Home » Baby Care » జుట్టు ఎప్పటికీ తెల్లబడకుండా ఉండాలంటే.. ఈ పనులు చెయ్యాలి..!
.webp)
ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు తెల్లజుట్టు కేవలం వయసు అయిపోయిన వారిలోనే కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. మరీ దారుణంగా చిన్నపిల్లలలో కూడా తెల్లజుట్టు కనిపించడం ఆందోళనకు గురిచేసే అంశం. చాలా మంది తెల్లజుట్టును చూసి గందరగోళానికి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి ఆందోళనలు సమస్యను ఎక్కువ చేస్తాయి. మరికొందరు కాంప్రమైజ్ అయిపోయి కలర్ డైలు వాడుతూ తెల్లజుట్టును కవర్ చేసుకుంటారు. అయితే వీటన్నింటికి బదులు తెల్ల జుట్టును నల్లగా మార్చే పరిష్కారాన్ని మాత్రమే కాకుండా.. అసలు తెల్ల జుట్టు సమస్యకు మూలం ఏంటనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. తెల్ల జుట్టు సమస్యకు కారణాలు.. ఈ తెల్లజుట్టు సమస్య అస్సలు రాకూడదు అంటే పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుంటే..
ధూమపానం..
ధూమపానం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మాత్రమే కాకుండా జుట్టు బూడిద రంగులో మారడానికి కూడా కారణమవుతుంది. కేవలం నేరుగా సిగరెట్, బీడి, పొగాకు తీసుకునేవారే కాదు.. పరోక్షంగా ఈ పొగను పీల్చేవారు కూడా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉన్నాయట. జుట్టు నెరయడం, ధూమపానం మధ్య సంబంధం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ధూమపానం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వలన జుట్టుకు తగినంత పోషకాలు అందవు. బలహీనత కారణంగా జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభమవుతుంది.
యోగా..
యోగా చేయకపోవడం వల్ల శరీరం నీరసంగా మారడమే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. యోగా లేదా మరే ఇతర శారీరక శ్రమలో పాల్గొననప్పుడు, వృద్ధాప్యం త్వరగా వస్తుంది. అది జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. జుట్టు బూడిద రంగులోకి మారడానికి ఇదే కారణం. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది జుట్టుకు ఎక్కువ పోషణను అందిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పోషణ..
జుట్టు తెల్లబడటానికి ఒక ప్రధాన కారణం పోషకాహార లోపం. తగినంత పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు తిననప్పుడు జుట్టుకు అవసరమైన పోషకాలు లభించవు. దీనివల్ల అది బలహీనంగా మారుతుంది. త్వరగా నెరిసిపోతుంది. అందువల్ల ఆహారంలో ఒమేగా 3, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని జోడించాలి. జంక్ ఫుడ్ మానేయాలి.
శుభ్రత..
జుట్టు సరిగ్గా కడగకపోతే అది కూడా బూడిద రంగులోకి మారడానికి కారణమవుతుంది. ఎందుకంటే జుట్టును సరిగ్గా కడగకపోతే, తలపై మురికి పేరుకుపోతుంది, దీని వలన రంధ్రాలు మూసుకుపోతాయి, జుట్టు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. అలాగే, మరు ప్రతిరోజూ జుట్టును కడుక్కుంటే అది తలలోని సహజ నూనెను కూడా తొలగిస్తుంది. జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందువల్ల జుట్టును వారానికి 2-3 సార్లు మాత్రమే కడగాలి.
ఒత్తిడి..
ఒత్తిడి అన్ని విధాలుగా హానికరం. అది ఆరోగ్యం అయినా, చర్మం, జుట్టు అయినా, ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది, ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. జుట్టు తెల్లబడటం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి ధ్యానం చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి.
*రూపశ్రీ.

