ఇప్పుడు సోదంతా సోషల్ మీడియాలోనే!

మన్మథుడు సినిమాలో ఓ సీన్ వుంటుంది... అందులో హీరోయిన్ ఆఫీస్ లోని ఇతర లేడీ ఎంప్లాయిస్ అందరికీ ఏదో మ్యాటర్ చెబుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో చీవాట్లు పెడతాడు. ఆఫీస్ టైంలో కబుర్లేంటని ఇరిటేట్ అవుతాడు. ఇలాంటి సీన్స్ రియల్ గా కూడా ఆఫీసుల్లో బోలెడు జరుగుతుంటాయి. ఉద్యోగులు కబుర్లతో కాలం గడిపేస్తుంటారు. అది కాస్తా పని మీద ప్రభావం చూపుతుంది. ఇన్ ఛార్జులో, బాస్ లో కేకలేసేస్తుంటారు! కాని, ఇప్పుడు కాలం మారిపోయింది. ముందులా కబుర్లు చెబుతూ కాలం వృథా చేయటం లేదు ఎంప్లాయిస్. అలాగని బుద్ధిగా పని చేసుకుంటున్నారనుకోకండి! ఫేస్బుక్ లో దూరి ప్రపంచంతో కబుర్లు చెప్పేస్తున్నారు... 
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ సైట్స్ ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయాయి. రోజులో కొంతసేపైనా వాటిల్లోకి లాగిన్ అయ్యి నాలుగు లైక్లు, రెండు కామెంట్స్, ఓ షేర్ చేసి వస్తుంటారు! కాని, కొంత మంది మాత్రం అదే పనిగా ఫేసుల్ని ఫేస్బుక్ లోంచి బయటకు తీయటం లేదట! చూసే వారికి వీరు సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది కాని జరిగేది ఏమీ లేదు. ఫేస్బుక్ లో అలా అలా టైం గడిపేస్తుంటారు.
ఈ మధ్య డ్యూటీ టైంలో సోషల్ మీడియా చూసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోందట. అది కూడా మధ్యాహ్నం భోజనం అయ్యాక చాలా ఎక్కువగా ఫేస్బుక్ లాంటి వాటిల్లో టైంపాస్ చేస్తున్నారట! సగటున రెండున్నర గంటలు ఈ వ్యవహారానికే సరిపోతోంది. అదే ఆపీస్ లో లేని సమయంలో కేవలం గంటన్నర మాత్రమే సోషల్ మీడియా చూస్తున్నారు. సో... చక్కగా పని చేసి సంస్థకి ఉపయోగపడాల్సిన సమయంలో కాలం వృథా చే్స్తున్నారన్నమాట ఉద్యోగులు!
ఫేస్బుక్ లాంటి వాటి వల్ల విలువైన సమయం వృథా అవుతోంది కాబట్టి వాట్ని తమ ఆపీసుల్లో నిషేధిస్తే ... అది కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తుందంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా అందుబాటులో లేకుంటే ఉద్యోగులు హ్యాపీగా పని చేస్తారని గ్యారెంటీ ఏం లేదు. కాబట్టి ఫేస్బుక్ , ట్విట్టర్ లాంటివి వాళ్లకు అందుబాటులో వుంచుతూనే ఎక్కువ సమయం గడపకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతే కాకుండా ఎవరికి వారు కూడా తమ సోషల్ మీడియా వ్యసనంపై దృష్టి పెట్టాలి. సంస్థకి నష్టం కాకుండా చూడటమే కాక వ్యక్తిగతంగా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే, సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలో వ్యసనంగా మారితే అన్ని నష్టాలు కూడా...