![]()
ఒక్కోసారి పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంటాయి. 'మహావతార్ నరసింహ' ఆ కోవలోకే వస్తుంది. జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది.
'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న హోంబలే ఫిలిమ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. ఈ యూనివర్స్ నుంచి ఏడు సినిమాలు వస్తాయని, మొదటి సినిమా 'మహావతార్ నరసింహ' ఈ ఏడాది వస్తుందని ప్రకటించింది. చెప్పినట్టుగానే జూలై 25న నరసింహ విడుదలైంది.
ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండు రోజు రెట్టింపు వసూళ్లు వచ్చాయి. మూడో రోజు అంతకుమించి రాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ లోనూ మ్యాగ్జిమమ్ షోలు ఫుల్ అవుతున్నాయి. బుక్ మై షోలో గంటకు పది వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి.
డివోషనల్ ఫిల్మ్ కావడం, యానిమేషన్ వర్క్ బాగుందని టాక్ రావడం, పిల్లలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం.. వంటి కారణాలతో 'మహావతార్ నరసింహ'కు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.