బయ్యారంపై కేసిఆర్ అనవసర ఆరోపణలు
posted on Apr 30, 2013 5:02PM

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో లక్షా యాభై వేల ఎకరాల గనులను ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు వాటిని ప్రభుత్వ రంగ సంస్థకు ఇస్తే మాత్రం ఎందుకు గొంతు చించుకుంటున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటును వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కెసిఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బయ్యారం గనులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎల్లుండి తెలంగాణ బందు ప్రజల కోసం కాదని వారి రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. బందుకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. బందును తాము వ్యతిరేకిస్తున్నామని, మెదక్ జిల్లా ప్రజలు సహకరించరన్నారు. బందును సమర్థవతంగా ఎదుర్కోంటామన్నారు.