ఇళ్లలో, ఆఫీసుల్లో, కార్లలో... 'చల్లటి' కుంపట్లు!


మనిసి బలం, బలహీనత రెండూ ఒక్కటే! అదే తెలివి! కేవలం ఆ తెలివి వల్లే మనిషి ఒకప్పుడు గుహల్లో, చెట్టు తొర్రల్లో వుండే వాడు... ఇప్పుడు బిల్డింగ్ లు, బంగళాల్లో వుంటున్నాడు! కాని, అదే (అతి) తెలివి వల్ల ఒకప్పటి మనుషుల కంటే ఆధునిక మానవుడు చాలా ఎక్కువ అశాంతితో జీవిస్తున్నాడు. అన్నీ వున్నా అన్నిటికీ కటకటలాడుతూ బతుకు కొనసాగిస్తున్నాడు... 

మనిషికి ఇప్పుడు కావాల్సినంత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా, గత రెండు వందల ఏళ్లలో మానవుడు దేన్ని వదల్లేదు. అంతరిక్షంలోకి రాకెట్లు వేసుకుని వెళ్లిపోయాడు. పాతాళంలోకి డ్రిల్లింగ్ చేస్తూ ఏ ఒక్క ఖనిజమూ, నీటి బొట్టూ వదలటం లేదు! మొత్తం ప్రకృతిని ఉన్మాదం ప్రకోపించి విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాడు. అసలు మనిషి ఎంతగా స్వార్థ జీవి అయిపోయాడంటే తాను కూడా ప్రకృతిలో భాగమనే విషయమే మరిచిపోయాడు. ప్రకృతిని, భూమిని ధ్వంసం చేస్తే తానూ విధ్వంసం అవుతానని కూడా గ్రహించటం లేదు... 

మనిషి తయారు చేసే భారీ రాకెట్లు , అంతరిక్ష నౌకలు మొదలు చిన్న ప్లాస్టిక్ కవర్ వరకూ ప్రపంచానికి హాని చేయనిది ఏది? అన్నీ కాలుష్య కారకాలే! భూ కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం సమస్తం కలుషితమే! వీటన్నిటికి మూలమైన కాలుష్యం ఏదో తెలుసా? మనో కాలుష్యం! మనిషి మనస్సు కలుషితం అయిపోయింది. దాని వల్లే మొత్తం విశ్వం కాలుష్యంతో నింపేస్తున్నాడు... 

అది కలుషితం అవుతోంది, ఇది కలుషితం అవుతోంది అంటూ శాస్త్రవేత్తలు , ఉద్యమకారులు ప్రతీ రోజూ హెచ్చరిస్తూనే వుండటం ఈ మధ్య సర్వ సాధారణమైపోయింది. ఒక రకంగా గత కొన్నేళ్లుగా కాలుష్యం కూడా సహజమైపోయింది! మనుషులు ఈ కొత్త విషాదానికి అలవాటు పడిపోతున్నారు. ఎన్ని రోగాలు వచ్చినా స్వార్థాన్ని, సుఖాల్ని మాత్రం వదల్లేకపోతున్నారు. ఇందుకు మరో చక్కటి ఉదాహరణ మనం వాడే ఏసీలు, ఫ్రిడ్జ్ లు!

చల్లగా గాలినందించే ఏసీలు ఈ మధ్య ప్రతీవారూ వాడేస్తున్నారు. ఏసీలు లేని వారు వచ్చే వేసవి కల్లా ఏసీ బిగించుకోవాల్సిందేనని తెగ తాపత్రయపడుతున్నారు. కాని, ఏసీ బిగించుకోవటం అంటే... మన మెడకు మనమే ఒక చల్లటి ఉరితాడు బిగించుకోవటం! ఇది కాస్త అతిగా అనిపించినా ప్రపంచ వ్యాప్తంగా ఏసీలు చేస్తున్న దారుణం అంతా ఇంతా కాదు. వాటి వల్ల భూమ్మీద ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. అందుక్కారణం ఏసీలు వదిలే హైడ్రోఫ్లోరో కార్బన్స్ ( హెచ్ఎఫ్ సీ ).

ఏపీల్లో  వాడే హెచ్ఎఫ్ సీ వల్ల మన రూములు, కార్లలో గాలి చల్లగా మారుతుంది. కాని, బయట వున్న వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. ఇది ఎంత గణనీయమైన స్థాయిలో జరుగుతోందంటే, ఇప్పటికిప్పుడు అన్ని దేశాలూ మూకుమ్మడిగా ఏసీల వాడకం సగానికి తగ్గిస్తే... వెంటనే 0.5శాతం ఉష్ణోగ్రత భూమ్మీద తగ్గిపోతుందట! ఏసీల కాలుష్యం వల్ల 0.5శాతం ఉష్ణోగ్రత నమోదవుతోందంటే ఎంత తీవ్రంగా మనం వాతావరణం పాడుచేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు.... 

ఏసీల్లాగే రెఫ్రిజిరేటర్లు కూడా చల్లని మంటే! ఆ మంట మన కింద మనమే రాజేసుకుంటున్నాం. మూసున్న ఫ్రిడ్జ్ డోర్ల వెనుక వున్న వస్తవులు, నీళ్లు, ఐస్ క్రీం ... అన్నీ చల్లగా అవుతాయి గాని బయటి ప్రపంచం మాత్రం వేడెక్కిపోతుంది. ఇక్కడా హైడ్రో క్లోరో కార్బన్సే కారణం. పైగా ఫ్రిడ్జ్ ఇరవై నాలుగ్గంటలూ ఆన్ లో వుండే చల్లటి కుంపటి! నిరంతర కాలుష్య యంత్రం కూడా...

ఏసీలు, ఫ్రిడ్జ్ లే కాదు ఆఖరుకి హెయిర్ స్ప్రేలు కూడా గాల్లోకి కాలుష్యం వెదజల్లుతున్నాయట!జుట్టు ఎటు దువ్వితే అటు మలగటానికి, సువాసనకి ఈ హెయిర్ స్ప్రేలు వాడతారు. బాడీకి పర్ఫ్యూమ్ ల జుట్టుకి ఇవన్నమాట. కాని, హెయిర్ స్ప్రేర్ కూడా వాతావరణంలోకి హైడ్రోక్లోరో కార్బన్స్ వదులుతుందట! ఇక అటువంటి విషపూరితమైన హెయిర్ స్ప్రేలు మనిషి వెంట్రుకలకి హానికరం అని ప్రత్యేకంగా చెప్పాలా? 

ప్రపంచంలో చల్లటి కుంపట్లు రాజేసి భూమిని వేడెక్కిస్తున్న ఘనత అమెరికా, చైనాలదే! ఆ రెండు దేశాల్లోనే అత్యధిక ఏపీలు, రెఫ్రిజిరేటర్లు వాడుతున్నారట. మన ఇండియా లాంటి దేశాలేం వెనుకబడిపోలేదు. ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో కొత్త ఏపీలు, ఫ్రిడ్జ్ లు భగ్గున మండిస్తున్నాయి. ఇప్పటికైనా సరే వీటి వాడకం జనం తగ్గించాలి. శాస్త్రవేత్తలు కూడా హానికరం కాని టెక్నాలజీ కనుక్కునే పనిలో పడాలి. అప్పుడే మనకి ఇళ్లలో, ఆఫీసుల్లో, కార్లలో రాజుకున్న చల్లటి కుంపట్ల నుంచి విముక్తి లభించేది!