హృదయ స్పందనలో అపక్రమం

1. సాధారణంగా మన గుండె కొట్టుకునే సంగతి మనకు తెలియదు. అయితే, మీకెప్పుడైనా మీ హృదయ స్పందన స్పష్టంగా ఛాతిలో ఏదో బలమైన వస్తువు గుద్దుకున్నట్లుగా అనిపించి మళ్లీ మామూలుగా అయ్యిందా?

ఏక్టోపిక్ బీట్

2. మీ అలవాట్లను ఒకసారి పునఃపరిశీలించుకోండి - కాఫీ, టీ లాంటి వాటిని ఎక్కువగా తాగుతుంటారా? నలుపురంగులో ఉండే శీతలపానీయాలను తరచుగా తీసుకుంటారా? మీకు పొగ తాగే అలవాటు ఉందా?

ఉత్ప్రేరకాల దుష్ప్రభావం

3. మీరు ఈ మధ్య డిప్రెషన్, థైరాయిడ్ సమస్యల వంటి వాటికి మందులు వాడుతున్నారా?

మందుల దుష్ఫలితాలు

4. శారీరకంగా శ్ర్రమ పాడినప్పుడుగాని, పని చేసినప్పుడుగాని ఛాతిలో నొప్పిగా అనిపిస్తుందా?

గుండెనొప్పి / హృత్శూల (యాంజైనా)

5. మీ గుండె చప్పుడులో 'మర్మర్' (అసహజమైన ధ్వని) విని వచ్చిందని మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్ చెప్పారా?

హార్ట్ మర్మర్స్

కొన్ని సందర్భాలలో కొంతమందికి ఛాతిలో గుద్దినట్లుగా, బలమైన ఒత్తిడి అనిపించి కొంతసేపటి వరకు గుండె స్పందన లేకుండా ఉండటం జరుగుతుంటుంది. ఈ స్థితి గుండె దడతో కలిసిగాని, గుండె దడలేకుండాగాని ఏర్పడవచ్చు.

సాధారణంగా గుండె స్పందనకు ఒక లయ, కొంత వేగము ఉంటాయి. 'జాగృదస్తద్వికసతి, స్వపతశ్చ నిమీలితీ........” అంటూ సుశృతుడు అనే ఆయుర్వేద సంహితాకారుడు గుండె స్పందనను గూర్చి వివరించాడు. ఏ కారణం చేతనయినా ఈ 'లయ' లో మార్పు వచ్చి, నిర్దేశిత సమయానికంటే ముందే గుండె కొట్టుకుంటే, తరువాత స్పందనకు కొంత వ్యవధి ఏర్పడుతుంది. తీవ్రమైన పని బడలికవల్లనో, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి ఉత్ప్రేరకాలను తీసుకున్నప్పుడో ఇలా జరిగే అవకాశం ఉంది. హృదయ స్పందనలో అపక్రమం చోటుచేసుకున్నప్పుడు గుండెజబ్బు వచ్చేసిందని కంగారు పడాల్సినపనిలేదు. అయితే. ఈ నిర్ణయానికి రావటానికి ముందు పరిస్థితిని వైద్యపరంగా విశ్లేషించాల్సి ఉంటుంది.

1. ఎక్టోపిక్ బీట్:

గుండె లయాలో అదనపు స్పందన ఏర్పడటాన్ని వైద్యపరిభాషలో 'ఎక్టోపిక్ బీట్' అంటారు. గుండెకు సంబంధించిన విషయమవడంతో చాలా మంది ఈ లక్షణాన్ని సీరియస్ గా తీసుకొని కంగారు పడుతుంటారు. సమస్యను జటిలం చేసుకుంటారు. నిజానికి దీనిలో కంగారు పడాల్సిన అంశమేదీ లేదు. కొద్ది మందిలో ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. గుండెకు సంబంధించిన శారీరక క్రియలో కొద్దిపాటి మార్పు వల్ల ఈ లక్షణం ఏర్పడుతుందంతే.

ఔషధాలు: అశ్వగంధాది చూర్ణం, రసాయన చూర్ణం, అర్జునారిష్టం.

2. ఉత్ప్రేరకాల దుష్ప్రభావం:

కాఫీ, కూల్డ్రింక్స్, చాక్ లెట్స్ వంటి పదార్థాలన్నిటిలో 'కెఫిన్' అనే ఉత్ప్రేరకం ఉంటుంది. ఇది నికోటిన్ లాగా గుండెను ప్రేరేపించివేగంగా, ఒకోసారి అస్తవ్యస్తంగా కొట్టుకునేలా చేస్తుంది. హృదయస్పందన అస్తవ్యస్తంగా మారినప్పుడు ఒకవేళ అది ఉత్ప్రేరకాల వల్లనే అని మీకనిపిస్తే వెంటనే వాటి వాడకాన్ని ఆపేయండి.

3. మందుల దుష్ఫలితాలు:

డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలకు వాడే అల్లోపతి మందులకు గుండె వేగాన్ని పెంచే నైజం ఉంది. ఒకోసారి ఈ మందులు గుండె స్పందనను అవ్యస్థితంగా చేస్తుంటాయి కూడాను. ఇటువంటి సందర్భాలలో వీటి మోతాదు విషయాన్ని పునరాలోచించాల్సివుంటుంది.

4. గుండె నొప్పి /హృత్శూల (యాంజైనా):

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో కొలెస్టరాల్ వంటి కొవ్వు పదార్థాలు పేరుకు పోయి రక్త ప్రవాహానికి అవరోధం కలిగించినప్పుడు గుండెలో నొప్పిగా అనిపించడం హృదయ స్పందనలో తేడాలు రావడం జరగచ్చు. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'యాంజైనా' (హృత్ శూల) అంటారు. ఈ నొప్పి వల్ల హృదయంలో జనించే విధ్యుత్ తరంగాలలో మార్పువచ్చి గుండెలయలో అసాధారణత చోటుచేసుకుంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు అత్యవసరంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

గృహచికిత్సలు: 1. కటుక రోహిణి, అతిమధురం వీటిని సమాన బాగాలు చేసుకొని చూర్ణం చేసి రోజుకు మూడుసార్లు ప్రతిసారి అరచెంచాడు చొప్పున వేడినీళ్ళతో తీసుకోవాలి. 2. తెల్లమద్దిపట్టను తెచ్చి చూర్ణం చేసి చెంచాడు మోతాదుగా వేడిపాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. పుష్కరమూల చూర్ణాన్ని పావుచెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తేనెతో తీసుకోవాలి. 4. వెల్లుల్లి పాయను ముద్దచేసి చెంచాడు పేస్ట్ ను పాలలో కలిపి ఉడికించి రోజు రెండుపూటలా తాగాలి. 5. కరక్కాయ, వస, దుంపరాష్ట్రము, పిప్పళ్ళు, శొంఠి వీటినన్నిటిని సమతూకంగా తీసుకొని, పొడిచేసి, అరచెంచాడు చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.

ఔషధాలు: శృంగి భస్మం, మహావాత విధ్వంసినీ రసం, త్రైలోక్య చింతామణి రసం, జహర్ మొహర్ భస్మం, బృహత్ వాత చింతామణి రసం, ఆరోగ్యవర్ధినీవటి.

5. హార్ట్ మర్మర్స్:

జన్మతహాగాని, రుమాటిజం వల్లగాని ప్రాప్తించిన గుండె వ్యాధుల్లో కవాటాలు దెబ్బతిని గుండె స్పందనలోని లయను మార్చివేస్తాయి. అలాంటప్పుడు రొటీన్ మెడికల్ చేకప్స్ లో డాక్టర్లు మర్మర్ ని స్టెత్ సహాయంతో వినగలుగుతారు. ఈ స్థితి సాధారణంగా గుండె స్పందనలో అస్తవ్యస్థతను అనుసరించి వస్తుంటుంది.

ఔషధాలు: యాకూతి రసాయనం, హృదయార్ణవ రసం, శృంగిభస్మం.

నాడి:

గుండె నిమిషానికి సరాసరి 72 సార్లు కొట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే, దీనిని నాడి ద్వారా తెలుసుకోవచ్చు. నాడి వేగం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అనేక రకాల అంశాలు నాడి వేగాన్ని పెంచడం గాని, తగ్గించడం గాని చేస్తాయి. వ్యాయామం, ఆందోళన, మానసిక ఒత్తిడి, భయం, కోపం, కొన్ని రకాల మందులు ఇలాంటి వన్నీ నాడి వేగాన్ని పెంచుతాయి. నిద్ర, విశ్రాంతి, చలి, కొన్ని రకాల మందులు ఇలాంటివన్నీ నాడి వేగాన్ని తగ్గిస్తాయి.

మనిషి గుండె సాధారణ పరిస్థితుల్లో తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. నాడి వేగం అసాధారణ స్థాయిలో పెరిగినా, లేకపోతే క్రమరహితంగా ఉన్నా గుండె స్పందిస్తున్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనినే 'గుండెదడ' అంటారు. గుండెదడలో ఛాతిలో పట్టుకున్నట్లు, నొక్కినట్లు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో స్పృహతప్పుతున్నట్లుగానూ, ఆయాసంగానూ అనిపించవచ్చు.

కొంతమందికి విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండెదడ మొదలై, వ్యాయామంతో తగ్గిపోతుంది. దీని వల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది ప్రమాదరహితమైనది. గుండె పనితీరులోగాని, నిర్మాణంలోగాని లోపాలున్నప్పుడు గుండెదడ వస్తుంది. ముఖ్యంగా ఏదైనా శరీర శ్రమ చేసినా, అలవాటు లేని పని చేసినా ఈ లక్షణం స్పష్టంగా తెలుస్తుంది. గుండె లోపల విద్యుత్తు ప్రయాణించే తీరులో లోపం సంభవిస్తే గుండె స్పందనలు అపక్రమంగా, అస్తవ్యస్తంగా తయారవ్వడంతోపాటు (ఎరిత్మియా) గుండెదడ కూడా ప్రాప్తిస్తుంది. గుండెదడ వల్ల మెదడుకు, ఊపిరి తిత్తులకు రక్తసరఫరా తగ్గిపోయి, కళ్లు తిరగడం, స్పృహ తప్పడం, ఆయాసం, చీకటి కమ్మటం తదితర లక్షణాలు ఉత్పన్నమవుతాయి. ఈ భాగంలోని అధ్యాయాలు ఇటువంటి లక్షణాలన్నిటిపైనా అవగాహన కల్పిస్తాయి.