బ్యాంకులకు మాల్యా మరో ఆఫర్.. పెడసరంగా సమాధానాలు..


విజయ్ మాల్యా బ్యాంకులకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు. బ్యాంకుల నుండి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న మాల్యా మొదట నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పాడు. ఆతరువాత ఈడీ మాల్యాపై సీరియస్ గా దర్యాప్తు చేయడం.. నోటీసులు జారీ చేయడం.. సుప్రీం కోర్టు కూడా అక్షింతలు వేయడంతో ఒక మెట్టు దిగి ఈసారి మరో రెండు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి 1,398 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు కొత్త ఆఫర్ ను ముందు పెట్టారు.

 

అంతేకాదు మాల్యాకు ఒక పక్క నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి.. రెడ్ కార్నార్ నోటీసు వచ్చే అవకాశాలు ఉన్నా ఇంకా దారికి రానట్టే కనిపిస్తుంది. విదేశాల్లో తనకున్న ఆస్తుల వివరాలు తెలియజేయాలంటూ బ్యాంకులు కోర్టు ద్వారా అడిగిన నేపథ్యంలో ఆయన తన లాయర్ల ద్వారా చాలా పెడసరంగా సమాధానాలు ఇచ్చారు. తన విదేశీ ఆస్తుల వివరాలు కోరే హక్కు, అధికారం బ్యాంకులకు లేదని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. రుణాలు ఇచ్చినప్పుడు బ్యాంకులు తన విదేశీ ఆస్తులను చూసి ఇవ్వలేదని, అలాంటప్పుడు ఇప్పుడెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జూన్ 26వ తేదీన సీల్డ్ కవర్ లో తన ఆస్తుల వివరాలు తెలియజేసేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు.