Home » Articles » అమ్మ వళ్ళో పాపాయికి ఏమి కావాలి

వాయుగుండ్ల శశికళ.

''చిన్నమ్మాయి పిల్లలు ఎక్కడ ?'' అడిగింది అమ్మమ్మ .
''ఉన్నారు లేమ్మా , బయట అరుగుల పై  ఆడుకుంటున్నారు ''చెప్పింది అమ్మ .
అరుగుల మీద నుండి దూకుతూ , మళ్ళీ ఎక్కుతూ ఉన్న నేను
తొంగి చూసి నవ్వాను . మూడేళ్ళ పాప  ఉంటుంది ! చల్లని వెన్నెల
మనసుని ఉంటుంది .ఆ  మనసు అమ్మమ్మది అయితే తనకు గంధం
పూసినంత హాయిగా ఉంటుంది .
 
''నా తల్లే ఆడుకోమ్మా ,  అక్క ఏది ?''
అప్పటికి అక్క ,నేను ఇద్దరమే అమ్మకి . పెదమ్మ ,మావయ్య ఆ ఊరిలోనే
కాబట్టి మేము ఒక్కరమే  సెలవల్లో వచ్చే చుట్టాలం . అందుకే అమ్మమ్మకి
మేమంటే అంత మురిపం .
''రాణి అక్క , శైల అక్కతో ఎక్కడికో పోయింది . నేను వనజ ఆడుకుంటున్నాము ''
పెద్దగా అరిచి చెప్పాను . చిన్నగానే తల్లి  .... నవ్వుతూ వారించింది అమ్మ .

''అది ఎందుకు చిన్నగా అరుస్తుంది !వాళ్ళ నాన్నకు ఆడ పిల్ల రెండో సారి
వద్దు అంటే ,ఎందుకు వద్దు అంటావు అని గట్టిగా పుట్టేసింది . ఎవరికైనా
జవాబు చెప్పాలంటే అదే '' నవ్వుతూ లోపలి వెళ్ళింది అమ్మమ్మ .
అమ్మ కూడా నవ్వుకుంటూ బుగ్గ లాగి ముద్దు పెట్టుకొని పనిలో మునిగి
పోయింది . నాకు ఇద్దరు ఆడ పిల్లలు అయితే ఏమిటి ,దేవుడు చందమామ
లాంటి పిల్లలను ఇచ్చాడు . ఇద్దరు చక్కగా పెరిగితే చాలు . ... అనుకుంటూ
లోపలి వెళ్లి పోయింది . ఆడుకొనే పిల్లలను బద్రంగా చూసుకొనే పని ఎప్పుడూ
ఇంటి ముందు ఉండే ఎర్ర అరుగులదే !!అవి దాటి పిల్లలు ఎప్పుడూ రోడ్
మీదకు వెళ్ళరు .
                               *************
''శశి ,అన్నం తిందువు రామ్మా '' అమ్మ పిలుపుకు సమాధానం చెప్పడానికి
నేను అక్కడ ఉంటె కదా !! రెండు సార్లు పిలిచేసరికి అమ్మకి అనుమానం వచ్చింది .
ఇల్లంతా వెతికింది . అక్కను అడిగినా ,పక్క వాళ్ళను అడిగినా ఒకే సమాధానం
''తెలియదు ,చూడలేదు ''అని .
అమ్మమ్మకు ,అమ్మకు మావయ్య కు కంగారుగా ఉంది .
ముఖ్యంగా పాప కనపడలేదు అంటే ,పాప నాన్నకు ఏమి సమాధానం
చెప్పాలి . అసలే ఆయనకు కోపం ఎక్కువ . పాప పుట్టినాక కొద్ది రోజులు
చూడటానికి కూడా రాలేదు . ఇప్పుడు పాప అంటే చాల ఇష్టం .
అమ్మ కైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి . ఇంత చిన్న పాప ఎంత
దూరం వెళ్లి ఉంటుంది ? కొంప తీసి ఎవరైనా చెవిలో కమ్మల కోసం
ఎత్తుకొని వెళ్లి ఉంటె .... ఊహకే అమ్మ మనసు వణికి పోతుంది .
''నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమం గా ఉండాలి . తొందరగా దొరకాలి ''
మనసులోనే ప్రార్ధన లు చేస్తూ ఉంది . తల్లి బాధ తెలియని వారెవరు ?
చుట్టూ పక్కల వాళ్ళు అందరు చుట్టూ చేరి ఓదారుస్తూ ఉన్నారు ,కాని
ఎవరైనా ఎత్తుకొని వెళ్లి ఉంటారా ,అనే ఆలోచన అందరిలో ఉంది .
ఇంత చిన్న పాప దూరంగా వెళ్ళదు . కాబట్టి ఏమి అయి ఉంటుంది అని
తర్జన బర్జనలు జరుగుతూ ఉన్నాయి .
ఊరంతా టముకు వేయిస్తే దొరకొచ్చు .... ఒకరి సలహా .
పోలీస్ రిపోర్ట్ ఇద్దాము .... ఇంకొకరి సలహా .
అందరు తలా ఒక వైపు వెళ్లి వెతుకుదాము ..... ఓక్కొక్కరు ఒక్కో
మాట . ఒకరి సలహా కంటే ఒకరిది గొప్ప అని వాదన .
వింటున్న అమ్మకి మాత్రం ఒకటే ఆలోచన ,తప్పి పోయి ఉంటె ఎలాగైనా
దొరుకుతుంది . మనుషుల్లో ఇంకా కొంచెం పాపభీతి ఉంది . ఒక వేళ
ఎవరైనా తీసుకెళ్ళి పోయి ఉంటె ..... ఈయనకి ఏమి చెప్పాలి ?
పాప ఎలా ఉందొ !! మనసు భయం తో పరి పరి విధాల పోతూ ఏ
సలహా ని స్వీకరించేటట్లు లేదు అమ్మకి .
ఒకామె ముందుకు వచ్చి అడిగింది ''పాప తెల్లగా ఉంటుందా ?''
అవును గబుక్కున చెప్పింది అమ్మ .
''అయితే ఆ పాప ఇందాక అరుగు మీద నుండి దిగి తూముల
వైపు వెళ్ళింది . కాంతమ్మ మనుమరాళ్ళు తెల్లగా ఉండరు కదా
అనుకున్నాను . ఈ పాపని ఎప్పుడూ చూడలేదు ''చెప్పింది .
అందరికీ కొంత ఆశ . ఆ వైపు వెళ్లి చూస్తె దొరకొచ్చు .

''లేదు ,టముకు వేసే వాళ్ళను మాట్లాడండి . దొరుకుతుంది ''చెప్పింది
అమ్మమ్మ .
అప్పటికి పాప కనపడక రెండు గంటలు దాటిపోయి ఉంటుంది . ఇంటి ముందు
మూగిన జనాలను చూసి  ఇంట్లోకి వచ్చాడు చిల్లర అంగడి పుల్లయ్య .
''ఏమి జరిగినదమ్మా ?'' అడిగాడు అమ్మమ్మని .
''చిన్నమ్మాయి రెండో కూతురు శశి కనపడటం లేదు '' కళ్ళ నీళ్ళు
నింపుకుంటూ చెప్పింది అమ్మమ్మ .
ఒక్క నిమిషం .... ఏదో ఆలోచిస్తూ చెప్పాడు .
ఏమి చెపుతాడా అని అందరు అతని వైపు చూసారు .
''విష్ణాలయం దగ్గర గాజులు అమ్మే దాసరి వాళ్ళు ఎవరో పాప ఏడుస్తుంటే
చూసాము అని చెప్పారు ''
అందరికీ ఉత్సాహం . కాని అది కిలో మీటర్ పైనే దూరం . మూడేళ్ళ పాప
ఇల్లు వదిలి అంత దూరం పోయి ఉంటుందా !! జరిగే పని కాదు .

''అయినా సరే వెళ్లి చూసి రండి సుబ్రహ్మణ్యం '' అమ్మ వేడికోలు .
కడుపు కోత  ఎలా ఉంటుంది, తొమ్మిది నెలలు మోసి నొప్పులు పడి
కన్న వాళ్లకు తెలుస్తుంది . ఒక అమ్మకే ఆ బాధ తెలుస్తుంది .
సరే వెళ్లి చూసి వస్తాము ,అమ్మ మాట కాదు అనలేక మావయ్య ,పుల్లయ్యతో
బయలు దేరి వెళ్ళాడు ..... కాని మన పాప అయి ఉంటుంది అనే నమ్మకం లేదు .
                                       *********

''అమ్మా ఇక్కడ పాప ఏడుస్తూ కనిపించింది అంట , ఆ పాప ఏది ''
దాసరి వాళ్ళను అడిగారు .
వాళ్ళు బయటకు వచ్చి వివరాలు అడిగారు
''అవును బాబు పిల్ల బొద్దుగానే ఉంది . ఎవరో సెట్టిగార్ల అమ్మాయి కొత్త బజారు
నుండి తప్పి పోయి ఉంటుంది అని ,పక్కన ఉండే సెట్టిగార్ల ఇంటిలో
వదిలి పెట్టాము '' చెప్పారు అనునయంగా .

ఒక్క ఊరుకున పరిగెత్తారు అక్కడకు .
మా పాపే కావాలి అని కోటి దండాలు మనసులోనే పెట్టుకుంటూ తొంగి
చూసారు ఇంటి లోకి .
కంచం లో అన్నం తింటూ చిన్న పాప .
''మావయ్య రా .... రా , చామ గడ్డల పులుసు భలే ఉంది . అన్నం
తిందువు '' ప్రేమగా చేతిలో ముద్ద ఉంచుకొని పిలిచింది .
''నా తల్లే నా బంగారే , అక్కడ మీ అమ్మ కంటి నిండా నీళ్ళు పెట్టుకొని
ఏడుస్తూ ఉంది . దామ్మా '' మావయ్య చేయి కడిగి ఎత్తుకున్నాడు .

''కొంచెం సేపు ఏడ్చింది కాని ,అన్నం పెడితే తినేసింది . పాపం బాగా
ఆకలిగా ఉన్నట్లు ఉంది . ఎవరి పాపవి అని అడిగితే ''అమ్మ పాపని ''
అంటుంది . ఏమి చెప్పలేదు . పోలీస్ స్టేషన్ లో చెపుదాము అనుకుంటున్నాము ''
నవ్వుతూ అన్నారు వాళ్ళు . మావయ్య సంతోషంగా ముద్దు పెట్టుకొని
''నువ్వు అమ్మ పాపవే లెమ్మా ,మంచి పని చేసావు ఈ రోజు ''అని ఇంటికి తీసుకొని
వెళ్ళాడు . నన్ను చూడగానే అమ్మ మనసుకు సంతోషం ,ఎత్తుకొని
''భడవా ,ఎంత కంగారు పెట్టావు ?ఏమై ఉంటావో అని భయం వేసింది ''అంది .
అమ్మ వళ్ళో  ఊగుతూ ''ఉన్నాను లేమ్మా , చామ గడ్డాల పులుసు ఎంత
బాగుందో తెలుసా ,నీకు తేలేదు ,నేనే తిన్నాను ''ముద్దుగా చెప్పాను .
''నాకు నీ కంటే రుచికరం అయింది ఏమి లేదులే తల్లి '' నుదుటి మీద ముద్దు పెట్టింది
అమ్మ .
''పోతే పోనీలేవే చిన్న అమ్మాయి . శశి పోతే ఏమైంది , రాణి ఉందిగా ''
నవ్వుతూ ఆట పట్టించింది అమ్మమ్మ .
'' ఎంత మంది ఆడ పిల్లలు ఉంటె మాత్రం తల్లికి అందరు కావాలి .
ఆడ పిల్లలు అయితే ఏమిటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు కావాలి అని
దేవుడు వ్రాసి ఉన్నాడో ! తల్లికి ఎందరు ఉన్నా ఒక్కరు బరువు కారు ''
చెప్పింది అమ్మ వడిలో నన్ను ఉంచుకొని .
అమ్మమ్మకు తెలియని అమ్మ మనసా ? ముగ్గురు పిల్లలు పుట్టినాక
తాతయ్య చనిపోతే పిల్లలని కళ్ళలో పెట్టుకొని తల్లిగా ఎంత కష్టపడి
సాకింది .
                                    **********

ఎప్పటి కధ ఇది ?అనడ్రు ఒకరి కష్టాలు ,సుఖాలు పంచుకొనే కాలం లోది .
ఒకరి కోసం ఒకరు కన్నీళ్లు పెట్టె కాలం లోది . పిల్లలు పుట్టడం అంటే ,
వారు బ్రతికి బట్ట కట్టడం అంటే గొప్ప విషయం అనుకునే కాలం లోది .
న్యాయంగా , ధర్మంగా బ్రతికితే ఆ ధర్మమే మన బిడ్డలను కాపాడుతుంది
అనుకొనే కాలం లోది . మనకు ఉన్న దానిలోనే కొంత అన్నం
ఆకలికొన్న వాళ్లకు పెట్టె కాలం లోది .
ఏ కాలం అయినా మారనిది ఒకటే ..... అదే అమ్మ మనసు .