Home » Ladies Special » దేశం మర్చిపోయిన మహిళా శాస్త్రవేత్త - అన్నామణి

 

దేశం మర్చిపోయిన మహిళా శాస్త్రవేత్త - అన్నామణి

 

 

ఆమధ్య ఇస్రో వందకు మించిన ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపగానే దేశం యావత్తూ గర్వపడింది. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల మీద ప్రత్యేకమైన కథనాలు రాసేందుకు పత్రికలన్నీ ఉత్సాహ పడిపోయాయి. మంచిదే! కానీ ఆడవారిలో నూటికి ఒక్కరు కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లోనే... ఒక మహిళ విజ్ఞానరంగంలో దూసుకుపోవడం ఎంతటి విజయమో కదా! అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన వ్యక్తి ‘అన్నామణి’.

కేరళలోని ట్రావెన్కోర్ పట్నానికి సమీపంలోని ఓ చిన్న ఊరిలో 1918లో జన్మించారు అన్నామణి. తండ్రి ఇంజనీర్ కావడం చేతనో ఏమో... చిన్నప్పటి నుంచే ఆమెకు చదువంటే చాలా ఇష్టంగా ఉండేదట. ఆ ఇష్టంతోనే విపరీతంగా పుస్తకాలను చదివేవారు. ఆమె ఎనిమిదో ఏట బంగారు దిద్దులను బహుమతిగా ఇస్తానంటే కాదు... బ్రిటానికా ఎన్సైక్లోపీడియా కావాలని అడిగారట అన్నామణి. ఆమె పెరిగేకొద్దీ చదువు పట్ల ఆమె ఆసక్తి కూడా పెరుగుతూనే వచ్చింది. అందుకనే తన తోటివారంతా త్వరత్వరగా పెళ్లిళ్లు చేసేసుకుంటే, అన్నామణి మాత్రం చదువుకునేందుకే ప్రాధాన్యతని ఇచ్చారు. అలా తనకి ఇష్టమైన భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ డిగ్రీని సాధించారు.

చదువు పూర్తయిపోయిన తరువాత డాక్టరేట్ పట్టా కోసం సర్ సి.వి.రామన్ లేబొరేటరీలో చేరారు మణి. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు కాంతి గురించి ఏకంగా ఐదు రీసెర్చి పేపర్లను అందించారు. అయినా స్త్రీ అన్న కారణంగా మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజి ఆమెకు పీహెచ్డీ పట్టాను అందించేందుకు సిద్ధపడలేదు. ఏవో చిన్నాచితకా సాకులు చూసి ఆమె శ్రమను వృధా చేసేసింది. అయినా అన్నామణిలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు సరికదా... ఈసారి ఉన్నత విద్య కోసం ఏకంగా అమెరికాకే ప్రయాణమయ్యారు.

అమెరికాలో వాతావరణశాస్త్రం (Meteorology)లో ఉన్నతవిద్యను పూర్తిచేసి 1948లో దేశానికి తిరిగివచ్చారు అన్నామణి. అ సమయంలో దేశంలోని విజ్ఞానరంగం ఇంకా ప్రారంగభదశలోనే ఉంది. శాస్త్రపరిశోధనకు తగిన మౌలిక సదుపాయాలు కానీ, స్థిరమైన సంస్థలు కానీ లేవు. అలాంటి పరిస్థితులలో పునేలోని Indian Meteorological Departmentలో చేరారు అన్నామణి.

 


విజ్ఞానరంగానికే అంతగా ప్రాముఖ్యత లేని ఆ కాలంలో ఇక వాతావరణశాస్త్రం గురించి చెప్పేదేముంది. అసలు వాతావరణానికి ఓ ప్రత్యేకమైన శాఖ అన్న విషయమే జనాలకి ఆశ్చర్యంగా ఉండేది. అలాంటి శాఖతో అద్భుతాలు చేసి చూపారు అన్నామణి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సోలార్ రేడియేషన్ స్థాయిని కొలిచే ప్రయత్నం చేయడం; ఓజోన్ పొర తీరు గురించి ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడం; పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తుని ఉత్పత్తి చేసేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడం... ఇలా వాతావరణ శాఖకి కూడా ఓ ప్రత్యేకత ఉందని నిరూపించారు. ఆ ప్రతిభతోనే భారత వాతావరణశాఖకు డిప్యూటీ డైరక్టర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు.

ఆడవారికి చదువే దండగనుకునే కాలంలో ఉన్నత విద్యతో పాటు ఉన్నతమైన పదవులనీ అలంకరించారు అన్నామణి. ఆవిడ వృత్తి జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా అంతే ఉన్నతంగా ఉండేది. చిన్నప్పుడు ఎప్పుడో గాంధీగారిని చూసి ప్రభావితం అయిన అన్నామణి తన జీవితాంతమూ ఖాదీ వస్త్రాలనే ధరించేవారు. ఎంతసేపూ విజ్ఞానరంగానికి ఏదన్నా చేయాలనే తలంపుతో ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. దేశానికి ఇంత సేవ చేసినా కూడా మీడియా ఆమెను విస్మరించడం ఆశ్చర్యకరం. అన్నామణి చనిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలు ఆమె సేవలను గుర్తుచేసుకోకపోవడం బాధాకరం. బహుశా అన్నామణి ఇలాంటి గుర్తింపునో, కృతజ్ఞతనో ఆశించి తన జీవితాన్ని గడిపి ఉండరు. విజ్ఞానం పట్ల ఆసక్తి, చేస్తున్న పనికి న్యాయం చేయాలనే తపనే ఆమెను ముందుకు నడపించి ఉంటాయి. అంత ఉన్నతంగా ఆలోచించడం మనవల్ల కాదు కాబట్టి, ఆమెని ఇంకా గుర్తించలేకపోతున్నాం.

- నిర్జర.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.