Home » Yoga » చేతిలో డబ్బు లేక అల్లాడుతున్నారా ఇంటి ఇల్లాలు ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం తథ్యం.!

చేతిలో డబ్బు లేక అల్లాడుతున్నారా ఇంటి ఇల్లాలు ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం తథ్యం.!

ఈ రోజుల్లో ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా చాలామందికి చేతిలో రూపాయి కూడా నిలవడం లేదనే బాధ ఎక్కువగా ఉంటోంది. నెలాఖరు వచ్చేసరికి అత్యవసర ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడేవారు ఎందరో ఉన్నారు. ఇంట్లో కష్టానికి తగిన ఆదాయం ఉన్నప్పటికీ, ఆ డబ్బు ఎటు పోతుందో తెలియక అల్లాడుతుంటారు.  సనాతన ధర్మంలో ఇంటి ఇల్లాలిని సాక్షాత్తూ గృహలక్ష్మితో పోలుస్తారు. ఇల్లాలు నడుచుకునే విధానం, ఆమె చేసే చిన్న చిన్న పనుల పైనే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి, ఐశ్వర్యం ఆధారపడి ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఇంటి ఇల్లాలు కొన్ని సులభమైన, పవిత్రమైన నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటో తెలుసుకుంటే..

ఉదయం లేవగానే చేయాల్సిన పనులు..

ప్రతి రోజూ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా మంచిది. ఉదయాన్నే లేచి ఇల్లు, గుమ్మం శుభ్రం చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు నీటితో కడిగి చక్కటి ముగ్గు పెట్టాలి. సూర్యోదయ సమయంలో ఇంటి ముంగిట ముగ్గు వేసి ఉన్న ఇంట్లోకి రావడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుందని   నమ్ముతారు. శుభ్రత ఉన్న చోటే శ్రీమహాలక్ష్మి నివసిస్తుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా, సువాసనభరితంగా ఉండేలా చూసుకోవాలి.

ఈశాన్య మూల , తులసి పూజ..

ఇంట్లో ఈశాన్య భాగాన్ని ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి. అక్కడ చెత్తాచెదారం లేదా బరువైన వస్తువులు పెట్టకూడదు. అలాగే ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటకు ఉదయం పూట నీరు సమర్పించి పూజించాలి. తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం వేళల్లో తులసి మొక్క వద్ద, అలాగే ఇంటి దేవుని గదిలో ప్రమిదలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది.

సాయంత్రం వేళల్లో పాటించాల్సిన నియమాలు..

సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని చెప్తారు. అందుకే ఆ సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. సంధ్యా వేళలో ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. అలాగే ఆ సమయంలో ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వడం కానీ, బయట నుంచి అప్పుగా తీసుకోవడం కానీ చేయకూడదు. ఇల్లు చీకటిగా ఉండకుండా సాయంత్రం కాగానే దీపాలు వెలిగించాలి. ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో గానీ, నెయ్యితో గానీ దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది.

ఇంట్లో ఉండకూడని పరిస్థితులు..

ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కోపంతో, చిరాకుగా ఉండకూడదు. ఇంట్లో గొడవలు, అరుచుకోవడాలు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. శాంతం, ఆనందం ఉన్న ఇల్లే లక్ష్మీదేవికి ఇష్టమైన నివాసం. అలాగే విరిగిన పాత్రలు, పనిచేయని గడియారాలు, చిరిగిపోయిన దుస్తులను ఇంట్లో ఉంచుకోకూడదు. సాయంత్రం పూట ఇల్లు తుడవడం, చెత్తను బయట పడేయడం వంటి పనులు చేయకూడదు. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుందట.

అరటి చెట్టు ఆరాధన , సూర్యుడికి అర్ఘ్యం..

ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవడానికి , విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడానికి అరటి చెట్టుకు నీరు పోసి నమస్కరించడం మంచిది. అలాగే ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి.

ముఖ్యంగా.. అప్పుల బాధల నుంచి విముక్తి పొంది, చేతిలో ధనం నిలవాలన్నా,  సంపాదించిన ధనం నిలబడాలన్నా పెద్ద పెద్ద పూజలే చేయాల్సిన అవసరం లేదు. ఇంటి ఇల్లాలు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ఇల్లు శుభ్రంగా ఉంచుకుని, ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ, దైవచింతనతో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో శాంతి, శ్రేయస్సు సంప్రాప్తిస్తాయి.

                                 *రూపశ్రీ.

Struggling with Hormonal Imbalance,These Powerful Yoga Asanas May Help,Hormonal Imbalance Troubling You


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.