చాక్లెట్లు తినకుండా చేసే ఆట

 

‘నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?’ అని ఏ పిల్లవాడినైనా కదిపి చూడండి! ‘చాక్లెట్లు, కేకులు, ఐస్క్రీం, కోక్, పిజ్జా.....’ అంటూ మన మెదడు మొద్దుబారిపోయేలా చాంతాడంత జాబితా చెబుతారు. ఎప్పుడో అడపాదడపా ఇలాంటి చిరుతిళ్ల మీద మనసు పారేసుకోవడం తప్పుకాదు. కానీ ఇవి లేనిదే రోజు గడవని పరిస్థితి వస్తే మాత్రం నష్టపోయేది పిల్లలే! ఆ మాట వారికి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు.

 

పిల్లలకీ, చిరుతిళ్లకీ ఉన్న అవినాభావ సంబంధం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇంగ్లండులోని పిల్లలు కూడా పళ్లు, కూరగాయలు పూర్తిగా పక్కనపెట్టేసి చిరుతిళ్ల మీద పడుతున్నారట. తినాల్సిన మోతాదుకంటే మూడురెట్లు ఎక్కువ తీపిని లాగించేస్తున్నారట. వీటితో ఊబకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఇంగ్లండులోని Exeter అనే విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు దీనికి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. ఒక కంప్యూటర్ గేమ్ని రూపొందించి పిల్లల మీద ప్రయోగించారు.

 

చాక్లెట్లాంటి పదార్థాలు ఒక రకమైన వ్యసనాన్ని కలగచేస్తాయి. అందుకనే వీటిని చూడగానే... మెదడు ‘కొనేసెయ్, తినేసెయ్’ అంటూ రెచ్చగొడుతుంది. స్వీయనియంత్రణ (self- control) కోల్పోతారు. ఒక చిన్న గేమ్ ద్వారా ఈ స్వభావాన్ని మార్చాలనుకున్నారు సైకాలజిస్టులు. ఈ ఆటలో పిల్లవాడికి కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకో ఆహారపదార్థమూ కనిపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిదైతే దాని పక్కన సంతోషంగా ఉండే బొమ్మ కనిపిస్తుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాకపోతే విషాదంగా ఉన్న మొహం కనిపిస్తుంది. సంతోషకరమైన మొహాన్ని చూసినప్పుడు పిల్లలు బటన్ నొక్కాల్సి ఉంటుంది.
ఆట ముగిసిన తర్వాత పిల్లల్ని వాళ్లకి కావల్సిన ఆహారపదార్థాలు కొనుక్కోమన్నారు. ఆశ్చర్యంగా పిల్లలు ఇదివరకులా కాకుండా మంచి ఆహారం వైపు ఎక్కువగా మొగ్గుచూపారట. అంటే వారు ఆడిన ఆట మెదడు మీద తెలియకుండానే సానుకూల ప్రభావం చూపిందన్నమాట. ఇదే మార్పుని పాఠాల ద్వారా, సెమినార్ల ద్వారా తీసుకురావాలంటే బోలెడు ఖర్చు, సమయం వృధా అవుతాయి. కానీ ఏడంటే ఏడు నిమిషాలలో ముగిసిపోయిన ఆటతో వారిలో అనూహ్యమైన మార్పుని సాధించారు పరిశోధకులు.

 

ఈ ప్రయోగం కోసం 4 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న 200 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరందరి మీదా ఆట ఒకే తీరున ప్రభావం చూపిందట. అంటే ఇలాంటి వీడియో గేమ్స్తో చిన్నా, పెద్దా... ఎవరి మీదైనా సానుకూల ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆలోచనతో Dr Natalia Lawrence అనే శాస్త్రవేత్త పెద్దలలో చిరుతిళ్ల అలవాట్లు మార్చేందుకు, Food Trainer అనే యాప్ను రూపొందించారు. కావాలంటే గూగుల్ ప్లేలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడండి.

- నిర్జర.