Home » adivishnu » Adi Vishnu Novels 2


 

                                                సగటు మనిషి

                                                                                                     అది విష్ణు

 

                                

 

    రావ్ గదికి రావలసిన మనుషులంతా వచ్చేరు.
    అతని గది అంత మంది వల్ల యిరుగ్గా ఉన్నా, అందరి వల్ల చాలా ఉత్సాహంగా గానూ, కళగానూ వెలిగిపోతుంది. అతనికి కావలసిన మనుషులు అతని మంచమ్మీదా అతని ట్రంకు పెట్టె మీదా కూర్చున్నారు. తతిమ్మావాళ్ళంతా నేలమీద చతికిల బడి వున్నారు. అందర్నీ అక్కడ చూస్తున్న రావ్ కి ఉత్సాహం పెల్లుబికి అదోరకమైన ఆవేశంగా మారిపోయింది.
    అతను లేచి నించున్నప్పుడు వాళ్ళందరూ గుసగుస లాడి శ్రద్ధతో చెవులోగ్గి వినేందుకు సిద్దపడ్డారు.
    "ఫ్రెండ్స్!" అన్నాడు రావ్.
    "గురుడు మాట్లాడుతున్నాడు. వినండంతా" అన్నాడు సుబ్బారావు.
    "నేను నిన్న చెప్పిన "దేవుడి కధ' మీరంతా విన్నారు , కధ చాలా బాగుందని కూడా మీరంతా ఒప్పుకున్నారు , అవునా?"
    "యస్" అన్నాడు సుబ్బారావు.
    "మిగిలిందల్లా పాత్రల పంపకాలు."
    "ఇంగ్లీషులో దాన్నేమంటారో మనకి తెలియదు" సుబ్బారావు ఆ మాట అనేసి తలదించుకున్నాడు.
    "మాటకి అడ్డు పడకోరేయ్ సుబ్బారావ్! నేను చెప్పేది శ్రద్దగా విను. ఆ దేవుడి నాటకంలో ఆఫీసరు పాత్ర నాది. వరదరాజులుగా సుబ్బారావు. ఆంజనేయులుగా ముకుందం. గోవిందరావుగా శోభనాచలం వర్ధనమ్మగా మూర్తి శ్రీదేవిగా అంజిబాబూను . దీంట్లో మీకేమైనా అభ్యంతరముంటే చెప్పండి. అది ఈ నిమిషంలోనే చెప్పాలి. ఆలస్యం ఏమాత్రం పనికి రాదు.
     రావ్ చెసిన నిర్ణయానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. సుబ్బరావేదో తటాపటాయించడం గమనించి, అందరూ అతన్ని చూస్తుండిపోయేరు. అది గమనించి సుబ్బారావు నీళ్ళు నమిలేడు.
    "స్పీక్ నీ మనసులో ఏమీ దాచకోరేయ్  సీనుగా! నీకేం తోస్తే అది చెప్పు. నువ్వు చెప్పింది ఆచరించడమూ , మానడమూ తరువాత విషయం, నీకేమనిపిస్తుందో దాన్ని కక్కేయ్ మున్దు౧ కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడంతే" అన్నాడు రావ్.
    సుబ్బారావు లేచి నుంచొని , మెడ చుట్టుతా చేత్తో రాసుకుని చాలా కచ్చితంగా అనేసేడు.
    "రావ్ గాడి ప్లాన్ నాకు తెలుసు. నాటకంలో గ్లామరున్న పాత్రని వాడు కొట్టేసి మిగతా చెత్తంతా మన మొహాన్న కొట్టేడు. ఆఫీసరు వేషమే వేసి జనాన్ని వొప్పించగల స్తోమతున్నవాళ్ళు ఇంకా వున్నారు. ఆ నాటక రచయిత రావ్ గాడి ప్రెండయితే కావచ్చు గానీ అంతమాత్రం చేత వాడికిష్టమైన వేషం పుచ్చుకోవడం ఘోరం అన్యాయం."
    రావ్ మెల్లిగా నవ్వేశాడు ఆ నవ్వులో కావలసినంత 'ఎగతాళి' వుంది. అతను సుబ్బారావు భుజాన్ని తట్టి అన్నాడు.
    "రైట్ నేను నీ మాట కాదనను. స్తేజజి మీద గ్లామరస్ గా వుండాలనే తపన నాకు మాత్రం లేదు. కేవలం సూట్లు, బూట్లతో కనిపించి మన కాలేజిలో వెలిగిపోవాలనే కాంక్షా లేదు. సరే.....నేనా పాత్రకి న్యాయం చేయలేననేగా  నీ ఉద్దేశ్యం? చూపించు మరొన్నీ ఎవడైనా సరే. ఆ పాత్రని పకడ్బందీగా నటించి మెప్పించగల నటుడేవారు? చెప్పరా.....చెప్పు."
    "ఎందుకు లేరు? ముకుందానికి అంజనీ లంటగట్టెనే గానీ, వాడు ఆఫీసరుకైతే ఫస్ట్ క్లాస్ గా పనికొస్తాడు" అన్నాడు సుబ్బారావు.
    "ఎరా ముకుందం. సుబ్బారావుగాడి మాట విన్నావుగా. నువ్వు ఆ వేషం వేయగలవా" రావ్ సిగరెట్ ముట్టిస్తూ అడిగేడు.
    ముకుందం భయపడిపోయేడు.
    అతనికి రావ్ మీద అపరిమితమైన గౌరవమే కాకా, చచ్చేంత గురుభావం కూడా ఉన్నది. రావ్ తో అతను కలిసి తిరగడమే ఒక గొప్ప అర్హతగా భావించే మనిషి అతను. అందుచేత అతను నోరు విప్పి కచ్చితంగా ఎమాటా చెప్పలేకపోయాడు.
    తిరిగి రావే అన్నాడు.
    "రేయ్ సుబ్బారావ్. నువ్వేమీ అపార్ధం చేసుకోనంటే నీకో ముక్క చెప్పాలని ఉందిరా. ఈ ముకుందం ఆఫీసరు వేషం వేయగల సమర్దుడా? వీడి నటనానుభవం నా ముందేంతరా. నా శిష్యుడు వీడు. నేను రెండేళ్ళుగా యీ కాలేజి ఉత్తమ నటుణ్ణి. నువ్వది మరిచి గీర కొద్దీ ఏమిటేమిటో కూస్తున్నావు. ఈ నాటకంలో అఫీసరంటే ఆషామాషీ వేషమనుకుంటున్నావు కాబోలు! డైనమిక్ రోలది. అల్లాటప్పగాళ్ళు చాలా సుళువుగా వేసి పారేసి చీప్ వేషం కాదురా బాబూ! నేను - నన్నడుగుతే నే నోక్కడినే ఆ పాత్రకి న్యాయం చేయగలను. అలా అని నీ ముందు చాలెంజ్ చేస్తాను. బల్లగుద్ది చెబుతాను. ఏమనుకుంటున్నావో నువ్వు. సాక్షాత్తు ఈ నాటకం రాసినవాడే నాకు సర్టిఫికేటిచ్చెడు తెలుసా?"
    సుబ్బారావుకి రావ్ మీద కోపం వచ్చింది. కోపం రాగానే  అరుద్దామనుకున్నాడు  అంతమందిలో అతన్ని ఎదిరించడం సాధ్యం కాదని తెలిసి అలసి గొంతు తగ్గించి అన్నాడు.
    "నీకింత గర్వం కూడదురా రావ్. రెండేళ్ళూ నువ్వు ఉత్తమ నటుడివైతే కావచ్చుగానేరోయ్ ఒళ్ళు మరిచి మాట్టాడ్డం తప్పు. పందెం కాసి చూడు - ఆఫీసరు వేషం నేను వేసి జనంగాళ్ళ చేత భేషనిపించుకుంటాను. నా సత్తా నీకూ తెలీదేమో? అయితే - నీలాగా గొప్పలు పలికే మనిషిని కానురా నేను. సరే కానివ్వు - నువ్వు ఆఫీసరుగానే తగలడు. మేమంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్టే లెక్క ఏరా ముకుందం? అంతేగా?"
    "అంతే" అన్నాడు ముకుందం నిబ్బరంగా.
    నాటకీయంగా నవ్వేడు రావు. ఛాతీ ఉబ్బించి ఇంత గాలి పీల్చుకున్నాడు.
    "అల్ రైట్ . అవుతే ఇవాళ మన సమావేశం జయప్రదంగా ముగిసిందనే చెప్పాలి. రేపు సాయంత్రానికి మీ అందరికీ పుస్తకాలిస్తాను. వారం రోజుల్లో పోర్షన్లు బట్టీయం జరగాలి. ఫేరఫేక్ట్ గా నోటికొచ్చేయాలంతే! ఆ తరవాత వారం రోజులూ సిట్టింగ్ రిహార్సల్స్. ఆ తరవాత రోజులన్నీ స్టాండింగ్  మూమెంట్స్. అవీ మా ఫ్రెండే సెట్ చేస్తాడు. ఒకే?"
    "ఓ.కే" అన్నారంతా.


                                                        *    *    *

    మొదటి రంగం పూర్తీ అయింది. ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ఆ రంగం చాలా హాయిగా , ఎంతో గొప్పగా ముగిసింది. నాటకం రక్తికట్టే సన్నివేశాన్ని ఆ నటులేంతో జాగ్రత్త తీసుకుని నీటుగా ప్రదర్శించారు.
    కాలేజి ఆడిటోరియంలో కళకళలాడుతుంది. ఆడా మగా అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఫైనలియర్ బి.ఏ. వాళ్ళు నాటకం పట్ల గత నెలరోజుల నుంచీ మంచి  ప్రచారం జరిగింది. అందుచేత అందరూ ఆ నాటకం కోసమే కాచుకున్నట్లు అక్కడ శ్రద్దగా కూర్చున్నారు.




Related Novels


Rakshasi Neeperu Rajakeeeyama

Adivishnu Kathanikalu

Adi Vishnu Novels 2

Udyogam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.