Home » adivishnu » Rakshasi Neeperu Rajakeeeyama



                                                   1
    
    తిమ్మాపురం సిటీకాదు.
    అంతమాత్రంచేత టౌననేందుకు వీల్లేదు.
    సిటీ లక్షణాలుగల టౌనని, టౌనుగా నిలిచిపోయిన సిటీ అని చెప్పుకోడం చాలా అవసరం.
    తిమ్మాపురంలో ఎనిమిది సినిమా హాల్లున్నాయి. వాటిని పోషించే నిమిత్తం రెండు కాలేజీలున్నాయి. ఒకే ఒక మెయిన్ రోడ్డుంది. మహా సముద్రం ఏడుమైళ్ళదూరంలో వుంది.
    టౌనుహాలుంది. అక్కడ చాలా గొప్పసభలూ, సమావేశాలూ జరుగుతుంటాయి.
    ఆ మాటకొస్తే తిమ్మాపురం సభలకీ, సమావేశాలకీ పెట్టింది పేరు. నడి రోడ్డుమీద ఇద్దరు నించోడం మాడాలే గాని, పదీపది హేన్నిమిషాల్లో అక్కడ అరవైమంది గుంపైపోయి సభపెట్టేస్తారు. ఇద్దరు మనుష్యు లెందుకక్కడ నించుని ఏం మాటాడుతున్నారనేది అరవైమంది జనాభాకి అనవసరం. సభలమీదున్న అనురక్తి 'ఆలోచన'కి తావివ్వదుగదా.....
    రోడ్డుమీద సభలు చాలవన్నట్టు-తిమ్మాపురం పార్కులోకూడా హెచ్చు సంఖ్యలోనే సభలు జరుగుతుంటాయి.
    పార్కు అందంగానే వుంటుంది. రావలసిన జనం వొచ్చి కూచుంటే ఆ పార్కులో కేవలం అందమే దొరుకుతుంది.
    కొన్ని హోటేళ్ళున్నాయి. అవి పెసరట్టులకిమాత్రం ప్రసిద్ధి. తతిమ్మా పదార్ధాలన్నీ రోడ్డుపక్కన తోపుడు బళ్ళలో విరివిగా లభ్యమౌతాయి. ఖర్చు తక్కువతో, హెచ్చు సంతృప్తి ఆబళ్ళపదార్ధాల్లోనే లభ్యమౌతుందిగనక తిమ్మాపురంలో హోటేళ్ళు అభివృద్ధి చెందేటందుకు వీల్లేదు. అభివృద్ధి చెందితే జనం వూరుకోరు.
    తిమ్మాపురానికి ఉజ్జ్వలమైన గతముంది.
    తిమ్మాపురంలో ఆశావాదులున్నా రింకా. ఎక్కువగా పిచ్చి వెధవలున్నారు.
    కథలు రాసే కుర్రాళ్ళతోపాటు, కవిత్వంచెప్పే పండితులున్నారు.
    కంట్రాక్టర్లున్నారు. పవర్ ఫుల్ పొలిటీషియన్లు కొద్దిమంది వున్నారు.
    ఏమీతోచని పెద్ద లెక్కువగా వున్నారు. అస్తమానం బిజీగా తిరిగే యువకులూ వున్నారు.
    కొన్ని మహత్తరమైన క్లబ్బులుండటంవల్ల కల్చరుంది. సింహాలున్నాయి గనక దానధర్మాలున్నాయి.
    బడాఛోర్ లెంత మందున్నారో, ఛోటా నాయకులుగూడా అంతమందే వున్నారు.
    సింగినాదం, జీలకర్రలున్నారు. తల వొంచని వీర పెర్సనాలిటీలూ వున్నాయి.
    మిఠాయి కొట్లూ, పుణుకుల దుకాణాలూ, ఫాన్సీషాపులే కాకుండా ధర్మ సత్రాలూ వున్నాయి.
    గుళ్ళూ గోపురాలున్నాయి, గనక పరమ భాగవతోత్తములున్నారు-మహా పాపాత్ములు కొందరున్నారు. హరి కథలూ; పోకిరీ వేషాలూ పక్క పక్కనే వున్నాయి.
    ధర్మాసుపత్రి వుంది. రోగాలూ రొష్టులూ వున్నాయి.
    కోర్టులూ జైళ్ళూ వుండటంవల్ల వకీళ్ళున్నారు. అందుచేత దోషులూ, నిర్దోషులూ కలిసే బతుకుతున్నారు.
    తిమ్మాపురంలో మంచీచెడులుండక పోలేదుగాని- అక్కడేది హెచ్చనే పాయింటడక్కూడదు.
    సత్యం వధ- ధర్మం చెర అప్పుడప్పుడూ ఎక్కువగానే జరగడం కద్దు.    
    తిమ్మాపురం ఎలాగైనా కొంచెం బద్దకంగానే వుంటుంది. బద్దకానిక్కారణం ఏడు మైళ్ళదూరంలో వున్నటువంటి మహాసముద్రమే అని వళ్ళు మండి ఒక శాస్త్రజ్ఞుడుగారు సెలవిచ్చేరు.
    మహాసముద్రం అక్కడండటం వల్ల తేమతో గూడిన ఉప్పుగా లెక్కువ. ఉప్పుమిళితమైన ఆ గాలి మనిషిని బద్ధకస్తున్ని చేస్తుందిట.
    బద్దకస్తుడికి ఆలోచన లెక్కువ. కష్టపడి పనిచేయడం తక్కువ. పొద్దస్తమానం దుప్పటి ముసుగులో తన్ని పెట్టి పడుకోడం జరుగుతుంది. చేయవలసిన కొంప మునిగే పనులన్నీ వాయిదామీద దొర్లిపోవటం రూలు. ఆలోచనలు మేసే మనిషికి వొళ్ళు వంచి పనిచేయడమంటే వొళ్ళుమంట.
    ఆలోచన లున్నాయిగనుక చాలా మంది కళాకారులై పోయేరు. కొందరు మాత్రం ఆలోచనల డోసు మితిమీరి పోవడంవల్ల పిచ్చి వాళ్ళయిపోయేరు పాపం!
    కళాకారుల్నీ; పిచ్చి వెధవల్నీ పరిపాలించడం అతి సులువు. ఈ సూత్రప్రకారం పురపాలకులు పాపం- ఏ వడుదుడుకుల్లేకుండా-పరిపాలన చేస్తున్నారు.
    'మాకు నువ్విది చేయలేదు. మా కనీస కోరికలు; కొన్ని మీ పరిపాలనలో తగులపడిపోడం మేమింక సహించమనే రౌడీలు బహుతక్కువ. ఆ జాతి మనుషులందరూ పురపాలనలో చోటు చేసుకోడం వల్ల మరి నోరెత్తే దుడుకు మనిషి కరువై పోయేడు.
    తిమ్మాపురాన్ని పూర్వం 'కోతులూరు' అనే వారుట! ఇప్పుడు దాన్ని మళ్ళా 'మారకటాపురం'గా మార్చాలని యోచిస్తున్నారు ప్రభువులు. తలలూ; పేర్లూ మార్చడంలో వున్న ఆసక్తి తదితరాల్లో బొత్తిగా లేకపోవడానికి ఆ పురం చేసుకున్న పూజే కారణం.
    తిమ్మాపురంలో మరీ ఈ మధ్యనే అజ్ఞానం విజ్రుంభిస్తోందని తెలిసి మనశ్శాంతిని పోగొట్టుకున్నారు కొందరు స్వామి శిఖామణులు. అజ్ఞాన తిమిరంలో చిక్కుకున్న మనిషికి స్వామి భక్తి పెరగడంలో; స్వామివారికి చేతినిండా పనిదొరికింది. ప్రజలకి స్వామి భక్తి పేట్రేగి పోతుందని గ్రహించిన ప్రభువులు ప్రజాభీష్టాన్ని మన్నించి స్వాములను చుట్టుపక్కల్నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించేరు.




Related Novels


Rakshasi Neeperu Rajakeeeyama

Adivishnu Kathanikalu

Adi Vishnu Novels 2

Udyogam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.