Home » Baby Care » పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచే అద్బుతమైన మార్గాలు!

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచే అద్బుతమైన మార్గాలు!

ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి చాలా ముఖ్యం. చిన్న పిల్లలు అయినా, పెద్ద వారు అయినా ఆత్మవిశ్వాసం లేకపోతే ఏదీ సాధించలేరు.  చేతకాని వాళ్లలా మిగిలిపోతారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు చిన్నతనం నుండే ఆత్మవిశ్వాసం నూరిపోయాలి.  తద్వారా వారు జీవితంలోని సమస్యలను  పరిష్కరించుకోవడంలో,  తమ ప్రతిభను తాము మెరుగుపరుచుకోవడంలో,  ఏదైనా నేర్చుకోవడంలో ఇలా చాలా రకాలుగా మెరుగ్గా ఉంటారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఆత్మవిశ్వాసంగా ఉండాలని కోరుకుంటారు.  అన్ని విషయాల్లో పిల్లలు ధైర్యంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఆత్మవిశ్వాసం అనేది తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చేది కాదు. అది చిన్నతనం నుండి తల్లిదండ్రులు పిల్లలలో పెంపొందించాలి.  పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే..

పిల్లలో ఆత్మవిశ్వాసం ఎలా పెంచాలంటే..

సరైన మార్గదర్శకత్వం,  వాతావరణం ఉంటే, పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు సవాళ్లను బాగా ఎదుర్కుంటారు, తమ మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పగలుగుతారు.


ప్రయత్నాలు,  అభినందనలు..

తరచుగా పిల్లలు పరీక్షలలో లేదా ఆటలలో  ముందు వచ్చినప్పుడు లేదా ట్రోఫీ గెలిచినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు పిల్లలను అభినందిస్తూ ఉంటారు. కానీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి  పునాది ప్రయత్నంలోనే ఉంటుంది. పిల్లలు దేనికోసం అయినా ప్రయత్నం చేసి విఫలం అయితే.. వారి ప్రయత్నాన్నే మెచ్చుకోవాలి. ఇది వారిలో భయాన్ని, నిరాశను, ఆత్మన్యూనతా భావాన్ని తగ్గిస్తుంది.

సొంత నిర్ణయాలు..

 పిల్లలు తమ కోసం చిన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వారు తమ సామర్థ్యాలను నమ్ముతారు. ఈ చిన్న ప్రారంభం భవిష్యత్తులో పెద్ద,  కష్టతరమైన నిర్ణయాలకు వారిని సిద్ధం చేస్తుంది. వారికి నచ్చింది తినడం,  వారికి నచ్చిన బట్టలు వేసుకోవడం, వారికి ఆసక్తి ఉన్న పనులు చేయడం వంటివి వారితో చేయనిస్తే వారిలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.

తప్పులు, పాఠాలు..

కొన్నిసార్లు పిల్లలు తిట్లకు  భయపడి తప్పులను దాచిపెడుతూ ఉంటారు. కానీ తప్పులు చేయడం సహజం. తప్పులే పాఠాలు అవుతాయని, అవే  విజయానికి సోపానాలు అని తల్లిదండ్రులే  వారికి నేర్పించాలి. పిల్లలు  పోటీలో విఫలమైనా, ఏదైనా సాధించలేకపోయినా అరవడానికి బదులుగా, వారితో మాట్లాడాలి.  ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి, వారి అర్థమయ్యేలా చెప్పాలి.  అప్పుడు తప్పులను దాయరు,  అలా అని తప్పులు చేస్తూనే ఉండరు.  నేర్చుకుంటూ ఉంటారు.

నైపుణ్యాలు..

పిల్లవాడు సైకిల్ తొక్కడం, పెయింటింగ్ వేయడం లేదా చిన్న ఇంటి పనులు చేయడం వంటివి ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు, వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారికి ఆసక్తి ఉన్న కొత్త విషయాలను నేర్చుకోవడానికి . వారు ఒక పనిలో ఎంకరేజ్ చేయాలి. వారు నేర్చుకునే పనిలో నైపుణ్యం సాధిస్తే వారి సామర్త్యం గురించి వారికి మంచి అవగాహన పెరుగుతుంది. చిన్న లక్ష్యాలు సాధించడం కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది.

రోల్ మోడల్..

పిల్లలు మనం నేర్పేది నేర్చుకోరు, మనం చేసేదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు సవాళ్లకు భయపడితే లేదా తమను తాము  విమర్శించుకుంటే,  పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.  తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు  తప్పులను అంగీకరించి  సరిదిద్దుకోవాలి. పిల్లలు అదే నేర్చుకుంటారు.  ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

                              *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.