సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష మొదలు

 

 

 

రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సీమాంధ్ర ఎంపీలు సంకల్ప దీక్ష చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఆ దీక్షలో పాల్గొన్నారు. వారందరూ తమ యంపీ పదవులకు రాజీనామాలు చేసామని చెప్పుకొంటారు. కానీ నేటికీ అవి ఆమోదం పొందలేదు గనుక యంపీలుగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టామంటారు. కానీ అది సభలో చర్చకే రాదు.

 

ఇప్పడు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ రెండు రోజులు దీక్ష చేయబోతున్నారు. కానీ రాష్ట్ర విభజన ఆగబోదు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నపుడు యంపీలయిన వారందరూ అధికారికంగా ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద వారు చేసే దీక్షవల్ల కొత్తగా ఏమి ఒరుగుతుందో వారికే తెలియాలి.



బహుశః తామే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కావచ్చును. రేపు తెలంగాణావాదులెవరయినా అక్కడకి వచ్చిఅలజడి సృష్టిస్తే, తాము ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నామని చెప్పుకొని సానుభూతి ఓట్లు కూడా ఆశించవచ్చును.