చంద్రబాబు వైపు 'చిరు' వర్గం

 

 

 

రాష్ట్రంలో గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాలు టిడిపి పార్టీకి లాభంచేకూర్చేవిధంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మొదట్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న 'కాపు సామాజికవర్గం' తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. అయితే తాము నమ్మినవారందరు తమని నట్టేట ముంచుతూ వస్తున్నారని భావించిన 'కాపు సామాజికవర్గం'...తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

 

రెండు రోజుల క్రితం చిరంజీవి తనవర్గ ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సంధర్బంగా వారందరూ తాము టిడిపి పార్టీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని చిరుతో తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే చిరంజీవి మాత్రం వారిని కాంగ్రెసునుంచి ఫిరాయించకుండా నిలువరించడంలో తన ప్రయత్నాలను ఇంకా ఆపలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉమ్మడిగా అందరితో కలిసి భేటీ అయిన చిరంజీవి, ఇప్పుడు ఒక్కరొక్కరుగా పిలిపించి మాట్లాడుతున్నారట. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తమకు పార్టీ మారడం తప్ప వేరే గత్యంతరం లేదని అన్నారట. తన వెంట కాంగ్రెసులోకి వచ్చిన వారు ఇప్పుడు వెళ్లిపోతే గనుక.. ఆ ప్రభావం తన కెరీర్‌ మీద పడుతుందని చిరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.


 
ఈ వార్తలకు నిదర్శనంగానే ప్రస్తుతం కాంగ్రెస్ లో వున్న కొంతమంది కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తూర్పుగొదావరికి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రామాచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులూ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి తెలుగు దేశంలో చేరనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని... కాపులకు మరింత దగ్గరయ్యేందుకు టిడిపి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.