శ్రీధర్ బాబుపై కిరణ్ బౌన్సర్...'టి' నేతలకు ఝలక్

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సంవత్సరం రోజున మంత్రి శ్రీధర్ బాబుపై బౌన్సర్ విసిరి తెలంగాణ నేతలకు ఝలక్ ఇచ్చారు. శ్రీధర్‌బాబు ను శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించి... సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా, సమైక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న శైలజానాథ్‌కు ఆ శాఖను అప్పగించారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నడనే కోపంతోనే శ్రీధర్‌బాబుకు సీఎం కిరణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మంత్రి శ్రీధర్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించడాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామన్నారు. "ఇలాంటి సమయంలో అదనపు శాఖలు అవసరంలేదు. అసలు ఏ శాఖలూ లేకున్నా ఫర్వాలేదు' అని ఆయన వ్యాఖ్యానించారు.



శాసన సభా వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి శ్రీధర్‌ను తప్పించడంపై తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. ఇది సీఎం అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు నుంచి శాఖ తొలగించినందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహిస్తండడం విశేషం.