Home » Ladies Special » 'మౌనం' మంచిదే

'మౌనం' మంచిదే

1)"రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం మవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం.

2) మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్  బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం - ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట.

3) మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు,  అరుపులు... అక్కడితో అయిపోతుందా? అవన్నీమనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా?

4) మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

5) ఉదయం లేచిన దగ్గుర్నుచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై.. ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది.  అదే" మౌనం". ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది  చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు. ఇక ఇప్పటికైతే నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నా.

-రమ


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.