Home » Ladies Special » ఇవి పాటించే ఆడపిల్లను ఎవరూ ఎప్పటికీ తక్కువగా చూడరు..!

ఇవి పాటించే ఆడపిల్లను ఎవరూ ఎప్పటికీ తక్కువగా చూడరు..!

జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను కేవలం శారీరక బలంతోనే కాకుండా, మానసిక  శక్తితో , తెలివితో  ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం ప్రతి ఒక్కరి ప్రయాణంలోనూ చాలా ముఖ్యం. ఆధునిక సమాజంలో బాధ్యతల నడుమ నలిగిపోతూ, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నించే మహిళలు చాలా మంది ఉన్నారు.  కొందరు మహిళలు తమ కుటుంబంలోనూ,  సమాజంలోనూ చాలా చిన్నతనంగా భావించబడుతూ ఉంటారు. ఇలాంటి మహిళలు లోలోపల చాలా బాధపడుతూ ఉంటారు కూడా.  అయితే  ఇలాంటి మహిళల కోసం  కొన్ని అమూల్యమైన జీవన సూత్రాలు ఎంతో గొప్పగా సహాయపడతాయి. సమాజంలో ఎవరూ మహిళలను  తక్కువగా చూడకుండా, తమకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ  విషయాలేంటో.. వాటిని మహిళలు పాటించడం ఎందుకు అవసరమో.. వివరంగా తెలుసుకుంటే..

తమ తెలివి తేటలను,  బుద్దిని గుర్తించడం..

సాధారణంగా సమాజంలో బలం అంటే కేవలం గట్టిగా మాట్లాడటం లేదా అరిచి గెలవడం అనుకుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం, స్త్రీల దగ్గర సహజంగానే అద్భుతమైన విచక్షణ, ఆలోచనా శక్తి ఉంటాయి. మహిళలకు ఉన్న  ఆ బుద్ధే  అసలైన ఆయుధం. దాన్ని గుర్తించి ప్రతి అడుగులోనూ సరిగ్గా వాడితే ఏ సమస్యకైనా సులభంగా పరిష్కారం దొరుకుతుంది.

 ఆర్థిక స్వాతంత్ర్యం..

ఎంతటి తెలివైనవారైనా చేతిలో సొంత సంపాదన లేకపోతే ఎక్కడో చోట విలువ తగ్గిపోతుంది. ఆపద సమయంలో ఆదుకునేది ధనమే. ఎవరిపై ఆధారపడకుండా ప్రతి మహిళ తనకంటూ  చిన్న నైపుణ్యాన్ని సంపాదించుకోవడం, చిన్న మొత్తంలోనైనా పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఈ ఆర్థిక భద్రత కేవలం డబ్బును మాత్రమే ఇవ్వదు, బతకడానికి అవసరమైన పూర్తి స్వేచ్ఛను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

అనుకున్న పనులను మౌనంగా చేయడం..

మనం చేసే మంచి పనులు లేదా సాధించాలనుకునే లక్ష్యాలు పూర్తయ్యే వరకు అందరికీ చెప్పుకుంటూ పోకూడదు. కొందరు అనవసరమైన సలహాలతో ఉత్సాహాన్ని చంపేస్తే, మరికొందరు అడ్డుపడటానికి చూస్తారు. అందుకే మహిళలు తమ ప్రణాళికలను ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఆచరణలో పెట్టాలి. ఆ తర్వాత వచ్చే  ఫలితమే మహిళల  తరఫున గొంతు విప్పి చెబుతుంది.

 మనుషులను నమ్మే ముందు అర్థం చేసుకోవడం..

ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు అలా అని అందరినీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. నిజమైన మనుషులు ఎవరనేది కష్టకాలంలోనే తెలుస్తుంది. ఆనందంలో ఉండేవాళ్లకు,  కష్టంలో తోడుగా నిలిచేవాళ్లకు మధ్య తేడాను గమనించాలి.  జీవితంలో ఎప్పుడూ మీకు అండగా నిలిచిన నిజమైన బంధాలను జీవితాంతం గుర్తుంచుకోండి.

సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం..

ఎవరి సలహాలనైనా వినడం, పుస్తకాలు చదవడం, పెద్దల అనుభవాన్ని గౌరవించడం చేయవచ్చు. కానీ చివరి నిర్ణయం మాత్రం మహిళల  స్వంత ఆలోచనల మీదే ఆధారపడి ఉండాలి. మహిళల జీవితానికి సంబంధించిన బాధ్యతను పూర్తిగా తమ  చేతుల్లోకి తీసుకున్నప్పుడే మహిళల వ్యక్తిత్వం మరింత దృఢంగా మారుతుంది.

మంచితనానికి ఒక హద్దు ఉండటం..

అడవిలో నేరుగా ఉన్న చెట్లే మొదట నరుకుతారు, వంకరగా ఉన్న చెట్లు నిలబడతాయి. అలాగే అందరికీ అన్ని ఇచ్చేసేంత అతి మంచితనం ఎప్పుడూ మంచిది కాదు. ఏదైనా నచ్చకపోయినా,  మంచిది కాదని అనిపించినా.. ఆ విషయానికి  కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. తమ సమయానికి,  శక్తికి ఒక స్పష్టమైన సరిహద్దులను గీసుకుంటే  ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది.

 ఓర్పుతో సరైన సమయం కోసం వేచి ఉండటం..

ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా నష్టాన్నే మిగుల్చుతుంది. విత్తనం వేసిన వెంటనే పండు రానట్టు, విజయం రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఆ మధ్యకాలంలో నిరాశ చెందకుండా తమ  ప్రయత్నం తాము చేస్తూ ఉండాలి. సరైన సమయం వచ్చినప్పుడు తమ ఓర్పు తమకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.

పైన చెప్పుకున్న విషయాలన్నింటినీ పాటిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి. తమలో ఉన్న అసలైన శక్తిని నమ్మాలి, ఎందుకంటే మహిళలు తామున అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు.  


                                                                                                                                             *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.