ఓర్పు జీవితాన్ని శాసిస్తుందా?

‘Patience pays’ అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది. ఓర్పుగా ఉండాల్సిన అవసరం గురించీ, అసహనం వల్ల కలిగే నష్టాల గురించీ మన ఇతిహాసాలలో లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. కానీ ఉరుకులుపరుగులతో సాగే ఈనాటి జీవితంలో ఓర్పు అవసరమేనా? అన్న సందేహం కలుగక మానదు. అవసరమే అని నిరూపిస్తోంది ఓ పరిశోధన. 50 ఏళ్లుగా ఈ ప్రపంచానికి ఓర్పుగా ఉండమని హెచ్చరిస్తోంది. అదే...

 

Marshmallow experiment

 

మార్ష్‌మలో అనేది పాశ్చత్య దేశాలలో విరివిగా దొరికే ఒక తీపి పదార్థం. అక్కడి పిల్లలకు ప్రాణం. ముఖ్యంగా, రకరకాల చిరుతిళ్లు అందుబాటులో లేని 1960వ దశకంలో మార్ష్‌మలో కోసం పిల్లలు తెగ పేచీ పెట్టేవారు. పిల్లల్లో ఉండే ఈ బలహీనత ఆధారంగా వారిలో ఏ మేరకు సహనం ఉందో పరీక్షించాలనుకున్నాడు... స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘వాల్టర్‌ మిషెల్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. అందుకోసం తన విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ఒక బడిని ఎంచుకున్నాడు.

 

సహనంతో ఉంటే బహుమతి

 

 

వాల్టర్‌ మిషెల్‌ తన పరిశోధన కోసం 4-6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కొందరు పిల్లలను ఎంచుకొన్నాడు. వారిని ఒంటరిగా ఒక గదిలో ఉంచి, వారి ముందర ఒక మార్ష్‌మలోని ఉంచారు. ‘నువ్వు కనుక ఈ మార్షమలోని కాసేపు తినకుండా ఉండగలిగితే, నేను తిరిగి వచ్చి ఇంకో మార్షమలోని బహుమతిగా ఇస్తాను’ అని ఆ పిల్ల/పిల్లవాడికి చెప్పారు. ఇక అప్పటి నుంచి చూడాలి ఆ పిల్లల తిప్పలు. కళ్ల ముందు ఊరిస్తున్న మార్ష్‌మలోని తినకుండా ఉండేందుకు వారు రకరకాల విన్యాసాలు చేశారు. కొందరు తలతిప్పుకున్నారు. కొందరు దాన్ని నాకి తిరిగి పెట్టేశారు. కొందరు పాటలు పాడుతూ కూర్చున్నారు. ఇంకొందరు ఇవేవీ చేయకుండా..... గబుక్కున ఆ మార్ష్‌మలోని తీసుకుని నోట్లో వేసేసుకున్నారు. వెధవ బహుమతి పోతే పోయింది అనుకున్నారు.

 

పిల్లలాట కాదు!

 

 

మొత్తానికి ఒక మూడోవంతు మంది పిల్లలు మాత్రమే రెండో మార్ష్‌మలోతో పరిశోధకులు వచ్చేదాకా, ఓపికగా ఎదురుచూసినట్లు తేలింది. అయితే ఇదేదో సరదా కోసం చేసిన పరిశోధన కాదు! చిన్నతనంలోనే ఓర్పుని అలవర్చుకున్న పిల్లల జీవితం పెద్దయ్యాక ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు సాగిన ఒక ప్రయత్నం. ఒక పదేళ్ల తరువాత, ఇరవై ఏళ్ల తరువాత... ఆఖరికి ఈ మధ్యకాలంలో కూడా వీరందరి జీవితాలను గమనించినప్పుడు, అసాధారణమైన వ్యత్యాసం కనిపించింది. అప్పట్లో ఓర్పుగా ఉన్న పిల్లలు తరువాత రోజుల్లో మంచి మార్కులను సాధించడం కనిపించింది. వ్యసనాలకు లోనవడం, ఒత్తిడికి గురవడం, ఊబకాయం బారిన పడటం.... వీరిలో తక్కువగా బయటపడ్డాయి. అప్పట్లో ఓర్పు లేని పిల్లలతో పోలిస్తే, వీరిలో సామాజిక నైపుణ్యాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ఆఖరికి ఓర్పు ఉన్నవారు, లేనివారి మధ్య మెదడు పనితీరులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు.

 

మార్ష్‌మలో పరిశోధన పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఒక గుణపాఠమే! ఎందుకంటే ఓర్పుని అలవర్చుకోవడం ఎవరికీ అసాధ్యం కాదు. నాలుగేళ్ల పిల్లలే సహనంతో ఉండగలిగితే... 40 ఏళ్ల పెద్దలకు అదేమంత భారం కాబోదు. పైగా ఓర్పుని సాధించేందుకు మన భారతీయుల దగ్గర ధ్యానం, యోగ, గీతాబోధ వంటి సాధనాలు ఉండనే ఉన్నాయి. మరెందుకాలస్యం! మనమూ ఆ ఓర్పుగా ఉన్న పిల్లలని అనుసరిద్దాం! జీవితంలో అమృతఫలాలను బహుమతిగా సాధిద్దాం.


 

- నిర్జర.