Home » Baby Care » చిన్న పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు తప్పక తీసుకెళ్ళాల్సిన వస్తువులు..!

చిన్న పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు తప్పక తీసుకెళ్ళాల్సిన వస్తువులు..!



చిన్న పిల్లలతో ప్రయాణం చేయడం అంటే అది ఒక అందమైన అనుభవంతో పాటు పెద్ద బాధ్యత కూడా. సరైన ప్రణాళిక లేకపోతే ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద విసుగును కలిగిస్తాయి. ముఖ్యంగా పసిపిల్లలు లేదా మూడేళ్ల లోపు పిల్లలను వెంట తీసుకెళ్తున్నప్పుడు వారి అవసరాలు చాలా భిన్నంగా ఉంటాయి. వాతావరణం మారినా, వేళకు ఆహారం అందకపోయినా పిల్లలు త్వరగా అసహనానికి గురవుతారు. అందుకే ప్రయాణం మొదలుపెట్టడానికి ముందే వారికి అవసరమైన ప్రతీ చిన్న వస్తువును జాగ్రత్తగా సర్దుకోవడం ఎంతో ముఖ్యం.  అన్నీ సమకూర్చుకుని  ప్రయాణం చేస్తే పిల్లలకు, తల్లిదండ్రులకు  కూడా ఎంతో హాయిగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలో పిల్లలతో ప్రయాణించేటప్పుడు  తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువుల గురించి వివరంగా తెలుసుకుంటే..

 ఆహారం , నీరు..

పిల్లలు ప్రయాణంలో త్వరగా ఆకలికి గురవుతుంటారు. అందువల్ల వారికి ఇష్టమైన, సులభంగా అరిగే ఆహార పదార్థాలను వెంట ఉంచుకోవడం చాలా మంచిది. ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లు, ఉడకబెట్టిన పండ్లు, పొడి ఆహారాలు లేదా  పిండి వంటివి ప్రయాణంలో చాలా ఉపయోగపడతాయి. పసిపిల్లలు అయితే వారికి సరిపడా పాలు, పాల సీసాలు, అలాగే పాల సీసాలను శుభ్రం చేయడానికి వేడి నీరు పట్టే థర్మోస్ ఫ్లాస్క్ తప్పనిసరిగా ఉండాలి. బయట దొరికే నీటిని పిల్లలకు ఇవ్వడం సురక్షితం కాకపోవచ్చు కాబట్టి తాగునీటిని తగినంతగా ఇంట్లో నుంచే తీసుకెళ్లడం శ్రేయస్కరం.

దుస్తులు, డైపర్స్..

పిల్లల దుస్తులు ఎప్పుడూ కాటన్ ,  మెత్తగా ఉండేలా చూసుకోవాలి. వాతావరణానికి తగినట్లుగా రెండు లేదా మూడు సెట్ల దుస్తులు అదనంగా తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే ప్రయాణంలో పిల్లలు బట్టలు మురికి చేసుకోవడం చాలా సాధారణం. దుస్తులతో పాటు సరిపడా డైపర్లు, డైపర్ రాష్  క్రీమ్,  వెట్ వైప్స్ తప్పనిసరిగా ఉండాలి. వెట్ వైప్స్ ప్రయాణంలో చేతులు, ముఖం శుభ్రం చేయడానికి అలాగే అత్యవసర సమయాల్లో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. వీటితో పాటు చిన్న చేతి కర్చీఫ్ లు, టవళ్లు కూడా విడిగా  ఉంచుకోవడం కంఫర్ట్ గా  ఉంటుంది.

ఫస్ట్ ఎయిడ్ కిట్..

ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రయాణంలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. వాతావరణం లేదా ప్రదేశం మారినప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు, కడుపునొప్పి వంటివి రావడం సహజం. అందుకే పిల్లల  మందులు, జ్వరం సిరప్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, , బాండేజీలు ఎప్పుడూ  హ్యాండ్ బ్యాగ్ లో సిద్ధంగా ఉండాలి. ప్రయాణానికి ముందే  పిల్లల పీడియాట్రీషియన్‌ను కలిసి కొన్ని అత్యవసర మందులను సూచించమని అడగడం ఇంకా మంచిది.  క్రమంత తప్పకుండా వాడుతున్న ప్రత్యేక మందులు ఏవైనా ఉంటే వాటిని కూడా మర్చిపోకుండా సరిపడా పరిమాణంలో ఉంచుకోవాలి.

బొమ్మలు..

 ప్రయాణంలో పిల్లలు విసుగు చెందకుండా ఉండటానికి ఆట వస్తువులు చాలా అవసరం. చాలా దూర  ప్రయాణాల్లో పిల్లలు ఒకే చోట కూర్చోవడం కష్టంగా భావిస్తారు. వారి దృష్టిని మళ్లించడానికి వారికి ఇష్టమైన చిన్న చిన్న ఆట బొమ్మలు, కలరింగ్ పుస్తకాలు లేదా కథల పుస్తకాలు వెంట తీసుకెళ్లవచ్చు. అయితే ఎక్కువ శబ్దం చేసే బొమ్మల కంటే, వారి బుర్రకు బాగా పని పెట్టే  బొమ్మలను ఎంచుకోవడం మేలు. ఇవి ప్రయాణంలో పిల్లలను అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.

చివరగా..

ఇవన్నీ సర్దుకోవడానికి ఒక ప్రత్యేకమైన, సులభంగా తీసుకెళ్లగలిగే హ్యాండ్ బ్యాగ్ ఉపయోగించడం మంచిది. పిల్లల వస్తువులను పెద్దల లగేజీతో కలపకుండా  చిన్నగా  విడిగా ఉండే సంచిలో పెట్టుకుంటే, అత్యవసర సమయంలో ఏ వస్తువు కావాలన్నా వెంటనే వెతికి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రయాణ సమయాన్ని బట్టి ఆరుబయటకు వెళ్తున్నట్లయితే చిన్న టోపీలు, సన్‌స్క్రీన్ లోషన్లు కూడా వెంట ఉంచుకోవడం మంచి ఆలోచన.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ప్రయాణానికి అవసరమైన వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే,  ప్రయాణం ఎలాంటి ఒత్తిడి లేకుండా సురక్షితంగా , సంతోషకరంగా సాగుతుంది.

                                                                                                                                                 *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.