చంద్రబాబు చెవిలో మోడీ పువ్వు..

 

రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దగ్గరపడుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఏపీ రాష్ట్రానికి మాత్రం కేంద్ర నుండి ఒరిగింది ఏం లేదని మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్రం.. ఇప్పుడు పదికాదు కదా ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వడానికి నీళ్లు నములుతోంది. ఏపీ ప్రజలకు అన్యాయం చేయం.. అన్ని హమీలు నెరవేరుస్తాం.. ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నాం.. అంటూ ఇప్పటివరకూ మాటలతో మతలబు చేసింది. అయితే నిన్న రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది.

 

 

పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో భాగంగా నిన్న రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, జేడీ శీలం ఏపీ ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనికి చౌదరి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని, నీతి ఆయోగ్ కూడా ఇదే చెప్పిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి చెప్పారు. విభజన చట్టం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఏపీకి హోదా ఇచ్చే పరిస్థితులు లేవని.. అయితే, ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. ఏపీకి ఇప్పటికే పన్ను మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. దీంతో ఏపీ ప్రత్యేక హోదాపై మోడీ సర్కార్ చేతులెత్తేసినట్టే అని స్పష్టంగా అర్ధమవుతోంది.

 

 

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని తాను నమ్మి అదే నమ్మకంతో ఇంతవరకూ ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం మాత్రం చంద్రబాబుకు కూడా గట్టి షాకునే ఇచ్చింది. అమరావతి శంకుస్థాపన రోజే ఒక కుండలో మట్టి, ఒక కుండలో నీళ్లు తెచ్చి చంద్రబాబు చెవిలో పెద్ద పువ్వు పెట్టిన మోడీ.. మళ్లీ ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మరోసారి ఆయన చెవిలో పువ్వు పెట్టారు. మరోవైపు కేంద్ర వ్యాఖ్యలతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఛాన్స్ దొరికినట్టే అని.. టీడీపీపై ఎదురు తిరగడానికి జగన్ కు కలిసొచ్చిందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని సీరియస్ గా డిమాండ్ చేస్తారో లేక లైట్ తీసుకుంటారో చూడాలి.