Home » suryadevara rammohan rao » Vyuham


    యూనో... మార్కెట్ లో కాంపిటేషన్ పెరిగింది. ప్రొడక్టు క్వాలిటీలో మాన్యుఫాక్చరర్ రాజీపడలేదు. అలాగే మీడియా కేంపైన్ లో కూడా రాజీ పడలేదు. కోటి రూపాయలు ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కోటిన్నర రూపాయలు ఎడ్వర్ టైజ్ మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వుందిప్పుడు.

 

    ఇంతకు పూర్వం మాన్యుఫాక్చరర్ కి అయిదు పైసలున్న మార్జిన్ ఇప్పుడు మూడు పైసలకు పడిపోయింది.

 

    మార్కెట్లో దొరికే ఎనీ డెంటల్ ఫోమింగ్ టూత్ పేస్టుని తీసుకో. 150 గ్రామ్స్ నెట్ వెయిట్ క్రీమ్ ఖరీదు ఇన్ క్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ 18.70 పైసలుంటోంది.

 

    పెరిగిన ఖర్చులకు అనుగుణంగా టూత్ పేస్టు రేట్ పెంచాలి. కాని కాంపిటీషన్ తట్టుకోవాలంటే మార్కెట్ రేట్ నే మనము ఫాలో కావాలి. యూనో టూత్ పేస్ట్ విషయంలో క్లాస్ డిఫరెన్సు లేదు-

 

    ఇప్పుడు అన్ని కంపెనీలు పెట్టే రేట్ మా ప్రొడక్ట్ కీ పెడితే మార్కెట్లో మినిమం గ్యారంటీ వుంటుంది... కానీ-

 

    వాట్ ఎబౌట్ మాన్యుఫాక్చరర్?"

 

    కంపెనీ నిలదొక్కుకోవాలంటే, ప్రాఫిట్ పర్సెంట్ పెరగాలి.

 

    కస్టమర్ ఎక్కడా ఏ మాత్రం ఇన్ కన్వీనియన్స్ ఫీల్ కాకుండా మాన్యుఫాక్చరర్ కి లాభం రావాలి.

 

    చాలాకాలంగా నా మనసులో మెదులుతున్న ఆలోచన ఇది" చెప్పటం ఆపాడు వెంకటనారాయణ.

 

    శక్తి ఆయన చెప్పేది వింటూనే ఇప్పటికయినా తనని మేనల్లుడిగా అంగీకరిస్తాడా- లేదా? అనే ఆలోచిస్తున్నాడు శక్తి.

 

    అయినా క్షణాల్లో తేరుకున్నాడు శక్తి.

 

    "ఇండియన్ టూత్ పేస్ట్ మార్కెట్ లో 80 శాతం వాటా మీ ప్రొడక్ట్ దే- ఫెంటాస్టిక్ షేర్. మరింకా దేనికోసం మీ ఆరాటం? నాకర్థం కావటం లేదు" అన్నాడు శక్తి.

 

    వెంకటనారాయణ నవ్వాడు మెల్లగా.

 

    "జీవితంలో ఉన్నదానితో సంతృప్తి పడితే సుఖ, సంతోషాలు ప్రశాంతతా లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న షేర్ తో ఉన్న సేల్స్ తో లభించిన మార్కెట్ షేర్ తో సంతృప్తి ఎదుగుదల ఉండదు. నా పాయింట్ నీకు అర్థమైందనుకుంటాను. ఐ వాంట్ 85 పర్సెంట్ షేర్" అన్నాడు వెంకటనారాయణ.

 

    తన మేనమామ ఏమీలేని స్థాయి నుంచి ఆ స్థాయికి ఎలా ఎదిగాడన్న దానికి ఇప్పటికి తనకి సమాధానం లభించింది.

    మేనమామ కేసి విస్మయంగా చూస్తుండిపోయాడు శక్తి.

 

    "ఐథింక్ దట్... యుగాట్ మై పాయింట్...

 

    అయ్ వాంట్ యువర్ సొల్యూషన్. ఇది బిజినెస్ కు సంబంధించిన పరిష్కారమే. కాని లాజిక్ క్రియేటివిటీ ఇందులో లీడ్ చేసే పాయింట్లు.

 

    డోంట్ వర్రీ ఎబౌట్ ఫీజ్...." చెప్పడం ఆపాడు వెంకటనారాయణ.

 

    "ఒన్స్ ఏ గోల్ హేజ్ బీన్ ఎ ఛీఫ్ డ్.... ఇటీజ్ రిప్లేస్ డ్ విత్ ఎనదర్ గోల్...."

 

    ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది శక్తికి.

 

    వెంకటనారాయణ స్వయంగా ఇక్కడకు రావడానికి బలమైన కారణం ఇప్పుడర్థమైంది.

 

    కరెక్ట్ సొల్యూషన్ దొరికితే, ఆ లాభాలు కోట్లలో ఉంటాయి.

 

    వెంకటనారాయణ ఎందుకు గొప్పవాడయ్యాడో ఇప్పుడు స్పష్టముగా అర్థమైంది శక్తికి.

 

    "కెన్ యు గివ్ ద సొల్యూషన్" సీరియస్ గా అడిగాడు వెంకటనారాయణ.

 

    "ఎస్" అసంకల్పితంగానే అనేసాడు శక్తి.

 

    "వెన్" ఆ మాటకు శక్తి వెంటనే జవాబు దొరకలేదు.

 

    "యూ టేక్ యువర్ ఓన్ టైమ్. అవర్స్ ఆర్ ఇయర్స్" వెంకట నారాయణ వ్యంగ్యంగా అనలేదు. కానీ వ్యంగ్యంగా అంటున్నాడేమోనని ఉలిక్కిపడ్డాడు శక్తి.

 

    టూత్ పేస్ట్ ఇండస్ట్రీలో సంచలనమైన మార్పుకి శ్రీకారం చుడుతున్నాడు వెంకటనారాయణ.

 

    శక్తి హావభావాల్ని పరిశీలిస్తూ శక్తి చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాడు వెంకటనారాయణ.

 

    రేర్ అకేషన్ ఇన్ ఒన్స్ లైఫ్.

 

    థ్రిల్లింగ్ గా, ఎక్సయిటింగ్ గా ఉంది శక్తికి.

 

    తను ఎవరి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాడో, ఆ వ్యక్తే తన కోసం తన సలహా కోసం రావటం-  తనెదురుగా కూర్చోవటం- ఎక్సయిటింగ్ గా వుంది శక్తికి.

 

    "నేను వ్యాపారవేత్తను- నువ్వూ అంతే... అందుకే చిన్న షరతు విధిస్తున్నాను" అన్నాడు వెంకటనారాయణ నెమ్మదిగా.

 

    "షరతా... ఏమిటది...??" ఆశ్చర్యపోతూ అడిగాడు శక్తి.

 

    "నా సమస్యకి నువ్వు పరిష్కారం చూపగలిగితే నువ్వు ఊహించలేని ఫీజ్ ఎమౌంట్ నేను నీకిస్తాను. లేదంటే... నువ్వీ కన్సల్ టెన్సీ మానేసి, నా కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయాలి. ఓకేనా?"

 

    శక్తి ముందు బిత్తరపోయినా- ఆ తరువాత తేరుకొని, వెంకట నారాయణ తెలివితేటలకు జోహార్లు అర్పించాడు.

 

    "ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం నాకు తిరిగిరాదనే నా నమ్మకం" ఎంతో ఆత్మవిశ్వాసంతో అన్నాడు శక్తి.

 

    "శభాష్.. ఛాలెంజింగ్ అంటే ఇలాగే వుండాలి" అన్నాడు వెంకట నారాయణ నవ్వుతూ, రెచ్చగొడుతూ.

 

    "అయితే మీరో పని చెయ్యాలి. మీరు మీ ఆఫీసుకి వెళ్ళి, మీ లెటర్ హెడ్ మీద మీ సమస్యను టైప్ చేసి మీకేం పరిష్కారం కావాలో అది కూడా రాసి, మీరు సైన్ చేసి నాకు అఫీషియల్ గా పంపించండి. దేనికయినా నియమనిబంధనలుంటాయి కదా?" అన్నాడు శక్తి నర్మగర్భంగా.

 

    ఈసారి బిత్తరపోవటం వెంకటనారాయణ వంతు అయింది.


Related Novels


Rakthachandanam

Erra Samudram

Daaling

Anitara Sadhyudu

More