Home » Articles » తలవని రోజుందా అమ్మ నేను

పదేళ్ళ పాప మురళిఅన్నయ్య ఫ్రెండ్స్ తో బొంగరాలాట ఏడుపెంకులాట ఆడుకొని కను చీకటిపడేటప్పుడు యింట్లో అడుగు పెట్టింది . అమ్మ ఎందుకో కోపంగా వుంది . పిల్లిలా వాకట్లొకెళ్లి కాళ్లు కడుక్కొని పుస్తకాలు ముందు వేసుకొని చదువు కోడానికి కూర్చుంది . అమ్మ భోజనానికి పిలిచేదాకా చదువుకుంది. భోజనాలదగ్గర " రేపటి నుంచి నువ్వు మొగ ఆటలు ఆడకూడదు , కున్ని , మినొతి , విజయలతో ఆడుకోవాలి " అమ్మ శాసనం .

" మగ ఆటలా ? " , ఆటలలో కుడా లింగ బేధం ఉంటుందని తెలీని పాప సందేహం .
       " అంటే చింతపిక్కలాటలు , గచ్చకాయలు ఆడుకోవాలి నాతో సమానంగా బొంగరాలు ఆడకోడదు అదీ సంగతి  , వీధినిండా ముగ్గులు కావాలంటే పెట్టుకోవచ్చు , నేర్చుకోవచ్చు " సందేహ నివృత్తి చేసేడు మురళి . మురళి గొంతులో హేళన ఉందేమో అనే అనుమానం వచ్చింది పాపకి . అమ్మ ఆ యింటి నియంత , వొక నిర్ణయం తీసుకుంది అంటే మరి దాన్ని మార్చే ప్రసక్తే లేదు . అయినా ఏదో ఆశ . అందుకే నాన్నగారివైపు ఆశగా చూసింది .

         " మరీ నోటిస్ యివ్వకుండా యిలా ఆర్డరు వేస్తే ఎలా ? వో పదిరోజులు యీ మొగ ఆటలు ఆడేసి , సైకులు తొక్కేసి అప్పుడు మానేస్తుందిలే ? కదమ్మా పాపా , తరవాత అమ్మ దగ్గర కుట్లు అల్లికలు , వీణ నేర్చుకో ఏం " నాన్నగారు మరో పదిరోజుల గడువు యిప్పించేరు .

          ఆటలకు పంపనప్పుడు అమ్మలో నియంతను చూసింది , కుట్లు , అల్లికలు , సంగీతం నేర్చుకునే టప్పుడు గురువుని చూసింది . బుట్ట చేతుల గౌను , దొంతుల గౌను , పంజాబీ డ్రెస్స్ , నిండా కుచ్చిళ్ళ పరికిణి , మూడు నాలుగు రంగుల బట్టలతో గౌను కుట్టినప్పుడు అమ్మ వో ఫాషన్ డిజైనర్ ." పని ముద్దా , భాగ్యం ముద్దా అని "  అంటూ సమర్దవంతం గా అన్ని పనులు స్వయంగా చేసుకోవాలని తాను చేసుకుంటూ పాపకి , కోడళ్ళకి సలహాలిస్తున్నప్పుడు మార్గదర్శి .

          పదమూడేళ్ల పాపకి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపుతూ అక్కడ ఎలా మసలుకోవాలో చెప్తున్నప్పుడు అమ్మ వో స్నేహితురాలు .
    పదహారేళ్ళ పాప తల్లయితే పనిమనుషులు దొరకని ఒడ్డిదేశం లో అమ్మ ఆయాగా పురిటి , ' చెత్త ' చేతులతో శుబ్రం చేసింది , పురిటి బట్టలు చాకలి కారంలో ఉడక బెట్టి ఉతికిన అమ్మ వో చాకలి , పాటలు పాడుతూ పసివాడికి లాల పోసి జోల పాడిన నాతల్లి అమృతవల్లి , అనురాగాల తల్లి .

      యింటి పని , వంట పని , పిల్లల చదువులు , బయట పనులు అన్ని సమర్ధవంతం గా చేసుకో గలిగే శక్తి , దైర్యం యిచ్చిన శక్తి స్వరుపిణి అమ్మే . పిల్లలని , సామాను తీసుకొని రెండు ట్రైన్స్ మారి మూడురోజుల ప్రయాణం సమర్దవంతంగా చెయ్యగలిగే దైర్యాన్ని యిచ్చినదీ అమ్మే .

       యిక్కడ మరో అమ్మని గురించి కుడా చెప్పుకోవాలి , ఆ అమ్మ పాపని  కన్న అమ్మ . యీ అమ్మ పాప పదమూడో యేట అత్తగారిగా పరిచయమై పాపని లక్ష్మి గా చేసిన అమ్మ . అప్పటి నుంచి యిప్పటి వరకు లక్ష్మి మీద యీగని కుడా వాలనివ్వకుండా చూసుకున్న అమ్మ . యింట్లో అడుగు పెట్టిన మొదటి రోజు లక్ష్మి భర్తకి " లక్ష్మి కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకో , దాని కంట్లో నీళ్లు చూసేనా నీ నడ్డి పెట్ల కొడతా " అని వార్నింగ్ యిచ్చిన అత్తమ్మ .

         లోక ధర్మం ప్రకారం అత్తమ్మలో అమ్మని చూసుకుంటూ లక్ష్మిగా మారిన పాప తల్లిని తలవని రోజుందా ?

      కర్ర నాగలక్ష్మి
 mob 7387766655
pune maharaastra
మా అమ్మపేరు అయ్యల సోమయాజుల కళావతి