Home » suryadevara rammohan rao » Vyuham
"నమ్మకంలేకనా?" అడిగాడు వెంకటనారాయణ.
"కాదు- నమ్మకానికి సాక్ష్యాన్ని అడ్డు పెట్టుకుందామని" శక్తి స్థిరంగా అన్నాడు.
వెంకటనారాయణ విస్మయంగా చూసాడు అతనివేపు.
"శభాష్, నీలో నిజమైన వ్యాపారవేత్తను నేనిప్పుడు చూస్తున్నాను అలాగే పంపిస్తాను. కాని నువ్వు కూడా ఒక కాగితం మీద పరిష్కారం చూపలేనప్పుడు నా కంపెనీలో చేరుతానని లెటర్ రాసివ్వాలి" అన్నాడు వెంకటనారాయణ.
"ఆ అవసరం నాకులేదు- పరిష్కారం చూపలేకపోతే మీకు నేను సర్వెంట్ గా మారటం అన్నది అబ్స్ ర్డ్- అయినా విషయం ఇక్కడిదాకా వచ్చాక నేను వెనుకడుగు వేయను. మీరు నన్ను ఇరకాటంలో పెట్టటానికే వచ్చారని నేనర్థం చేసుకోగలను. మీరు నా వద్ద నుంచి పరిష్కారం ఆశించటం కోసం కాక నన్ను మీ సర్వెంట్ ని చేసుకోవటానికే ప్రధానంగా వచ్చారని నాకనిపిస్తోంది. ఏది ఏమైనా నేను సిద్ధమే. శతకోటి సమస్యలకి... అనంత కోటి ఉపాయాలుంటాయని నేను నమ్ముతాను" అన్నాడు శక్తి ధీమాగా.
వెంకటనారాయణ లేచి నిలబడ్డాడు "గంటలోపే నీకు లెటర్ అందుతుంది" అన్నాడు వెంకటనారాయణ.
"ఆ వెంటనే నేనూ మీకు హామీ ఇస్తాను- పేపర్ మీద" అన్నాడు శక్తి కూడా లేచి.
నవ్వుతూ వెళ్ళిపోయాడు వెంకటనారాయణ. ఆయనలా వెళ్ళిపోగానే భగవాన్ శారద పరిగెత్తుకుంటూ శక్తి రూమ్ లోకొచ్చారు.
విషయం తెల్సుకొని భగవాన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
"ఇదంతా ఒక డ్రామా. నిన్ను ఎలాగయినా తన దగ్గరకు రప్పించు కోవాలనే ఈ ఎత్తు వేసాడు వెంకటనారాయణ" పళ్ళు కొరుకుతూ అన్నాడు భగవాన్.
"అని నేనెప్పుడో గ్రహించాను. అయినా ఫర్వాలేదు" అన్నాడు శక్తి ఎంతో నిబ్బరంగా.
భగవాన్... శారద శక్తిలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసానికి నిరుత్తరులై పోయారు.
* * * *
తన ఛాంబర్ చేరుకున్న వెంకటనారాయణ వెంటనే శక్తి కోరిన లెటర్ టైప్ చేయించి సంతకం చేసి స్పెషల్ మెసెజర్ తో శక్తికి పంపించాడు.
అప్పుడే లోపలికొచ్చిన కూర్మనాధం వెంకటనారాయణ చేసిన ఎత్తుకి విస్తుపోయాడు.
"శక్తి ఓడిపోక తప్పదు సార్. ఎందుకంటే ఆల్ రడీ 80శాతం మార్కెట్ ని స్వంతం చేసుకున్న మన గుడ్ మార్నింగ్ టూత్ పేస్ట్ సేల్స్ ని ఇంకా పెంచటం అసాధ్యమని నా ఉద్దేశం" అన్నాడు కూర్మనాధం.
"నా మేనల్లుడ్ని తక్కువ అంచనా వేయకు కూర్మనాధం" అన్నాడు వెంకటనారాయణ గంభీరంగా.
"అయితే శక్తి మీ మేనల్లుడా! నిజమేనా సార్?" షాక్ తింటూ అన్నాడు కూర్మనాధం.
అవునన్నట్లు తలూపాడు వెంకటనారాయణ. కూర్మనాధానికి ఆ షాక్ నుంచి తేరుకోటానికి చాలాసేపే పట్టింది.
శక్తి చెప్పింది నిజమేనన్న మాట?
మరయితే ఈ డ్రామా అంతా ఎందుకు?
"మరయితే ఇదంతా ఏమిటనే మీమాంస నీలో ఉంది కదూ? దానికి త్వరలోనే సమాధానం లభిస్తుంది" అన్నాడు వెంకటనారాయణ కూర్మనాధం అంతరంగాన్ని చదివినట్లుగానే.
* * * *
మరుసటిరోజు ఉదయమే వెంకటనారాయణ శక్తి దగ్గరకు వచ్చాడు.
"మన మధ్య విచిత్రమయిన ఛాలెంజ్ చోటు చేసుకుంది కదా? ఇప్పుడు చెప్పు. నీకెంత టైమ్ కావాలి? రోజులా? వారాలా? నెలలా? సంవత్సరాలా? రోజుల్లోనే నువ్వు పరిష్కారం చూపగలిగితే నీలోని శక్తిని, మేధస్సుని నేనంగీకరిస్తాను. లేదంటే చెప్పు. ఈ ఛాలెంజ్ ని వెనక్కి తీసుకుందాం?" కావాలనే రెచ్చగొడుతూ అన్నాడు వెంకటనారాయణ.
శక్తిలో పట్టుదల పెరిగింది.
కసి, ఆవేశం, ఆలోచనా చోటు చేసుకున్నాయి ఆ క్షణానే.
"ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ విత్ ఇన్ థర్టీ మినిట్స్. కెన్ యూ బేర్ విత్ మీ" శక్తి మాటల్లో ఎంతో ఆత్మ విశ్వాసం ఉంది.
"నో.... ఇట్స్ నాట్ పాజిబుల్" మనసులోనే నవ్వుకుంటూ అనుకున్నాడు వెంకటనారాయణ.
ఎంతమంది బిజినెస్ ఎనలైజర్స్ ను చూసాడు తను?
చిన్నపిల్లాడు, ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటుంటే వడ్డున నుంచొని చూస్తున్న పేరెంట్ లా ఉన్నాడు వెంకటనారాయణ.
థర్టీ మినిట్స్.
థర్టీ మినిట్స్ లో తను సొల్యూషన్ ఇవ్వగలడా? ఆలోచిస్తున్నాడు శక్తి.
థర్టీ మినిట్స్ అని చెప్పేసి, తను పొరపాటు చేశాడా!
Give your self a dead line
What tight deadline can you give your self?
The ultimate inspiration is the deadline.
"బిజినెస్ కి టార్గెట్, కాంపిటీషన్ కి గోల్, వ్యక్తికి డెడ్ లైన్ చాలా అవసరం- పనిని అంచనా వేసుకొని ప్రణాళికను సిద్ధం చేసుకొని మెంటల్ గా ఒక డెడ్ లైన్ ను నిర్ణయించుకోని వ్యక్తి-
దేనికి పనికిరాడు! ఏవీ సాధించలేడు."
అందుకే శక్తి Tight Deadline ని నిర్ణయించుకున్నాడు.
ప్రవాహంలా పొంగుకొస్తున్న ఆలోచనలు.
నిమిషాలు దొర్లుతున్నాయి.
హార్స్ రేస్ లోని గుర్రంలా పరుగెడుతోంది మనసు.
"మిస్టర్ శక్తీ! నువ్వెళ్ళమంటేనే వెళ్తాను. రేపు కలుద్దాం" వెంకట నారాయణ మరో ఛాన్స్ ఇచ్చాడు వాంటెడ్ గా.



