స్ఫూర్తిదాయకం బాలమురళి జీవితం

కర్ణాటక సంగీతంలో మరో అధ్యాయం ముగిసింది. త్యాజరాజులవారి శిష్యపరంపరలో మరో తరం గడిచింది. చాలాఏళ్లు అలిగి తెలుగువారికి దూరంగా ఉన్నా... మన గుండె లయల్లో ఒకటై సాగిన నాదం ఆగిపోయింది. బాలమురళిది 86 ఏళ్ల నిండైన జీవితమే! కాదనం! కానీ వందేళ్లు బతికినా కూడా ఆయన మనతోనే ఉండిపోతే బాగుండు అనుకునేంత ప్రభావం ఆయనది. సంగీత ప్రపంచమే విషాదరాగాన్ని ఆలపిస్తున్న ఈవేళ బాలమురిళి గురించి కొన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలు...
బాల అనేది బిరుదు మాత్రమే

 


బాలమురళి పుట్టిన 15వ రోజుకే ఆయన తల్లిగారు చనిపోయారు. తనకి కొడుకు పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టాలనుకుంది ఆమె. దాంతో ఆయనకు అదే పేరు ఖాయమైంది. బాల అనేది బిరుదు మాత్రమే! పట్టుమని ఎనిమిదేళ్లయినా లేని వయసులో మురళీకృష్ణ విజయవాడలోని త్యాగరాజ ఆరాధన ఉత్పవాలలో పాల్గొన్నారు. అక్కడ ఏకబిగిన రెండున్నర గంటలు పాడిన మురళి విద్వత్తుకి మెచ్చుకొని... బాల అన్న బిరుదుని అందించారు. అయితే బాలుడిలాగా తాను నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్న విషయాన్ని ఆ బిరుదు గుర్తుచేస్తూ ఉంటుందని అంటారు బాలమురళి.

 


మ్యూజిక్‌ థెరపీతో కోమాలోంచి బయటకు
ఈ సృష్టి అంతా నాదానుగుణంగానే సాగుతోందని హైందవుల నమ్మకం. ఆ వాదాన్ని మరింతగా విశ్వసిస్తారు బాలమురళి. లయబద్ధమైన సంగీతంతో ఎలాంటి మొండిరోగాన్నయినా నయం చేయవచ్చునంటారు. సంగీతంతో స్వస్థత అనే విషయం మీద బాలమురళి అనేక ప్రయోగాలు చేశారు. ఆయన అందించిన స్ఫూర్తితో రామ్‌భారతి వంటి శిష్యులు మ్యూజిక్‌ థెరపీ మీద మరింత విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. తన మ్యూజిక్‌ థెరపీతో మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జీ.రామచంద్రన్‌ను ఏకంగా కోమా నుంచే బయటకు తీసుకువచ్చానని చెబుతారు బాలమురళి.

 


అనురక్తితోనే అసలు విద్య
బాలమురళి కుదురుగా ఎవరో ఒక గురువు దగ్గర సంగీతం నేర్చుకున్నది లేదు. చదువు కూడా అంతంతమాత్రమే! సాధన కూడా అంతగా చేయనంటారు బాలమురళి. కానీ ఏ స్వరాన్నయినా ఒకసారి వింటే ఇట్టే పట్టేయగలరు. ఏ భాషలో పాటనైనా, పది నిమిషాల్లో మెదడులో నిక్షిప్తం చేసుకోగలరు. ‘అదిగో భద్రాద్రీ’ అంటూ కీర్తనలను ఆలపించినా, ‘మౌనమె నీ భాష ఓ మూగమనసా’ అంటూ సినిమా పాటలను పాడినా, అన్నమయ్య కీర్తనలకు స్వరాన్ని సమకూర్చినా, ‘ఆది శంకరాచార్య’ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించినా... సంగీతం పట్ల ఆయనకు ఉన్న అభినివేశమే దానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ బాలమురళి ముద్రని నిలిపింది.

 


అహంకారం కాదు ఆత్మవిశ్వాసం
ఏమీ సాధించకుండానే కళాకారులు అహంకరించిపోతున్న రోజులివి. కాస్తంత సృజన ఉంటే చాలు ఎగిరెగిరి పడే సందర్భాలివి. ఇలాంటివారితో పోలిస్తే బాలమురళి ప్రతిభ వేయింతలు కావచ్చు. కానీ అంతటివాడికైనా అహంకారం ఎందుకన్న విమర్శలూ లేకపోలేదు. పైగా మహతి వంటి కొత్త రాగాలను ఆవిష్కరించడం, మాట పట్టింపు వస్తే వెనక్కి తిరిగి చూడకపోవడం, సంగీతంలో తనకు తిరుగులేదని బహిరంగంగానే చెప్పుకోవడంతో ఆయనకు అహంకారం అంటారు విమర్శకులు. కానీ తనది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం అంటారు బాలమురళి.

 


బాలమురళి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా శీర్షకలే పెట్టుకోవలసి వస్తుంది. చిన్నప్పుడే తల్లి నుంచి దూరమైనా సంగీత సరస్వతి ఒడిలో పెరిగిన ఈ బాలుడు రామదాసు కీర్తనలను ఆలపిస్తూనే ఆ రామయ్య పాదాల చెంతకి చేరుకోవడం ఆశ్చర్యమేమీ కాదు. మరో బాలమురళి జన్మించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సంగీత ప్రపంచం వైపుగా వేసే అడుగులెన్నో! ఆ స్ఫూర్తి ఉన్నంతవరకూ బాలమురళి సంగీతరవళి ఓంకారనాదంలా వినిపించీ వినిపించకుండా ప్రభవిస్తూనే ఉంటుంది.

 

 

- నిర్జర.