుంచి ఓదార్పుని, తోడ్పాటుని కోరుకుంటే భర్త తన భార్య సహనంగా అర్థం చేసుకోవడాన్ని కాంక్షిస్తాడుట. స్త్రీలు నేనున్నానంటూ భరోసాని కోరుకుంటారు. కానీ, మగవారు తమ భార్యలు వారి సమస్యలలో తల దూర్చకుండా, సలహాలు ఇవ్వకుండా ఉండాలని ఆశిస్తారుట. దాదాపు కొన్ని వందల జంటలపై దీర్ఘకాలం సాగిన ఆ పరిశోధనలో బయటపడిన కొన్ని ఆసక్తికర అంశాలివి.


-రమ