Home » adivishnu » Adivishnu Kathanikalu



                                            ఆదివిష్ణు కథలు
                                                                     ---ఆదివిష్ణు
                                                                   

                                             

                                                                   సిద్దార్ధ
    

    వేసవికాలం తేదీ వగైరాలు వద్దు. వేసవికాలం. అంతే! దేశమంతా ఎండలతో మండిపోతోంది. నిప్పులు చెరిగే ఎండకి  నల్లుల్లా మాడిపోతామేమోనని గాభరా పడి ఇళ్ళల్లోంచి జనం బయటకి రావడమే లేదు. ముసలీ, ముతకా రాలిపోతుంటే పసిపిల్లలు ఉన్నవాళ్ళు భయపడి ఛస్తున్నారు.
    చెన్నయ్య ఈ ఎండకి భయపడటం లేదు. ఎండల్ని మించిన కొందరి మనుషుల్ని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ దగ్గరున్న డబ్బు ఎండకంటే తీవ్రంగా ఉంటుందంటాడు. డబ్బున్న మనిషి మండిపడే సూర్యుడ్ని మించినవాడంటాడు. సూర్యుడి దెబ్బకంటే, డబ్బు దెబ్బ గొప్పదంటాడు. డబ్బు మనిషి కన్నెర్ర జేసి చూస్తే సామాన్యుడు మరుక్షణం కాలి బూడిదై పోతాడంటాడు.
    అందువల్ల, చెన్నయ్య వేసవికాలంలో ఎండకంటే డబ్బు మనిషి చూపుకే ఎక్కువగా భయపడతాడు. అలాగే అతను శీతాకాలంలో గడ్డ కట్టించే చలిగ్గాని, వర్షాకాలంలో నిలువునా ముంచెత్తే వానగ్గానీ భయపడకుండా -కేవలం డబ్బు గల మనిషికే గజగజా వణుకుతాడు. నిలువునా ముంచేస్తాడేమోనని వదులుతాడు.
    రోగాలు, మరణాలు వీటికంటే కూడా డబ్బున్న మనిషి దారుణమైన వాడని అతని సిద్దాంతం. సమాజంలో సుఖశాంతులకు వాడొక శాపమని అతని అభిప్రాయం. బ్రతికే జనాభాని అతను రెండు తెగలుగా విభజించాడు. డబ్బున్నవాడు, లేనివాడు. మొదటి జాతిమీద అతనికాంత భయం, కసి, ద్వేషమూ- రెండో జాతిపట్ల అతనికాంత ప్రేమ, జాలి, దయ, కరుణ....ఎంచేత? అల్లా అడగండి. అతను సమాధానమిస్తాడు.
    డబ్బులేని జనం చాలామంది పూరిపాకల్లో, రోడ్డుపక్క ఆకాశం కింద నివసిస్తున్నారట. ఈ జనాభా ఎక్కువ శాతం దేశంలో పెరుగుతున్నారట. మెజారిటీ బలమున్నా సుఖించే యోగ్యత లేదుట.
    పోలీసులకీ, వాళ్ళు పెట్టే కేసులకీ వీళ్ళు మాత్రమే బలైపోతుంటారట. జైళ్ళు చాలా వీళ్ళతోనే కిటకిటలాడి పోతున్నాయట. వీళ్ళకి న్యాయస్థానం అందుబాటులోనే ఉండదట. వీళ్ళని దేవుడు సైతం కరుణించడు. వీళ్ళ తరఫున మాట్లాడే మనిషిక్కూడా మంచినీళ్ళు పుట్టవట. వీళ్ళని అలగాజనమని ఈసడింపుగా, దరిద్రనారాయణులని మర్యాదగా పిలుస్తారుట.
    వీళ్ళంతా డబ్బు మనిషి కాటుకి గురై గిలగిలా తన్నుకుంటారట. బతికినంతకాలమూ వీళ్ళందరి శక్తి సామర్ధ్యాలను గొప్పవాడు దోచుకోవడం మామూలట.
    ఇలాంటి మనుషులు అటు ఎండకాటుకీ, ఇటు డబ్బుదెబ్బకీ తట్టుకోలేకపోవటం చూసి చెన్నయ్యమనసు మరింత కలతపడింది. పడుతుంది. అతని మనసు సాధారణంగా ప్రశాంతంగా ఉండదు. కనీసం రాత్రిళ్ళు సైతం ప్రశాంతంగా నిద్రపోలేడు. రోజులో మూడోభాగం కారులో గడిపి, నాలుగో భాగం నిద్రకు వినియోగించినప్పుడు -ఆ నిద్రకు లోబడితే వేడివేడి ఆలోచనలు చల్లారిపోతాయని అతని బెంగ.
    పడుకుందామనుకున్నప్పుడు అతని ఆలోచనలు మొదట లేమితనమ్మీదకు వెళ్ళగానే ఆ ఆలోచనలకు వేడెక్కి అతని హృదయం భగ్గున మండిపోతుంది. తదుపరి, ఉన్నవాడి భోగభాగ్యాలమీదకు అతనిఆలోచనలు పరుగులెత్తి మంట అధికమవుతుంది.
    ఆపైన ఆలోచనలు ఆగిపోయి కేవలం మంట మాత్రమే మిగులుతుంది. ఆ మంట ఆరనిమంట. ఇంకా నిద్రెక్కడ? మంటతోనే తెల్లవార్లూ అతను గిజగిజ తన్నుకుంటాడు. ఆక్రోశిస్తాడు. భళ్ళున తెల్లవారిన తర్వాత మళ్ళీ కారెక్కుతాడు.
    చెన్నయ్య వయస్సు పెద్దది కాదు. అతనికి పెళ్ళికాలేదు. అందుచేత అతనికి భార్యాబిడ్డలు లేరు. చెన్నయ్య ఇంకా పెళ్ళాడే వయస్సులోనే ఉన్నాడు. అందువల్ల పెళ్ళి చేసుకోవాలనే కోరిక అప్పుడప్పుడు కలుగుతుంది. కానీ పెళ్ళాడకూడదని అతని సిద్దాంతము. పెళ్ళాడి - జనాభాని పెంచి, చాలీచాలని జాతీయ సంపదలో వాళ్ళని ఉత్తుత్తి భాగస్వాములుగా జేయడం అతనికి ఇష్టంలేదు.
    "ఆ మాట కొస్తే, ఇప్పుడున్న జనాభే తిండికి లేక తన్నుకుఛస్తుంటే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా మేకను కని ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడ్తావ్? ఎందరి ఉసుళ్ళు పోసుకుంటావ్? కనకరోయ్ - పెళ్ళి చేసుకోకండి. పిల్లల్ని కనకండి. పిల్లలు పుట్టకూడదు. దేశాన్ని ఓవర్ లోడ్ చేయకూడదు. నువ్వున్నావ్. నువ్వు చాలు.
    నీ ఒక్కడికే గడిచేడవకపోతున్నా ఈ దగాకోరు పరిస్థితుల్లో నీకు పెళ్ళామెందుకూ? పిల్లలెందుకు? వదిలెయ్. సన్యాసం బెటరు. తీసుకో మర్యాదగా ఉంటుంది. తినడానికి ఇక్కడ ఎల్లాగో తిండి దొరకదు. కనుక అడవికి వెళ్ళిపో. అక్కడ దుంపలూ, గడ్డి దొరుకుతాయ్. తినేసి బతుకు.
    గుడ్డలేదని బెంగపడకు. అడవిలో ఆకులుంటాయ్. కట్టేసుకో. అదీ కాదంటావా దిశమొలగా తిరిగెయ్. సిగ్గెందుకోయ్! నీ పూర్వీకులు తిరగలేదా? అసలు, నువ్వు పుట్టినప్పుడు నీకు బట్టలున్నాయా? మరెందుకోయ్ సిగ్గు, చరిత్ర ఎక్కడనుంచి ప్రారంభమయిందో, అక్కడికే వెళ్ళిపో గమ్మత్తుగా ఉంటుంది.
    దేశదేశాల నుంచి నాగరికులు నిన్ను చూడటానికి వస్తారు. ఆదికాలపు తొలిమానవుడు ఇక్కడ దొరుకుతాడని ప్రచారం చేస్తారు. నీ కీర్తి అంతర్జాతీయలెవల్లో ఉంటుంది. బిక్కమొహం పెట్టకు.  చెప్పేది వినంతే! కడుపునిండా తిని - ఒంటినిండా బట్టకట్టుకుని వెళ్ళండి. తాపీగా పిల్లల్ని కనేందుకు.
    దేశకాల పరిస్థితులు నీ చేతిలో ఉన్నాయా? జాతిగాళ్ళ చేతిల్లో ఉన్నాయ్. తప్పుకో. ఆ జాతిలో నువ్వు లేకపోవడం నీ ఖర్మ! ఇది కూడా ఒప్పుకో. ఖర్మేగా, వొరేయ్. అది నీ తప్పు కాదు, దానికి నేను ఒప్పుకుంటాను. అంతమాత్రాన - నా ఖర్మ ఇలా ఎందుక్కాలింది? దానికెవరు బాధ్యులని అడిగేందుకు నీకు హక్కులేదు.
    దేవుడు నీ మొహాన అంతే రాసేడని పెద్దలు చెబుతున్నారు. ఆచార్యులు సిద్దాంతీకరిస్తున్నారు.
    వాళ్ళంతటి వాళ్ళు అంత ఖచ్చితంగా చెప్పింతర్వాత అడిగే హక్కుగాని, తిరగబడే దమ్ముగాని నీకుండకూడదు. అర్ధమవుతుందా? కనకేవిఁటి? ఈ దేశంలో నీలాంటి సామాన్యుడికి చోటులేదని చెప్పుతున్నాను. నువ్వు పెళ్ళాడకూడదు. పెళ్ళాడినా, నీ పెళ్ళాన్ని నువ్వు ముట్టుకోకూడదు. ముట్టుకున్నా పిల్లల్ని కనేయకూడదు. కన్నావో - నిన్ను షూట్ చేసి పారేసే రోజులు కూడా అతి దగ్గరలో వచ్చేస్తున్నాయి ఖబడ్దార్!
    అంతమాత్రాన ఈ దేశం దిక్కుమాలిన దేశమని తిట్టిపొయ్యకు. చక్కటి చరిత్రగల దేశం ఇది! పవిత్రమైన దేశం! ప్రస్తుతం డబ్బున్న (జాతి) మనిషి చెప్పినట్లు నడిచే సౌభాగ్య దేశం. వింటున్నావా? డబ్బున్న మనిషి మాత్రమే బ్రతగ్గలిగిన ఖరీదైన దేశంరా ఇది. నీకు నాకు దేశం కానంత మాత్రాన మేప్ లో అమేరా సిరాపోసి పులిమేస్తారా? కళ్ళు పోతాయిరేయ్!
   




Related Novels


Rakshasi Neeperu Rajakeeeyama

Adivishnu Kathanikalu

Adi Vishnu Novels 2

Udyogam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.