ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారు?

ప్రభుత్వ సలహాదారులకు.. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు.. వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వటానికి వీల్లేదని స్పష్టం చేసింది. జీతాలు.. వసతులు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. కేబినెట్ హోదాలు మాత్రం ఇవ్వకూడదని పేర్కొంది.

 

కేసు విచారణలో భాగంగా.. రూల్స్ కు అనుగుణంగానే కేబినెట్ హోదా కల్పించామని.. జీతాలు.. సౌకర్యాల కోసం కేబినెట్ ర్యాంకు ఇచ్చినట్లుగా తెలంగాణ సర్కారు తరఫు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి చేసిన వాదనను హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జీతాలు కావాలంటే ఇచ్చుకోవచ్చని.. సౌకర్యాలు కూడా కల్పించుకోవచ్చు తప్పించి.. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వకూడదని స్పష్టం  చేసింది.

 

సలహాదారులు.. ఇతర హోదాలలో తీసుకున్న వారు మంత్రులతో సమానంగా కాదని స్పష్టం చేసిన హైకోర్టు వాదన.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎంతోమంది మంత్రుల మనసులకు కాసింత ఊరట ఇవ్వటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.