మాజీ మంత్రి బాట్టం శ్రీరామమూర్తి మృతి

 

మాజీ మంత్రి మరియు ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు బాట్టం శ్రీరామ్మూర్తి (89) ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. శ్రీరామ్మూర్తిగారు విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 సం.లో జన్మించారు. సుమారు 16సం.ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పని చేసి సమర్దుడయిన నాయకుడిగా పేరు పొందారు. సమైక్య ఆంద్ర రాష్ట్రంలో ఆయన విద్యా, సాంస్కృతిక శాఖ, సోషల్ వెల్ఫేర్, సాంస్కృతిక శాఖల మంత్రిగా సేవలందించారు. అనంతరం స్వర్గీయ యన్టీఆర్ ప్రేరణతో ఆయన తెదేపాలో చేరి విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.

 

ఆయన రాజకీయాలలోనే కాక మంచి రచయితగా కూడా సుప్రసిద్దులు. ఆయన జయ భారత్, ప్రజారధం, ఆంధ్రజ్యోతి పత్రికలకు సంపాదకులుగా పనిచేసారు. ఆయన జీవిత చరిత్ర స్వేచ్చా భారతం తో కలిపి మొత్తం నాలుగు గ్రంధాలను ఆయన స్వయంగా రచించారు. వృదాప్యం కారణంగా ఆయన చాలా ఏళ్ల క్రితమే రాజకీయాల నుండి నిష్క్రమించారు. ఆయనకీ భార్య, ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు.