అందమైన ఇల్లు

సుజిత్‌ ఓ పదేళ్ల పిల్లవాడు. అతని ఇల్లు ఓ కొండ పైన ఉండేది. ఆ ఇంటి వెనుక ఉన్న దొడ్లో బోలెడు చెట్లు, ఓ పది మేకలు ఉండేవి. రోజూ ఆ చెట్లకి నీళ్లు పోయడం, మేకల్ని మేపుకుని రావడం అతని దినచర్య. ఇక అప్పుడప్పుడు కొండ దిగువనే ఉండే సెలయేటి దగ్గర ఉన్న బడికి కూడా వెళ్తూండేవాడు. చూడ్డానికి సుజిత్ జీవితం సజావుగా సాగిపోతున్నట్లే అనిపించేది. అతన్ని ప్రేమగా చేసుకునే తల్లిదండ్రులు, అతను కనిపిస్తే చాలు కేరింతలు కొట్టే చిట్టి చెల్లెలు... అంతా బాగానే ఉంది కానీ సుజిత్‌ మనసులో ఒకటే వేదన.

 


సుజిత్ ఉదయం లేచిన వెంటనే తన మంచం పక్కన ఉన్న కిటికిలోంచి చూస్తాడా... అక్కడ అతనికి ఓ అందమైన ఇల్లు కనిపించేది. అవతలి కొండ శిఖరం మీద ఉన్న ఆ ఇంటిని చూడగానే, సుజిత్‌కి ఎక్కడలేని అసూయగా ఉండేది. ఆ ఇంటితో పోల్చుకుంటే తనదీ ఒక ఇల్లేనా అనిపించేది. ఎప్పుడెప్పుడు ఆ అందమైన ఇంటిని చేరుకుని, ఒక్కసారన్నా దానిని తనివితీరా చూద్దామన్న ఆశ కలిగేది.

 


ఇక లాభం లేదనుకున్నాడు సుజిత్‌. ఒక రోజు తను బడికి వెళ్తున్నానని తల్లితో అబద్ధం చెప్పి, నిదానంగా ఆ కొండ శిఖరం వైపుగా అడుగులు వేశాడు. శిఖరం అంటే మాటలా! ఒకో అడుగూ వేసేకొద్దీ పాపం సుజిత్‌ అలసిపోయాడు. అయినా ఆ ఇంటిని చూడాలన్న పట్టుదల అతడిని నిలువనీయలేదు. ఎలాగొలా ఆయాసపడుతూ ఒకో అడుగే పైకి ఎక్కసాగాడు. అలా శిఖరం చేరుకున్న సుజిత్‌కి, తను రోజూ చూడాలని కలలుగన్న ఇల్లు కనిపించింది. కానీ ఆ దృశ్యం అతనికి సంతోషాన్ని కలిగించలేదు సరికదా! ఒక్కసారిగా గుండెని బద్దలు చేసింది. కారణం...

 


ఆ ఇంట్లో ఎవరూ లేరు! పాడుబడిన పెరడు, బీటలువారిన గోడలు, తుప్పు పట్టేసిన కిటికీలు అతన్ని వెక్కిరించాయి. దూరం నుంచి రాజమహల్‌లాగా ఉన్న ఆ ఇల్లు దగ్గరకి వెళ్తే దయ్యాల కొంపలాగా దర్శనమిచ్చింది. ఎలాగూ అక్కడిదాకా వచ్చాను కదా అని మనసుని చిక్కబెట్టుకుని ఆ ఇంటివైపుగా అడుగులు వేశాడు సుజిత్. దగ్గరకి వెళ్లిన కొద్దీ ఆ ఇల్లు మరింత భయంకరంగా కనిపించసాగింది. అడ్డదిడ్డంగా మొలిచిన పిచ్చిమొక్కలు, నిర్భయంగా తిరుగుతున్న కాళ్లజెర్రులూ చూసి సుజిత్‌ ఒక్కమాటు భయంతో వెనక్కి తిరిగాడు. అప్పుడు కనిపించింది అతనికి... తన ఇల్లు!

 


ఈ శిఖరం మీద నుంచి చూస్తే అవతలి కొండ మీద ఉన్న తన ఇల్లు ఎంత ముచ్చటగా ఉందో! అస్పష్టంగా అయినా అది అందమైన చిత్రంలా ఉంది. పైన అనంతమైన ఆకాశం దాని కింద ఓ కొండ మీద తన ఇల్లు, ఆ ఇంటికి దగ్గరలో సెలయేరు... ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం! అన్నింటికీ మించి ఏ రాజమహలూకీ లేని ప్రత్యేకత తన ఇంటికి ఉందనిపించింది సుజిత్‌కి. అదే... తన కుటుంబం. ఆ కుటుంబం చెల్లాచెదురైపోతే తన ఇల్లు కూడా ఇక్కడి ఇంటిలాగే జీవం లేకుండా మిగిలిపోతుందనిపించింది. ‘అందంగా ఉండే ఇంటికీ, ఆనందంగా ఉండే ఇంటికీ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో కదా!’ అనుకుంటూ సుజిత్‌ కొండ దిగడం మొదలుపెట్టాడు.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.