చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్

 

 

 

బెర్లిన్ గోడ ముక్క అంటూ ఓ రాయిని చూపించి, మళ్లీ తెలుగు మాట్లాడేవాళ్లందరినీ ఒకే రాష్ట్రంలోకి తీసుకొస్తానన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా ఉంది. ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తనకు వేసుకోడానికి ‘చెప్పులు ’ లేకపోయినా పర్వాలేదు గానీ, తొక్కడానికి ‘సైకిల్’ ఉంటే చాలంటున్నారు.

 

ఒకవైపు శైలజానాథ్‌ను కిరణ్ తమ పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించగా... శైలజానాథ్ మాత్రం తనకు ఆ పార్టీతో సంబంధం లేదన్నట్లుగానే మాట్లాడారు. "నా వెంట నడిచిన అన్ని వర్గాల ప్రజలనూ సంప్రదించి... ఏ పార్టీలో చేరబోయేదీ గురువారం ప్రకటిస్తా'' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి, తెలుగు ప్రజల అభివృద్ధికి పని చేసే పార్టీలోనే చేరతానని కూడా తెలిపారు. శైలజానాథ్, టీడీపీ మధ్య ఇప్పటికే మధ్యవర్తుల స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో శింగనమలలో శైలజానాథ్‌పై టీడీపీ అభ్యర్థిగా శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ. ప్రస్తుతం శింగనమలలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధమైతే, చేర్చుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.