చంద్రబాబుకు సమస్యగా మారిన వంశీ?
Published on: Wed May 23, 2012 3:40PM
జగన్ తో సన్నిహితంగా మాట్లాడి ఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మరో కొత్తచిక్కులో చిక్కుకున్నారు. జగన్ తో మాట్లాడినందుకే ఆగ్రహం తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వంశీపై వచ్చిన కొత్త ఆరోపణలు తలనొప్పిగా మారాయి. కృష్ణాజిల్లాలో మద్యం సిండికేట్ల జాబితాలో ప్రధానంగా భావిస్తున్న23మందిలో వంశీ తొమ్మిదోవాడు. ఈ జిల్లాలో 41షాపులు సిండికేట్ పాలనలో నడుస్తున్నాయి. అయితే అధికారులతో కుమ్మక్కయి మొత్తం వ్యవహారం భారం మోస్తున్నది మాత్రం 23మందే. ఈ జాబితాను కోర్టులో సమర్పించిన ఎసిబి డిఎస్పీ మొత్తం సిండికేట్ బాధ్యతనంతా ఆ 23మందే మోస్తున్నారని స్పష్టం చేశారు. న్యాయమూర్తికి ఈ జాబితా సమర్పించినందుకు కోర్టులో వంశీ హాజరుకావల్సి ఉంటుంది. ఇటీవల జగన్ తో మాట్లాడిన వంశీ తాను జూనియర్ ఎన్టీఆర్ గ్రూపుగా పరోక్షంగా పరిచయం చేసుకోవటం, దాన్ని కాదని జూనియర్ ఎన్టీఆర్ ఖండించటం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు కూడా ఇది కుటుంబసమస్యగా మారుతుందని మొదట్లో హెచ్చరించినా తరువాత తగ్గారు. కానీ, ఇప్పుడు ఏకంగా సిండికేట్ జాబితాలో తొమ్మిదో పేరు వంశీది కావటంపై ఎటువంటి స్పందన చూపుతారోనని తెలుగుదేశం శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేకించి క్రమశిక్షణాచర్య దాకా వెళ్లినా వెళ్లవచ్చని భావిస్తున్నారు.


