Home » Health Science » జాగ్రత్త.. తలలో చుండ్రుతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్..!
జాగ్రత్త.. తలలో చుండ్రుతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్..!
.webp)
తలపై చుండ్రు ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామంది చుండ్రు సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. చుండ్రు చాలా వరకు పొడి చర్మం ఉన్నవారికే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాతావరణ మార్పులు, తలపై అధిక నూనె, ఫంగస్ అధికంగా పెరగడం, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ సరైనవి వాడకపోవడం.. ఇలా చాలా రకాల సమస్యలు చుండ్రు రావడానికి కారణం అవుతూ ఉంటాయి. సాధారణంగా చుండ్రు తరచుగా తెల్లటి లేదా లేత పసుపు రంగు పొరలుగా కనిపిస్తుంది. లైట్ గా దురదను కలిగిస్తుంది. అయితే, ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే లేదా ఇతర తల చర్మ సమస్యలతో పాటుగా ఉంటే, అది మరొక చర్మ సమస్య కారణంగా అలా జరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో తల చర్మ సమస్యలు ముఖం మీద, చెవుల చుట్టూ, లేదా శరీరంలోని ఇతర భాగాలపై కూడా కనిపిస్తూ ఉంటాయి. చుండ్రు తగ్గడానికి ఏదైనా వాడిన తర్వాత కూడా.. చుండ్రు మళ్లీ మళ్లీ వస్తుంటే.. అసలు చుండ్రు సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చుండ్రుతో పాటు కొన్ని లక్షణాలు కనిపిస్తే అది చాలా డేంజర్ అని చెబుతారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే..
దురద ఎక్కువ ఉండటం..
చుండ్రుతో పాటు చాలామందికి లైట్ గా దురద ఉంటుంది. కానీ దురద తగ్గకుండా ఉంటే లేదా పదేపదే తల గోకవలసి వచ్చేంత తీవ్రంగా ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా గోకడం వల్ల తలపై చిన్న గాయాలు ఏర్పడి, చర్మపు చికాకు పెరిగే అవకాశం ఉంటుంది.
ఎరుపు లేదా వాపు..
చుండ్రుతో పాటు తల చర్మం ఎర్రబడటం, చికాకు లేదా వాపు వంటి లక్షణాలు ఉంటే, అది కేవలం సాధారణ చుండ్రు కాకపోవచ్చు. ముఖ్యంగా లక్షణాలు అలాగే కొనసాగితే.. డెర్మటాలజిస్ట్ ను కలవడం మంచిది.
మందంగా, జిగటగా పొరలు రావడం..
కొన్నిసార్లు తలపై ఏర్పడే తెల్లటి లేదా పసుపు రంగు పొలుసులు మందంగా మారి చర్మానికి అంటుకుపోతాయి. వాటిని గోళ్లతో పదేపదే గీకడం మానుకోవాలి. ఈ పొలుసులు ఇలాగే ఏర్పడుతున్నా లేదా తలపై నొప్పి , చికాకు ఉంటే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు.
హెయిర్ ఫాల్..
చాలామంది చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని అనుకుంటారు. కానీ ఎప్పుడూ దురదగా ఉండటం, వాపు ఉండటం, తలను బలంగా గోకడం వంటివి జుట్టును ప్రభావితం చేస్తాయి. చుండ్రుతో పాటు అకస్మాత్తుగా లేదా సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలుతుంటే వైద్యుడి సంప్రదించాలి.
ముఖం లేదా చెవులకు..
తలతో పాటు కనుబొమ్మల మీద, చెవుల చుట్టూ, ముక్కు పక్కన, లేదా ముఖం మీద కూడా ఎర్రదనం , పొలుసులు రాలడం కనిపిస్తే, అది వేరొక చర్మ సమస్యకు సంకేతం కావచ్చని అంటున్నారు. ఇలాంటప్పుడు సొంతంగా క్రీములు లేదా మందులు వాడటం కాకుండా చర్మ సంబంధ నిపుణులను సంప్రదించి మందులు వాడాలి.
*రూపశ్రీ.
