Home  » Movie-News » రెహమాన్‌తో ఎఫైర్‌... మొదటిసారి స్పందించిన మోహిని! 



ఈమధ్యకాలంలో అందర్నీ షాక్‌కి గురి చేసిన వార్త.. ఎ.ఆర్‌.రెహమాన్‌ విడాకులు. 29 ఏళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య సైరా బాను నుంచి విడిపోతున్నట్టు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదట సైరా బాను ఈ విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రకటన చేశారు. దాని తర్వాత దాన్ని రెహమాన్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ ప్రకటనలు చూసి అందరూ షాక్‌లో ఉన్న సమయంలోనే మరో షాకింగ్‌ వార్త వచ్చింది. అదేమిటంటే.. రెహమాన్‌ ఆర్కెస్ట్రాలో పనిచేసే మోహిని డే తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే మోహిని తన విడాకుల గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడంతో రకరకాల ఊహాగానాలు, పుకార్లు చక్కర్లు కొట్టాయి. మోహిని కోసమే రెహమాన్‌ విడాకులు తీసుకుంటున్నాడనే వార్త వైరల్‌ అయిపోయింది. 

రెహమాన్‌ భార్య నుంచి విడిపోవడానికి కారణం మోహిని అంటూ ఆమెను ట్రోల్‌ చెయ్యడం మొదలుపెట్టారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్ని రెహమాన్‌ కుమారుడు అమీన్‌ ఖండిరచాడు. తన తండ్రిపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నాడు. తన గురించి, మోహిని గురించి జరుగుతున్న ప్రచారంపై రెహమాన్‌ స్పందించకపోడంతో అది మరింత ఉధృతంగా మారింది. అయితే దీనిపై మోహిని డే తొలిసారి స్పందించింది. ‘సోషల్‌ మీడియాలో నాపై జరుగుతున్న ప్రచారం అంతా నిరాధారమైంది. దీని గురించి చాలా మంది ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. ఇలాంటి పుకార్లపై స్పందించి నా టైమ్‌ వేస్ట్‌ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా భర్తతో విడిపోవడం నా వ్యక్తిగత విషయం. అదే పోస్ట్‌ చేశాను. ప్రతి ఒక్కరూ నా గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అని పోస్ట్‌ చేశారు మోహిని డే. మోహిని డే కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత ‘బాస్‌’ వాయిద్య ప్లేయర్‌. మ్యూజీషియన్‌ అయిన తన భర్త మార్క్‌ హార్ట్‌సుచ్‌ నుంచి విడిపోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది మోహిని. చాలా కాలంగా రెహమాన్‌ ఆర్కెస్ట్రాలో పనిచేస్తోంది మోహిని.