పాక్ లో బందీ అయిన 'దేవసేన' కథ!
posted on Sep 7, 2016 5:40PM

''మాహిష్మతి ఊపిరి పీల్చుకో! బాహుబలి వచ్చేశాడు!'' అంటుంది దేవసేన! ఒంటి నిండా భారీ ఇనుప గొలుసులతో మాసిపోయిన బట్టలతో అనుష్క పాత్రని ఎవరమైనా ఎలా మరిచిపోగలం? కాని, ఇప్పుడు మాహిష్మతిలోని ఆ దేవసేనలానే పాకిస్తాన్ లోని ఓ దేవసేన గురించి కూడా మనం తెలుసుకోవాలి! అయితే, ఈ పాకీ దేవసేన మనిషి కాదు... మాహిష్మతి ఏంటి, దేవసేన ఏంటి, మనిషి కాకపోవటం ఏంటి అంటారా? మరేం లేదు, విషయం అర్థం కావాలంటే ఇప్పటి పాకిస్తాన్ లోని లాండీ కంటోన్మెంట్ ప్రాంతానికి వెళ్లాలి. అఫ్గానిస్తన్ సరిహద్దు వద్ద వుంటుంది ఈ ఆర్మీ ఏరియా. అయితే, ఇక్కడ ఎక్కువగా వుండేది గిరిజనులు. బ్రిటీషర్లు ఒకప్పుడు ఈ గిరిజనులు తిరుగుబాటు చేయోద్దని అత్యంత దర్మార్గమైన చట్టాల్ని ప్రయోగిస్తుండేవారు. అలాంటి చట్టమే ఫ్ట్రాంటియర్ క్రైమ్స్ రెగ్యులేషన్ లా.
1898లో ... అంటే శతాబ్దం కిందట లాండీ కంటోన్మెంట్ బ్రిటీషర్ల చేతిలో వుండేది. అఖండ భారతంలో భాగమైన ఆనాటి ఆర్మీ ఏరియాని జేమ్స్ స్క్విడ్ అనే అధికారి పాలిస్తుండేవాడు. అతను ఓ రోజు తాగిన మైకంలో తూలుతూ వస్తుండగా అతనిపైకి ఓ మర్రి చెట్టు వచ్చినట్టుగా అనిపించిందట! నిజానికి మద్యం మత్తు, అధికార మత్తు రెండూ ఎక్కువైన బ్రిటీష్ అధికారే చెట్టు మీదకు వెళ్లి ఢీకొట్టాడు. కాని, తప్పు చెట్టే చేసిందనుకుని దానికి శిక్ష విధించాడు! వెంటనే గొలుసులతో బంధించి, ఆ చెట్టు ఖైదీ అని ప్రకటిస్తూ ఓ బోర్డ్ తగించమన్నాడు! రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు భారీ గొలుసులతో మర్రి చెట్టును ఖైదు చేశారు! ఇప్పటికీ ఆ దేవసేన లాంటి మర్రి చెట్టు అలానే వుంది!
బ్రిటీష్ అధికారి ఎవడో తప్ప తాగి చెట్టును బందిస్తే ఇప్పటి పాకిస్తానీ పాలకులకు ఏం రోగం? వందేళ్ల తరువాతైనా చెట్టుకు తగిలించిన గొలుసులు తీసి దాన్ని బంధ విముక్తం చేయోచ్చు కదా? అలా జరగటం లేదు దాయాది దేశంలో! పాకిస్తాన్ ప్రదాని స్వయంగా 2008లో, 2011లో చెప్పినా కూడా చెట్టును విడుదల చేయలేదట సంబంధిత అధికారులు! ఎందుకంటే, గిరిజనుల్ని అక్రమంగా అరెస్ట్ చేయటానికి ఆనాటి బ్రిటీష్ వారు ఉపయోగించిన ఫ్ట్రాంటియర్ క్రైమ్స్ లా ఇంకా అమలులో వుందట నేటి పాకిస్తాన్ లో! అందుకే, చెట్టుకున్న గొలుసులు ఇష్టానుసారం తొలిగించలేకపోతున్నారట!
బ్రిటీష్ కాలం నాటి అమానుష చట్టాల్ని ఇంకా గిరిజనులపై ప్రయోగిస్తున్న దేశంలో... మర్రి చెట్టును విడిపించే వారెవరుంటారు? అయినా బలూచిస్తాన్ ప్రాంతం మొత్తం వేలాది గిరిజనుల్ని ప్రతీ యేటా నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటుంది పాక్ మిలటరీ! వాళ్లకు ఈ కదలని , మెదలని మర్రి చెట్టు ఓ లెక్కా! అందుకే, బ్రిటీష్ వాడు వేసి పోయిన గొలుసుల్ని పాక్ అధికారులు బద్ధకంగా అలాగే వుంచేస్తున్నారు. తమ దేశం ఎక్కడ ఆగిపోయిందో వారు చెప్పకనే చెబుతున్నారు!