నాడివేగంలో మార్పులు:

 

నాడి వేగం పెరగడం

1. మీరు కాఫీ, టీ, కూల్ డ్రింకులను ఎక్కువగా తాగుతారా?

ఉత్ప్రేరకాల దుష్ప్రభావం

2. మీరు తెల్లగా పాలిపోయినట్లుగా కనిపిస్తారా? ఆయాసంగా అనిపిస్తుందా?

రక్తహీనత (ఎనీమియా)

3. మీకెప్పుడు శరీరం లోపల వేడిగా, ఆవిర్లు చిమ్ముతున్నట్లుఅనిపిస్తుందా? అలాగే ఆహారంలో మార్పేమీ లేకపోయినప్పటికీ బరువును కోల్పోతున్నారా?

థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం)

4. జ్వరంతో బాధపడుతున్నారా?

సాధారణ జ్వరాలు

5. మీకు మధుమేహం ఉందా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా?

రక్తంలో గ్లూకోజ్ తగ్గటం (హైపోగ్లైసీమియా)

6. అల్లోపతి మందులేమయినా వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

7. మీరు స్త్రీలైతే-బహిష్టులు ఆగిపోయే దశకు చేరుకున్నారా?

మొనోపాజ్ సమస్యలు

8. కొద్దిపాటి శ్రమకే ఛాతిలో నొప్పి వస్తుందా?

గుండెనొప్పి /హృత్శూల (యాంజైనా)

9. కొంతకాలంగా మీకు అజీర్ణం ఉందా? లేదా హఠాత్తుగా కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చిందా?

అజీర్ణం / కడుపులో అల్సర్లు

10. ఇతర వ్యాధులు ఏవైనా ఉన్నాయా?

వ్యాధుల దుష్ఫలితాలు

 

మనిషి శారీరక స్థితిని తెలుసుకోవడానికి డాక్టర్లు కొన్ని కీలకమైన విషయాలమీద ఆధారపడతారు. వాటిలో నాడి ఒకటి.

గుండె రక్తాన్ని పంప్ చేసే సమయంలో అది ఒక అలలాగా కొంత ఒత్తిడితో రక్తనాళాల ద్వారా (ధమనుల ద్వారా) పయనిస్తుంది.

ఆ ఒత్తిడిని స్పర్శించి గ్రహించగలిగినప్పుడు దానిని 'నాడి' అంటారు. ఇది గుండెవేగాన్నీ, శక్తినీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో నాడికి చాలా ప్రాముఖ్యత ఉంది. రోగి పరిస్థితినీ, వ్యాధి తాలూకు వివిధ అవస్థలను తెలుసుకోవడానికి ఆయుర్వేదంలో అష్టస్థాన పరీక్షలను పేర్కొన్నారు. వీటిలో నాడి పరీక్ష మూత్ర పరీక్ష. స్పర్శ పరీక్ష మొదలవునవన్నీ దీనిని అనుసరించి ఉంటాయి.

నాడి పరీక్షలలో మొదటి నాడి తాలూకు దోష ప్రాధాన్యతను - అంటే వాత, పిత్త, కఫాలనే మూడు దోషాలలో ఏది ప్రధానంగా ఉందో నిర్ణయిస్తారు. తరువాత ఆయా దోషాలకు శాస్త్రంలో నిర్దేశించిన శారీరక, మానసిక లక్షణాలను అన్వహించుకుంటారు. “నాడి ద్వారా - మహా అయితే గుండె వేగాన్నీ, బలాన్నీ తెలుసుకోవచ్చు, మరి ఆయుర్వేద వైద్య విధానంలో నాడిని చూడటం ద్వారా ఇతర లక్షణాలను కూడా ఎలా తెలుసుకోగలుగుతారు?” అనే సందేహాన్ని చాలామంది వెలుబుచ్చుతుంటారు.

గుండె నుండి బయలుదేరిన రక్త నాళాలు శరీరంలో వివిధ నిర్మాణాలైన కండరాలు, ఎముకలు, కొవ్వు వీటన్నిటి ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. వీటన్నిటి ప్రభావం రక్తనాళాల మీద పడుతుంది. అంటే రక్త నాళాన్ని బైటనుండి స్పర్శించేటప్పుడు ఇది కేవలం గుండెకు సంబంధించిన సమాచారాన్నే కాకుండా, ఇతర శారీరక స్థితులను కూడా తేలియచేస్తుందన్న మాట. ఈ విషయాన్ని ఆధారం చేసుకొని ఆయుర్వేద వైద్యులు దోషప్రాధాన్యతను నిర్ణయిస్తారు.

ఆహారం తీసుకున్న తరువాత, స్నానం చేసిన తరువాత, ఎండలో ఉన్నప్పుడు. నిద్ర ఆకలి దాహం మొదలయిన వాటి ప్రభావంలో ఉన్నప్పుడు, మనసు నిలకడగా లేనప్పుడు సహజంగానే నాడిలో మార్పు వస్తుంది. కాబట్టి ఈ సందర్భాలలో సాధారణంగా నాడిని చూడటానికి ఆయుర్వేద వైద్యులు సుముఖత చూపించరు.

నాడిని ఎలా చూడాలి?

నాడి మనిషి శారీరక స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడే కీలకాంశాలతో ఒక ముఖ్యమైన అంశం, దీనిని ప్రతి వారు చూడగలిగి ఉండాలి.

నిజానికి నాడిని శరీరంలో చాలా చోట్ల చూడవచ్చు. అయితే అన్ని ప్రాంతాలలోకంటే మణికట్టు మీద – బొటన వేలి కింద భాగంలో తేలికగా చూసే వీలుంది. దీనికి ముని వేళ్ళను ఉపయోగిస్తే ఫలితాలు స్పష్టంగా ఉంటాయి. బొటన వేలిని ఉపయోగించకూడదు.

నాడిని ఒక నిమిషం పాటు చూడటం మంచిది. లేదా 30 సెకండ్లు చూసి ఆ సంఖ్యను రెండింతలు చేస్తే నిమిషానికి ఎంతో తెలుస్తుంది. సాధారణ స్థితిలో, మధ్య వయసులలో నాడి సంఖ్య నిమిషానికి 65నుంచి 85 వరకు ఉంటుంది. దీని సంఖ్య పిల్లల్లోనూ, వృద్ధులలోనూ ఉంటుందన్న మాట, ఇక్కడ గమనించాల్సిన మరొక విషయమేమిటంటే మనిషి స్థితిని బట్టికూడా నాడి వేగం మారుతుందనేది. ఉదాహరణకు కూర్చున్నప్పటికంటే నిలబడినప్పుడు కనీసం పది స్పందనలు ఎక్కువుంటాయి.

వివిధ సందర్భాలూ, అనేక రకాల శారీరక స్థితు'లూ నాడి సంఖ్యను మార్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వ్యాయామం చేసేటప్పుడుగాని, వ్యాయామం చేసిన తరువాత గాని అలసిన కండరాలకు అదనపు రక్తాన్నీ ప్రాణవాయువును సరఫరా చేసే నిమిత్తం గుండె ఎక్కువ సంఖ్యలో కొట్టుకుంటుంది. ఫలితంగా నాడి వేగం పెరుగుతుంది. కొంత సమయం గడిచిన తరువాత ఇది సాధారణ స్థాయికి దిగిపోతుంది. శారీరకంగా బాగా చైతన్యవంతంగా, చురుకుగా ఉండే వ్యక్తుల నాడి విశ్రాంతిగా ఉన్నప్పుడు బాగా తక్కువ సంఖ్యలో ఉంటుంది. దీనిని రెస్టింగ్ పల్స్ అంటారు. ఇది గుండె ఆరోగ్యస్థితిని తేలియజేస్తుంది. వ్యాయామంతోనూ, చురుకుదనంతోనూ, ఏ విధంగానైతే శారీకర కండరాలు శక్తివంతంగా తయారవుతాయో, అదే విధంగా గుండె కండరాలు కూడా సమర్థవంతంగా తయారవుతాయి. అప్పుడవి నిదానంగానే అయినప్పటికీ పూర్తిస్థాయిలో, సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఆటల్లో చురుకుగా పాల్గొనేవారి నాడి సంఖ్య ఒక్కొక్కసారి, విశ్రాంతి తీసుకునే సమయంలో నిమిషానికి 30 సార్లే ఉంటుంది. ఇతరత్రా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాడి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అది వారి ఆరోగ్య స్థితినే సూచిస్తుంది. ఇదేవిధంగా మానసిక కారణాలు కూడా నాడి సంఖ్యమీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు ఆందోళన, ఉద్రిక్తత, భావావేశం, కోపం, నిరాశానిస్ప్రహలు, లైంగికోత్తేజం, భయం మొదలైనవన్నీ నాడి స్పందనను పెంచుతాయి.

నాడి గతిలో మార్పులు సంభవించినప్పుడు దానిని ఒక లక్షణంగా భావించాలి తప్పితే ఒక వ్యాధిగా కాదు. ప్రధాన వ్యాధికి చికిత్స చేస్తే అనుబంధ లక్షణాలన్నీ వాటంతట అవే సమిసిపోతాయి.

మీ నాడి సంఖ్యలో మార్పు ఉన్నట్లు మీరు గమనిస్తే, దానికి కారణాలను తెలుసుకోవడం కోసం ఈ క్రింది అంశాలు దోహదపడుతాయి.

నాడి వేగం పెరగటం (టెకీ కార్డియా)

1. ఉత్ప్రేరకాల దుష్ప్రభావం:

సాప్ట్ డ్రకులూ, కాఫీ, టీ మొదలైన వాటిలో కెఫిన్ అనే పదార్ధం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది ఉత్ప్రేరకంగా పనిచేసి నాడి వేగాన్ని పెంచుతుంది. ధూమపానం ఈ స్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే దీనిలోని నికోటిన్, తార్ మొదలయిన రసాయన పదార్థాలు రక్తనాళాల లోపలి గోడలకు అతుక్కొని వాటిని పూడుకపోయేలా చేస్తాయి. నాడి వేగం ఎక్కువైనప్పుడు దానికి కారణం మీరు తీసుకునే కాఫీ, టీ వంటి పానీయాలే అయినప్పుడు ముందుగా వాటిని మానేయండి. లేదా బాగా తగ్గించుకోండి.

2. రక్తహీనత (ఎనీమియా):

రక్తహీనతలో నాడి వేగం పెరుగుతుంది. రక్తాల్పతలో శరీర కణజాలాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుందన్న సంగతి తెలిసిందే. దీనికి గురైన వారు పాలిపోయినట్లు కనిపించడమే కాకుండా, చిన్నపాటి శ్రమకే ఆయాసపడిపోతుంటారు. ఫలితంగా నాడివేగం పెరుగుతుంది. శరీరావసరాలకు సరిపడా ప్రాణవాయువును రక్తం ద్వారా సరఫరా చేసే నిమిత్తం గుండె మరింత వేగంగా కొట్టుకోవడం దీనికి కారణం. ఇలా గుండె వడివడిగా కొట్టుకునే సమయంలో ఒక్కొక్కసారి ఆ విషయం ఆయా వ్యక్తులకు తెలుస్తుంది. దీనినే గుండె దడ అంటారు.

సూచనలు: విటమిన్ లోపాల వలన రక్తాల్పత ఏర్పడి తద్వారా గుండె వేగం పెరిగినప్పుడు ఆహారంలో పాలిష్ పట్టని బియ్యాన్ని వాడటం ద్వారా సరిచేసుకోవచ్చు.

గృహచికిత్సలు: 1. యాపిల్ రసాన్ని (1 గ్లాసు) ప్రతిరోజూ ఆహారానికి ముందు రెండు పూటలా తీసుకోవాలి. 2. బాదం గింజలను (ఏడు), నీటిలో రెండు గంటలపాటు నానేసి తోలుసు తొలగించి ముద్దచేసి ప్రతిరోజూ ఉదయం పూట మూడు నెలలపాటు తీసుకోవాలి. 3. నల్ల నువ్వుల గింజలను నీటిలో రెండు గంటలపాటు నానేసి, ముద్దచేసి, బెల్లం చేర్చి పాలతో సహా తీసుకోవాలి.

ఔషధాలు: పునర్నవాష్టకక్వాథం, నవాయస చూర్ణం, మండూరం భస్మం, ధాత్రీ లోహం, కాంతవల్లభ రసం, లోకనాథ రసం, తాప్యాది లోహం, లోహాసవం.

3. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం):

థైరాయిడ్ గ్రంథి మితిమీరిన వేగంతో పనిచేసినప్పుడు నాడి వేగం పెరుగుతుంది. శరీరంలో థైరాక్సిన్ అనే హార్మోను ఎక్కువగా విడుదల అవుతున్నప్పుడు (హైపోథైరాయిడిజం) శరీరం లోపల వేడిగా ఉండటం, బరువు తగ్గటాలు ఉంటాయి, దీని వలన నాడి వేగం నిమిషానికి వందకు దాటే అవకాశం ఉంది. అదే విధంగా విరేచనాలు, ఆకలి పెరగడం, బరువు కోల్పోవడం, చమటలు పట్టడం, గుండెద వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు సంతర్పణ చికిత్సలు అవసరమవుతాయి. ఇవి అతి చురుకుదనానికి కళ్లెం వేసి సమస్థితిలోనికి తెస్తాయి.

సూచనలు: క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపుచేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్ధిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను, పాల పదార్థాలను, గోధుమలను, కెఫిన్ కలిగిన ఆహారాలను, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ - సి కలిగిన టమాటా, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి. పసుపు, సుగంధిపాల, యష్టిమధుకం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కలుగుతుంది.

ఔషధాలు: శతావరిఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాశ ఘృతం, కూష్మాండలేహ్యం, క్షీరబలాతైలం (101 అవర్తాలు), ప్రవాళపిష్టి, ప్రవాళ పంచామృతం.

4. సాధారణ జ్వరాలు:

సాధారణ జ్వరాలన్నిటిలోనూ ప్రతి డిగ్రీ ఫారన్ హీట్ ఉష్ణోగ్రతకూ నాడి సంఖ్య 10 చొప్పున పెరుగుతుంది. అయితే టైఫాయిడ్ సంబంధ జ్వరాలలో ఈ నియమం వర్తించదు. వివిధ రకాల జ్వరాలతో బాధపడేటప్పుడు ప్రధాన వ్యాధికి చికిత్స తీసుకుంటే నాడి వేగం దానంతట అదే సాధారణస్థితికి వస్తుంది.

5. రక్తంలో గ్లూకోజ్ తగ్గటం (హైపోగ్లైసీమియా):

ఇన్సులోన్ డోస్ పెరిగిన, లేదా షుగర్ కు మందులు వేసుకున్న తరువాత ఆహారం తీసుకోకపోయినా రక్తంలో గ్లూకోజ్ తగ్గి హైపోగ్లైసీమియా వస్తుంది. దీని ఫలితంగా నాడి వేగం పెరుగుతుంది. చమట పట్టడం, కోమాలోకి వెళ్ళిపోవడం కూడా సంభావించవచ్చు.

సూచనలు: ఇన్సులిన్ మోతాదు పెరగడం వలన నాడి వేగం పెరిగినట్లయితే గ్లోకోజ్ను కాని, కొంచెం తీపి పదార్థాన్నిగాని నోటిలో వేసుకోవడం వలన పరిస్థితిని అదుపులోనికి తెచ్చుకోవచ్చు.

6. మందుల దుష్ఫలితాలు:

శ్వాస నాళికళను వ్యాకోచింపచేయడానికి (ఉబ్బసం వ్యాధిలో) వాడే కొన్ని రకాల మందులకు, దగ్గును తగ్గొంచడానికి వాడే కొన్ని మందులకు, కడుపునొప్పిని తగ్గించడానికి వాడే కొన్ని రకాల మందులకు నాడి వేగాన్ని పెంచే తత్వముంది. డాక్టర్ సలహా లేనిదే ఏ మందును మీకై మీరు వాడకూడదు.

7. మోనోపాజ్ సమస్యలు:

రజోనిష్పత్తి (మోనోపాజ్)కో నాడి వేగం పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయే సమయాలలో హార్మోన్ల తేడాల వలన కొంతమంది స్త్రీలలో శరీరం నుండి ఆవిర్లు వెలువడుతున్నట్లు అనిపించడం, నాడి వేగం పెరగడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సూచనలు: బహిష్టులు ఆగిపోయేసమయంలో నాడి వేగం పెరిగితే పంచకర్మ చికిత్స పద్దతులు ఉపయోగపడతాయి. అలాహే పైటోఈస్ట్రోజన్స్ కలిగిన సోయా, అశోక, లోధ్ర వంటి మూలికలను ఔషధరూపాల్లో వాడాల్సి ఉంటుంది.

8. గుండెనొప్పి /హృత్ శూల (యాంజైనా):

యాంజైనా పెక్టోరిస్ లో నాడి వేగం పెరుగుతుంది. గుండె సమర్థవంతంగా పనిచేయాలంటే తనకు తానే కొంత రక్తాన్ని సరఫరా చేసుకోవడం అవసరం. ఈ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు ఛాతిలో నొప్పి (యాంజైనా పెక్టోరిస్) మొదలై ఎడమ భుజం ద్వారా చెయ్యిలోపలి పక్కకు వ్యాపిస్తుంది. అలాగే ఆందోళన, భయం, శరీరం పాలివడం, చమట పట్టడం, నాడి వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గృహచికిత్సలు: 1. కటుకరోహిణి అతిమధురం వీటిని సమానభాగాలు గ్రహించి చూర్ణం చేసి రోజుకు మూడుసార్లు అరచెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. 2. తెల్ల,మద్దిపట్టను తెచ్చి చూర్ణం చేసి పూటకు చెంచాడు మోతాదుగా వేడిపాలతో రెండుపూటలా తీసుకోవాలి. 3. పుష్కరమూలచూర్ణాన్ని పావు చెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తేనెతో కలిపి తీసుకోవాలి. 4. వెల్లుల్లిపాయను ముద్దచేసి చెంచాడు పేస్టును పాలతో కలిపి ఉడికించి రోజు రెండు పూటలా తాగాలి. 5. కరక్కాయలు, వస, దుంపరాష్ట్రము, పిప్పళ్ళు, శొంఠి వీటిని అన్నిటిని సమతూకంగా తీసుకొని పొడిచేసి అరచెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తేనెతో తీసుకోవాలి.

ఔషధాలు: శృంగిభస్మం, మహావావిధ్వంసినీ, రసం, త్రైలోక్యచింతామణిరసం. జహర్ మొహర్ భస్మం, బృహద్వాత చింతామణి రసం, ఆరోగ్యవర్థినీ వటి, అర్జునారిష్టం, అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, ధన్వంతర గుటిక, క్షీరబాలా తైలం (101 అవర్తాలు), ప్రభాకర వటి సుకుమార రసాయనం, శృంగి భస్మం, అశ్వగంధ చూర్ణం, విదార్యాది ఘృతం.

9. అజీర్ణం / కడుపులో అల్సర్లు:

అజీర్ణంతోపాటు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలై నాడివేగం పెరిగితే అన్న వాహికలో అల్సర్లు ఉండి, అవి చిద్రమయ్యాయేమో చూడాలి. ఇలా జరిగినప్పుడు ఇతర లక్షణాలతో పాటు నాడి వేగంగా, బలహీనంగా మారుతుంది. ఇది అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి. పేగులో అల్సర్లతో చిద్రమవడం, క్యాన్సర్, గుండె జబ్బులు తదితరాల వలన నాడి వేగం పెరిగినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

10. వ్యాధుల దుష్పలితాలు:

కాలేయం, కిడ్నీలు తదితర శరీరాభ్యంతర అవయవాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు, వాటికి క్యాన్సర్ సోకినప్పుడు, గుండెకు సంబంధించిన పొరలు వ్యాధిగ్రస్తమైనప్పుడు బరువు తగ్గటం వంటి లక్షణాలతోపాటు నాడి వేగం కూడా పెరిగే అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో కారణానుగుణమైన చికిత్సలు తీసుకోవాలి.