Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."జామ్"జాటం
posted on: Aug 2, 2016 3:46PM

ఒక్క గంట ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకుంటే చాలు అయిపోయాం రా బాబూ అనుకుంటాం. అలాంటిది గంటో రెండు గంటలో కాదు, ఏకంగా రోజులకు రోజులు అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే..అమ్మో ఇంకేమైనా ఉందా..? గత వారం గుర్గావ్, ఢిల్లీ ప్రజలు అలాంటి ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఢిల్లీ, హర్యానాల్లో రోడ్లన్ని చెరువుల్ని తలపించాయి. ప్రధాన రహదారులతో పాటు గల్లీ రోడ్లు జలాశయాల్ని తలపించాయి. నాలుగు అడుగుల మేర నీటితో రోడ్లు సగం మేర కనిపించక ఢిల్లీలో ఉన్నామా..లేక నదిపై తిరుగుతున్నామా అని జనాలు ఆశ్చర్యపోయారు. ఇక చూస్కోండి..పొద్దున ఆఫీసులకు వెళ్లినవాళ్లు..తర్వాతి రోజు పొద్దున ఇళ్లకు చేరారు. ముఖ్యంగా ఢిల్లీ-గుర్గావ్ జాతీయ రహదారిపై ప్రయాణించిన వారికి నరకం అంటే ఏమిటో..అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసినట్లైంది.

హీరోహోండా చౌక్ వద్ద మురుగునీరు రోడ్డుపై నుంచి ప్రవహించడం..అదే ప్రాంతంలో అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలతో వాహనాల్ని మళ్లించడం వల్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో వాహనాలు ఏటు కదల్లేక ఉన్నచోటే నిలిచిపోయాయి..అలా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా 17 గంటలపాటు ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయారు. పోనీ నడుచుకుంటూ వెళ్లిపోదామనుకుంటే కార్లను రోడ్లపై వదల్లేక..రాత్రంతా అలాగే తిండి, నీళ్లు లేకుండా గడిపారు. అదే రోజు దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో కురిసిన వర్షంతో సిలికాన్ వ్యాలీ సాగరాన్ని తలపించింది. పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో నగరవాసులు గంటల తరబడి రోడ్లపైనే గడిపారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో చెరువు కట్టలు తెగి శివారు ప్రాంతాలు జలదిగభ్భంధంలో చిక్కుకున్నాయి. ముంపులో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపకశాఖ పడవలను వేసుకువచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వాటిని వేటాడేందుకు జనం పోటీపడ్డారు. అసలే మోకాల్లోతు వరద నీటితో సతమతమవుతున్న వాహనదారులకు చేపలు పట్టేవారు అడ్డురావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరమేదైనా ప్రాబ్లమ్ ఇదే. ఇంత వాన పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అనే వాదనలు విని ఊరేకోవడమేనా..? లోతుగా సమస్య పరిష్కారానికి శ్రద్ద పెట్టరా..? ఇన్ని అవస్థలకు కారణం మన స్వయంకృతాపరాధమే. నీళ్ల మధ్య ద్వీపాలుగా మారిన అపార్ట్‌మెంట్లు, రోడ్ల నిర్మాణంలో ప్రణాళికా లోపం ఇవన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. భారీ నిర్లక్ష్యం..కబ్జాలు..కాసుల వేటల ముందు సమాజం ఏమైతే మనకేం అన్నట్లు..అడ్డగోలు నిర్మాణాలు, చెరువులు, నాలాలు, నదీతీరాలు కబ్జాలకు గురైన తీరు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అందువల్లే వరద నీటితో మురుగునీరు కలిసిపోయి మనిషి ఎత్తున రోడ్లపై కలిసికట్టుగా పారుతోంది.

ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు. ఈ విధ్వంసానికి ఆహ్వానపత్రిక ఇపుడు లిఖించింది కాదు ఎన్నో ఏళ్లుగా చేస్తోన్న పాపానికి ప్రతిఫలం ఇపుడు లభించింది. చెట్లు, మొక్కలు, విశాలమైన బహిరంగ ప్రదేశాలు ఉంటే వర్షం నీరు భూమిలోకి ఇంకిపోతుంది. కానీ కాంక్రీట్ జంగిల్ మధ్య ఆ అవకాశమెక్కడది..? అసాధారణ వర్షాల నీటిని తమలో ఇముడ్చుకోవాల్సిన జలాశయాలు, చెరువులు కబ్జాల కోరల్లో కుదించుకుపోయి..మైదానాలుగా మారటంతో మరో దారి లేక వరద నీరు జనావాసాల మధ్యకు పొంగుకొచ్చింది. సక్రమమైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేని కారణంగా రోడ్లపై మనిషి ఎత్తు నీరు నిలబడిపోయింది. ప్రత్యేకించి కేంద్రప్రభుత్వం వంద భావి స్మార్ట్ నగరాల నిర్మాణానికి అడుగులు వేస్తోన్న సమయంలో ఢిల్లీ-గుర్గావ్ హైవే పెద్ద గుణపాఠం నేర్పుతోంది. జలాశయాలను, వర్షపునీటిని కాపాడుకుంటే ఇలాంటి విలయాలు సంభవించే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.






