దేశం రోడ్డున పడి నెలైంది... మోదీ సాధించిందేంటి? 

 

ఇవాళ్ల డిసెంబర్ 8. సరిగ్గా నెల రోజుల కిందట, అంటే, నవంబర్ 8న ఈ సమయంలో మీరేం చేస్తున్నారు? బహుశా మీకు గర్తు కూడా వుండకపోవచ్చు. కాని, నవంబర్ 8 రాత్రి 8గంటల తరువాత నుంచీ దేశ మొత్తం ఒకే ఒక్క పని కామన్ గా చేస్తోంది! అదే క్యూలో నిలబడటం! నెల రోజులుగా జనం బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడుతూనే వున్నారు. ఇంకా చిల్లర కష్టాలు తీరేలా కనిపించటం లేదు. డిసెంబర్ 30 వరకూ ఈ ప్రెషర్ ఇలాగే వుండేలా వుంది. కాని, నెల రోజుల కిందటి మోదీ పెద్ద నోట్ల రద్దు సంచలనం... ఇప్పటి దాకా సాధించింది ఏంటి? బ్లాక్ మనీ లేని వైట్ మనీ పేదోళ్లని, మిడిల్ క్లాస్ వాళ్లని రోడ్డున వేయటమేనా? దీనిపై క్లారిటీ రావాలంటే నోట్ల రద్దుతో ముడిపడ్డ మూడు ప్రధాన అంశాలు మనకు తెలియాలి... 


నవంబర్ 8న మోదీ నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, అందులో ఆయన స్పష్టంగా పాత నోట్ల మాయం వల్ల కలిగే లాభాలు చెప్పేశారు. వాట్ని మూడు భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి లాభం... నల్లధనం వెలికితీత! దీనిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వచ్చేశాయి. నల్లధనం ఏ మాత్రం బయటకు రాలేదనీ, అంతా వైట్ గా మారిపోయిందని అంటున్నారు ప్రతిపక్షాల వాళ్లు. ఇందులో నిజం లేకపోలేదు. ఎక్కడికక్కడ పట్టుబడుతున్న కొత్త రెండు వేల నోట్లు చూస్తుంటే ఇంకా ఎంత మొత్తంలో పెద్దోళ్ల బ్లాక్ హోల్స్ లోకి వెళ్లిపోయాయో అంచనా వేయవచ్చు! కాబట్టి, మొత్తానికి మొత్తంగా డిసెంబర్ 30నాటికి నల్లధనం అంతా బయటకొస్తుందని ఆశించలేం. ప్రభుత్వం నోట్ల రద్దుతో నల్ల నక్కలపై జూలు విదిలిస్తే వాళ్లు అంతే తెలివిగా కొత్తవి పోగేసుకున్నారు. మధ్యలో గవర్నమెంట్ అధికారులు, బ్యాంక్ మ్యానేజర్లు కమీషన్ రూపంలో లాభపడ్డారు. తాజాగా వెలుగు చూసిన గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్ల ఎక్స్ ఛేంజ్ వ్యవహారం... దేశంలో అరాచకంగా నడిచిన నోట్ల మార్పిడికి చిన్న ఉదాహరణ లాంటిది మాత్రమే! 


నల్లదనం విషయంలో నోట్ల రద్దు పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నల్ల డబ్బు ఇంతకు ముందు వుంది. ఇప్పుడు కూడా వుంటుంది. దీని వల్ల దేశానికి కొత్త కష్టం ఏం వచ్చిపడదు. అయితే, ఆల్రెడీ ఐటీ, ఈడీ శాఖలు దాడులు మొదలు పెట్టాయి కాబట్టి కొందరైనా బ్లాక్ డాగ్స్ పట్టుబడతారని నమ్మకం పెట్టుకోవచ్చు. కాని, డీమానిటైజేషన్ వల్ల ఇంకా రెండు లాభాలు కూడా వున్నాయి. అవే మోదీ చేసిన ఈ సాహసానికి కొంతైనా స్వాంతన మిగిలేలా చేస్తున్నాయి!


పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు రావటం నల్లధనాన్ని నియంత్రించ లేకున్నా దొంగ నోట్లని అరికడుతుందంటున్నారు. నవంబర్ 8న తన స్పీచ్ లో మోదీ కూడా ఇదే చెప్పారు. పాకిస్తాన్ నుంచి వెల్లువెత్తిన పైరసీ నోట్లు దేశ ఆర్దిక వ్యవస్థకి తీరని లోటు చేస్తున్నాయి. అందుకే, కాశ్మీర్ అల్లరి మూకల నుంచీ మొదలు పెడితే బెంగాల్ దొంగ నోట్ల మాఫియా వరకూ అందరికీ ఈ ఫేక్ నోట్లే ఆధారంగా వుంటూ వచ్చాయి ఇంతకాలం. కాని, ఇప్పుడు డీమానిటైజేషన్ వల్ల అవ్వి చెల్లకుండా పోయాయి. కొంత మేర దొంగ నోట్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యి వుండవచ్చు. అయినా కూడా బయట మార్కెట్లో వుండీ ఎందుకూ పనికి రాకుండా పోయిన ఫేక్ నోట్స్ చాలానే వున్నాయి. పాకిస్తాన్ లో అచ్చు వేసి రెడీగా వుంచినవి కూడా ఇప్పుడు చెత్త పేపర్లే!


నల్లధనం, ఫేక్ నోట్స్ కన్నా అత్యంత లాభదాయకమైన విషయం మూడోది! ఇందులో మనకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏంటంటే... ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి చేరాయి. నిన్న మొన్నటి వరకూ అవ్వి జనాల పర్సుల్లో, లాకర్లలో మూలిగేవి. కాని, వాట్ని త్వరలో బ్యాంకులు లోన్ల రూపంలో తిరిగి సర్క్యులేషన్లో పెడతాయి. అంతే కాదు, బ్యాంకుల వద్ద ధన రాశి పెరగటంతో వడ్డీలు కూడా తగ్గే ఛాన్స్ వుంది. అంటే, రాబోయే కాలంలో స్వంతంగా వ్యాపారాలు చేద్దామనుకునే వారికి , ఇళ్లు కట్టుకుందామనుకునే వారికి మంచి కాలం అన్నమాట! బ్యాంక్ లే కాదు గవర్నమెంట్ వద్ద కూడా భారీగా సొమ్ము చేరే అవకాశాలు వున్నాయి. నల్లధనం రాబట్టినా రాబట్టలేకపోయినా డిజిటల్ లావాదేవీలు పెరిగటం వల్ల ట్యాక్స్ లు పెరిగే అవకాశం వుంది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఎంతగా వైట్ మనీ ట్రాన్సాక్షన్స్, ఎంత బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే ఆర్దిక వ్యవస్థకి అంత మంచిదన్నది సింపుల్ లాజిక్... 


మొత్తంగా నెల రోజుల డీమానిటైజేషన్ పీరియడ్ తరువాత ఒక్కటి మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం మోదీ మరింత పకడ్బందీగా తీసుకుని వుంటే బావుండేది. అయినా కూడా ఇప్పుడు సామాన్యులు క్యూలైన్లలో పడుతోన్న ఇబ్బందులు త్వరలోనే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడతాయి. అది నల్ల డబ్బుపై విజయం కాకపోవచ్చు. కాని, ఇంకా ఇతర మార్గాల్లో ఎన్నో లాభాల రూపంలో మనకు ఎదురు కావచ్చు...