Home  » Movie-News » ప్రపంచంలో ఎవరూ చేయనిది నేను చేశాను.. అందుకే నాకు పొగరు!



సినీ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఇళయరాజాకు దక్కుతుంది. అప్పటివరకు కమర్షియల్‌ సినిమాలకు తగ్గట్టుగా సాగుతున్న సినిమా సంగీతాన్ని మలుపు తప్పి తన మార్క్‌ సంగీతాన్ని శ్రోతలకు, ప్రేక్షకులకు పరిచయం చేశారు ఇళయరాజా. సంగీత దర్శకుడిగా ఎవరూ సాధించని 1000 సినిమాల ఫీట్‌ను టచ్‌ చేసిన ఆయన దాదాపు 5000కు పైగా పాటలను ట్యూన్‌ చేశారు. 1970 దశకంలో సంగీత దర్శకుడుగా సినీ పరిశ్రమకు వచ్చిన ఇళయరాజా కొత్త తరహా సంగీతాన్ని అందించడంలో దిట్ట అనిపించుకున్నారు. ఇళయరాజా పాటలను, సంగీతాన్ని ఇష్టపడని సినీ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఒక సంగీత దర్శకుడు పాటలు చేస్తే ఫలానా మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేసిన పాటల్లా ఉన్నాయని చెబుతుంటారు. కానీ, ఏ సంగీత దర్శకుడి ప్రభావం లేని ఇళయరాజా తన కొత్త బాణీలతో అందర్నీ అలరిస్తూ మ్యూజిక్‌ మాస్ట్రో అనిపించుకున్నారు. 

అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇళయారాజా కొన్ని వివాదాల ద్వారా కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. గతంలో తన పాటలకు రాయల్టీ చెల్లించాలంటూ కొందరు గాయనీగాయకులకు నోటీసులు కూడా పంపించారు. ఇటీవల మంజుమల్‌ బాయ్స్‌ చిత్రంలో తను ట్యూన్‌ చేసిన పాటను వాడుకున్నారంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తన ప్రారంభదశలోగానీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడుగానీ ఈ తరహా వ్యవహారశైలి ఆయనకు లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

‘గతంలో మన పాటలన్నీ శాస్త్రీయ సంగీతంతోనే రూపొందించేవారు. నేను నా పాటల ద్వారా వెస్ట్రన్‌ సంగీతాన్ని పరిచయం చేశాను. ప్రపంచ సంగీతాన్ని పలు రకాలుగా నా పాటల ద్వారా ప్రేక్షకులకు చేరువ చేశాను. అంతేకాదు, నేను సింఫనీని రూపొందించాను. నేను అందించే సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. దాన్ని బట్టి సంగీతం అంటే నాకు ఎంత ఆసక్తి ఉంది అనేది మీకు తెలుస్తుంది. నా సంగీతం విని ఓ చిన్నారి మృత్యువు నుంచి బయటకు వచ్చింది. మనుషులే కాదు, ఏనుగులు కూడా నా సంగీతాన్ని ఆస్వాదించాయి. ఒక ఏనుగుల గుంపు నా సంగీతం వినేందుకు వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇలాంటివి చెబితే అందరూ నాకు పొగరు, గర్వం అంటారు. ఎప్పుడైనా ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది. అందుకే నాకు ఖచ్చితంగా గర్వం, పొగరు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ చేయనిది నేను చేశాను. అలాంటిది నాకు పొగరు ఉండడంలో తప్పులేదు కదా’ అంటూ ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన దానిలో నిజం ఉందని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. మరికొందరు ఇంతకుమించిన ప్రతిభ ఉన్నవారు భారతీయుల్లో ఉన్నారు. వారందరికీ పొగరు లేదు కదా అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.