TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Published on: Wed Aug 6, 2025 8:36PM

 

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. 

అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు. 

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.