సెలయేరులాంటి సమాజం

అది హిమాలయ పర్వతాల కింద ఓ చిన్న పట్నం. ఆ పట్నంలోకి ఓ సెలయేరు ప్రవహిస్తూ ఉండేది. పర్వతాల నుంచి ప్రవహించే ఆ సెలయేరుతో పట్నం అద్భుతంగా తోచేది. ఆ సెలయేరుని మరింత అందంగా తీర్చిదిద్దడం ఎలా అన్న ఆలోచన వచ్చింది ఊరిపెద్దలకి. ‘ఏముంది సెలయేరులోకి పై నుంచి ఎలాంటి చెత్తా చెదారం వచ్చి చేరకుండా ఎవరినన్నా నియమిస్తే సరి!’ అని సూచించాడు ఓ యువకుడు. ఆ సలహా మిగతా ఊరిపెద్దలకు నచ్చడంతో వెంటనే ఓ కుర్రవాడని నియమించారు. ఆ సెలయేటిలోకి చేరుతున్న ఎండుటాకులు, పుల్లముక్కలనీ శుభ్రం చేస్తూ ఉండటమే ఆ కుర్రవాడికి పని!

 

ఏళ్లు గడిచేకొద్దీ ఆ సెలయేరు మరింత అందంగా రూపొందింది. ఆ సెలయేటిలో మునకలు వేసేందుకు ఎక్కడి నుంచో హంసలు వస్తుండేవి. ఆ సెలయేటి చెంతనే గాలిమరలు ఏర్పాటయ్యాయి. వీటన్నింటినీ చూడ్డానికి వెలాదిగా యాత్రికులు రావడం మొదలుపెట్టారు. ఓ ముప్ఫై ఏళ్లకి ఆ పట్నం ప్రముఖ పర్యటకక్షేత్రంగా మారిపోయింది. ఒక రోజు ఊరిపెద్దలంతా సమావేశమయ్యారు. ఆ ఏడాది ఊరి కోసం చేసిన ఉమ్మడి ఖర్చులను పరిశీలిస్తుండగా వారికి సెలయేటిని శుభ్రం చేసేందుకు చెల్లిస్తున్న లెక్కలు కనిపించాయి. ‘శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో చెత్త ఏముంటుంది. దీని కోసం ఒక మనిషిని నియమించడం ఏమిటి? జీతం పేరుతో డబ్బులు దండగ చేయడం దేనికి!’ అంటూ ఓ ఊరిపెద్ద మండిపడ్డాడు. అతనితో పాటు మిగతా ఊరిపెద్దలు కూడా అంతా కుర్రకారే! వారంతా కలిసి ఆ ‘చెత్త’ మనిషిని ఉద్యోగంలోంచి తొలగించాలని నిర్ణయించారు.

 

ఊరిపెద్దలు తీసుకున్న నిర్ణయం వల్ల మొదట్లో పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ నిదానంగా ఆకురాలు కాలం మొదలైంది. కొండ మీదనున్న చెట్ల ఆకులన్నీ సెలయేటిలో కలవసాగాయి. ఎండిన కొమ్మలు విరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకోసాగాయి. వాటితో తెల్లటి నీరు కాస్తా పసుపుపచ్చగా మారింది. మరికొన్నాళ్లకి ఆ పసుపుపచ్చ నీరు కాస్తా మురికిపట్టి నాచుతో ఆకుపచ్చరంగులోకి జారింది. ఇంకొన్నాళ్లకి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయి, చెత్త పేరుకుపోయి తెల్లటి సెలయేరు కాస్తా నల్లటి బురదగా మారింది. నీటి ప్రవాహం లేకపోవడంతో గాలిమరలు నిలిచిపోయాయి. ఎటుచూసినా దుర్గంధంతో పట్నంలోని జనాలకు నానారోగాలూ వ్యాపించసాగాయి. ఆ పట్నంలోకి అడుగుపెట్టేందుకే పర్యటకులు భయపడిపోయారు. ఇక హంసల సంగతి సరేసరి!

 

ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు ఊరిపెద్దలంతా సమావేశమయ్యారు. ఆ సమావేశంలోకి ఒక కొత్త మనిషి కూడా అడుగుపెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తుండగా ‘మీలో చాలామంది నన్ను చూసి ఉండరు. ఓ ముప్ఫై ఏళ్ల నుంచి నేను ఈ సెలయేటిని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ పట్నంలోకి చేరుకునే సెలయేటి దారిలో ప్రయాణిస్తూ అందులోకి చేరే చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాను. నేను చేస్తున్న పని అద్భుతమో కాదో నాకు తెలియదు. కానీ ఆ పని వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉందని మాత్రం నాకు తెలుసు. ఈ పట్నం నన్ను గుర్తించకపోయినా, నా శ్రమని ఎవరూ గౌరవించకపోయినా నా పనిని నేను నిశ్శబ్దంగా చేసుకుపోయాను. నా చిన్న పని వల్ల అప్పటికప్పుడు ఫలితం కనిపించకపోవచ్చు. కానీ నాది వృధా ప్రయాస కాదు. ఆ విషయం ఈపాటికే మీరు అర్థమై ఉంటుంది,’ అంటూ ముగించాడు.

 

అతని మాటలు విన్న ఊరిపెద్దలకి తమ తప్పేమిటో అర్థమైంది. పట్నం క్షేమంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి అవసరమూ ఎంతటిదో తెలిసివచ్చింది. వెంటనే అతడిని క్షమాపణ కోరి మళ్లీ ఉద్యోగంలో నియమించారు.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.