Home » Articles » అమ్మ పి యస్ యమ్ లక్ష్మి

చాలామందికి అమ్మ అన్నది ఒక కమ్మని మాట .. అయితే మాకు మాత్రం అమ్మ అన్నది ఒక కలలో మాట ... ముఖ్యంగా మా చెల్లెళ్ళకి. అసలు మేము ఏడుగురం అక్క చెల్లెళ్ళమండీ. నేను రెండోదాన్ని. నాకు పదహారేళ్ళ వచ్చేసరికే మా అమ్మ మాకు దూరమయ్యారు. నాకు అమ్మ జ్ఞాపకాలన్నా వున్నాయి, పాపం, మా చెల్లెళ్ళింకా చిన్నళ్ళుకదా..అందుకే వాళ్ళకి అమ్మ సరిగ్గా గుర్తుకూడా లేదు.మా అమ్మ పేరు కీ.శే. పులిగడ్డ జయలక్ష్మి సుశీల. మా నాన్నగారి పేరు కీ.శే. పులిగడ్డ జనార్దనరావు. వేలు విడిచిన మేనరికం వున్నది. పెళ్ళిలో వంకాయ కూర చెయ్యలేదని అలిగి గోడెక్కి కూర్చుంటే మా నాన్నే అలక తీర్చి తీసుకొచ్చారుట. అంత చిన్నప్పుడయింది వారి పెళ్ళి.

మా అమ్మ పెద్దగా చదువుకోకపోయినా ఆవిడకి చదువంటే చాలా ఇష్టం.  పిల్లలంతా బాగా చదవాలనీ, పెద్ద ఉద్యోగాలు చెయ్యాలనీ ఆ కాలంలోనే చాలా ఆశపడ్డది.  నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేది.  ఇంగ్లీషు ప్రతి మాటా స్పెల్లింగ్ ప్రతి అక్షరం చదివించి తిరిగి ఆ పదం ఎలా పలకాలో చదవమనేది.  అలాగే అన్నం తినేటప్పుడు చాలా పేచీ పెట్టేదాన్ని.  ఎగ్గొట్టటానికి అనేక మార్గాలు కనిపెట్టేదాన్ని.  ఆవిడమాత్రం ఎప్పుడూ ఒకే మార్గం అవలంబించేది.  పైన దణ్ణెం మీద బట్టలు ఆరెయ్యటానికి ఉపయోగించే పొడుగాటి కఱ్ఱ ఒకటి వుండేది.  దాన్ని తీసుకుని కూర్చునేది.  కంచం  ఖాళీ చెయ్యకుండా లేస్తే దెబ్బ పడుతుందని వార్నింగుతో.  కానీ ఎప్పుడూ దెబ్బ వెయ్యలేదు.  ఆవిడకి చదువంటే చాలా ఇష్టం అని చెప్పానుగా.  మా అక్కయ్య యస్.యస్.యల్.సి. లో వున్నప్పుడు తనకి ట్యూషన్ పెట్టించారు.  అయినా తను పాస్ కాలేదు.  నాకు ఏ ట్యూషనూ లేకుండా మొదటిసారే పాసయ్యాను.  మా అమ్మ ఎంత సంబర పడ్డదంటే ..  ఇళ్ళకొచ్చి బట్టలమ్మేవాళ్ళు అప్పుడూ వున్నారు.  ఆ అబ్బాయిని పిలిచి నాకు రెండు లంగా, ఓణీలు, మంచి సిల్కు బట్టలు తీసుకుంది. అప్పటిదాకా నేను వాడే బట్టలు ఎక్కువగా మా అక్కకి అక్కరలేనివే వుండేవి.  ఇప్పుడు ఎంత ఖరీదైన బట్టలు కొనుక్కున్నా, మా అమ్మ అంత సంతోషంగా నాకు కొనిచ్చిన ఆ ఖరీదైన బట్టలు నాకిప్పటికీ అన్నింటికన్నా బాగున్నాయనిపిస్తుంది.  మా అమ్మకి మిగతా పిల్లలకన్నా నేనంటే ఎక్కువ ఇష్టం.  కారణం ఆవిడకిష్టమైన చదువే.  మిగతావాళ్ళకన్నా నేను బాగా చదివేదాన్ని.  యస్.యస్.యల్.సి. తర్వాత నేను షార్టుహేండు నేర్చుకున్నాను.  షార్టుహేండు ప్రాక్టీసు చెయ్యటానికి బోలెడు నోట్ బుక్స్ కావాల్సి వచ్చేది. నోట్ బుక్స్ ఖరీదెక్కువ అని రూళ్ళ కాయితాలు తెచ్చి కట్ చేసి పుస్తకాలుగా కుట్టిచ్చేవారు నాన్న.  కూరలతోపాటు ప్రతిసారీ వచ్చే రూళ్ళ కాయితాలని చూసి అమ్మ సరదాగా అనేది..నీ చదువుకాదుగానీ కూరలతో సమానంగా కాయితాలూ తెస్తున్నారు.  ఆ డబ్బులన్నీ వసూలుచేస్తేకానీ నీకు పెళ్ళి చెయ్యను అనేది.

అమ్మ ఒక మగపిల్లాడుంటే బాగుండును అనుకునేదికానీ, ఆడపిల్లలమని మమ్మల్ని చులకనగా చూడటంగానీ, తక్కువ చేసి మాట్లాడటంకానీ మా అమ్మా, నాన్నా ఎప్పుడూ  చెయ్యలేదు.  పిల్లలు తక్కువగా వున్న ఈ రోజులలో ఆడపిల్లపట్ల వివక్షత చూపించే వారిని గురించి విన్నప్పుడు  నాకు మా అమ్మా నాన్నా గుర్తుకొచ్చి మేమెంత అదృష్టవంతులమో అనిపిస్తుంది.అమ్మ గురించి ఎన్ని జ్ఞాపకాలో.  చివరికి ఆవిడ చివరి రోజులుకూడా.  అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అనుకున్నారు.  కానీ కాదు.  ఆ మహమ్మారికి అప్పుడువాళ్ళు పెట్టిన పేరు ముత్యాల గర్భిణి.  విపరీతంగా బ్లీడింగ్ అయ్యేది.  నాకప్పుడు పదహారో ఏడు వచ్చిందనుకుంటాను.  అప్పటికే యస్.యస్.యల్.సి., టైపు హైయర్, షార్టుహేండు లోయర్ పాసయ్యాను.  అన్నట్లు షార్టుహేండు లోయర్ కి మేము తెనాలిలో వున్నా నేను సెంటరు గుంటూరు పెట్టుకున్నాను.  నాన్న కంపెనీ పనిమీద గుంటూరు, విజయవాడ తిరుగుతూ వుండేవారు.  ఆ రోజు నాన్న కంపెనీ పనిమీద గుంటూరు వస్తుంటే ఆ కంపెనీ కారులోనే నేనూ, నాకు తోడుగా అమ్మా పరీక్ష సెంటరు కి వచ్చాము.  మమ్మల్ని దింపి, మళ్ళీ పరీక్ష అయ్యే సమయానికి వస్తానని నాన్న  వెళ్ళిపోయారు.  సెంటరు వాళ్ళు తోడు వచ్చినవాళ్లు ఆ దరిదాపుల్లో వుండటానికి వీల్లేదన్నారు.    చాలామంది విద్యార్ధులు ఆ ఊరివారే కాబోలు, తోడు వచ్చినవారు ఎక్కువ లేరు.  దూరంగా ఒక చెట్టు కింద కూర్చుంది అమ్మ.  ఇంతలో గాలి, వాన..ఎదురుకుండా ఒక పాత బంగళాలాంటిది వుంటే దాని చూరుకిందకెళ్ళి నుంచున్నదిటి.  గాలి, వాన, జన సంచారం లేదు, ఆ ఇంట్లో కూడా ఎవరూ వున్నట్లు లేదు..అమ్మ చాలా భయపడ్డదిట..పాపం.  అయినా నాకోసం అలాగే నుంచుంది.

అమ్మని నాకు తెలియకుండా చాలా బాధపెట్టినది ఆవిడ ఆఖరి సమయంలో.  అమ్మకి జబ్బు మొదలయ్యాకే నేను మా ఎదురుకుండా అమ్మాయితో హైదరాబాదులో ఉద్యోగంకోసం వచ్చాను.  అమ్మ ఉద్యోగంకోసం సంతోషంగా పంపింది కానీ నేను వెళ్ళగానే ఇంట్లోకెళ్ళి పడిపోయిందట.  నేను దూరంగా వెళ్ళాననే దుఃఖంకన్నా ఆవిడని బాధించినది ఆ సమయంలో కూడా పిచ్చిమొద్దులా నేను మా అక్క బట్టలే వేసుకెళ్ళానని.

ఆ సమయంలో స్టెనోలకి డిమాండ్ బాగా వున్నా నాకు పదహారేళ్ళే అవటంవల్ల గవర్నమెంటు ఉద్యోగాలకి పంపటానికి ఎప్లాయ్మెంటు ఎక్స్చేంజ్ లోని ఆఫీసర్లు అన్నపూర్ణ, రామదాసు గార్లకు (భార్యా భర్తలు) కష్టమయింది.  సరే  మా నాన్నగారు వచ్చి తెలిసినవారి కంపెనీలో ఉద్యోగం ఇప్పించి, నన్ను వాళ్ళ స్నేహితుని ఇంట్లో అట్టిపెట్టి వెళ్ళారు.  వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్త నాన్నా అని చెప్పాను.
మూడు నెలలయినా ఉద్యోగం చేశానో లేదో .. వినాయక చవితి వస్తోంది, ఇంటికెళ్ళి వద్దామనుకున్నా.  అమ్మకోసం మా ఫ్రెండు ద్వారా వాయిదా పధ్ధతిలో చీరె తీసుకున్నా.  నా ప్రయాణం రోజుకన్నా ముందే , ఒక తెల్లవారుఝాము అంకుల్ కి ఫోన్ వచ్చింది.  అమ్మకి చాలా సీరియస్ గావుంది, నన్ను వెంటనే పంపించమని.  ఆయన అర్జంటుగా నన్ను తీసుకెళ్ళి విజయవాడ బస్సెక్కించి, కండక్టరుతో విషయం చెప్పి దిగిన వెంటనే తెనాలి బస్సెక్కేటట్లు చూడమని చెప్పి వెళ్ళారు.  అప్పుడు హైదరాబాదునుంచి తెనాలికి తక్కువ బస్సులుండేవిమరి. తానొకటి తలుస్తే దైవమొకటి తలుస్తాడనేది నాపట్ల నిజమయింది.  పండగకి అమ్మని చూడటానికి వెళ్దామనుకుంటే అలా బయల్దేరాను.  ఇంకా మమ్మల్ని పరీక్షించటానికా అన్నట్లు దోవలో ఒక లారీ చెడిపోయింది.  ఎటువైపు వాహనాలు అటు నిలిచిపోయాయి.  కొన్ని గంటలపాటు అలా నిలిచిపోయాక, మా బస్సు కండక్టరుకి ఆలోచన తట్టి అటువైపు బస్సువాళ్ళతో మాట్లాడి, అటు ప్రయాణీకులని ఇటు, ఇటు ప్రయాణీకులను అటు సామానుతోసహా చేరేసి ఎటు బస్సులను అటు తిప్పారు.  ఈ బస్సు కండక్టరు తన బాధ్యతను మర్చిపోకుండా ఆ కండక్టురుకి అప్పజెప్పి ఏం చెప్పాడో నాకు తెలియదు.  సాయంకాలం 3 గం.ల ప్రాంతంలో విజయవాడకొచ్చిన బస్సుని రైల్వే స్టేషన్ దగ్గర ఆపి ఆ కండక్టరు నన్నో రిక్షా ఎక్కించి, తిన్నగా రైల్వే స్టేషన్ కి వెళ్ళి తెనాలి వెళ్ళే రైలు ఆ సమయంలో వుంది, అదెక్కితే తొందరగా వెళ్తావని చెప్పి వెళ్ళిపోయారు.  నేను వాళ్ళు చెప్పినట్లు చేశాను.  రైలెక్కి కూర్చుని ఐదు నిముషాలయిందో లేదో మానాన్నగారి కంపెనీలో పనిచేసే పెద్దరాముడొచ్చాడు.  ఎప్పటికప్పుడు విషయాలు కనుక్కుంటున్న మావాళ్ళు అమ్మ బతికుండగా నన్ను చూపించాలనే ఆరాటంతో, విజయవాడనుంచీ మళ్ళీ బస్సులో వస్తే ఆలస్యమవుతుందని  నన్ను తొందరగా తీసుకురావటానికి ఆఫీసువాళ్ళు కారు పంపించారు.  వచ్చినవారు ఎక్కడో కూర్చోకుండా విషయం కనుక్కుంటూ, నన్ను రైలెక్కించటం కనుక్కుని ఆఘమేఘాలమీద అన్నట్లు నన్ను తెనాలి చేర్చటానికి తాపత్రయపడ్డారు.  వాళ్ళెందుకొచ్చారో అని నేను గాబరాపడకుండా, ఆఫీసుపనిమీద విజయవాడ వచ్చాము, మిమ్మల్నీ తీసుకెళ్ళచ్చని వచ్చామని చెప్పారు.  అప్పటి అభిమానాలెలావుండేవో చూడండి.

అమ్మదగ్గర పరిస్ధితులు తర్వాత నేను తెలుసుకున్నవి.  ముందురోజునుంచే అమ్మకి సీరియస్ అయింది.  లక్ష్మీ, లక్ష్మీ అని కలవరించటం మొదలుపెట్టింది.  అప్పుడే మాకు ఫోన్ చేశారు.  ప్రాణం పోయేదాకా ఆవిడ నా పేరే కలవరించింది.  లక్ష్మీ అనే పదం రాక చివరికి క్ష్మీ అనీ క్షీ అనీ.  అక్కడికీ మా అమ్మమ్మ నా స్నేహితురాలిని చూపించిందిట నేనేనని.  మగతగా వుందికదా నమ్ముతుందేమోనని.  కానీ అమ్మ అమ్మే.  ఆ అమ్మాయికి పెళ్ళయింది.  మెడలో నల్లపూసలున్నాయి.  నల్లపూసలున్నాయన్నట్లు సైగ చేసి తల అడ్డంగా తిప్పిందిట.  నాకోసం అంత ఆరాటపడ్డ అమ్మని బతికుండగా మళ్ళీ చూసుకోలేకపోయాను. 

నేను వచ్చిన కారు మా వీధిలోకి తిరగటానికి కూడా వీలులేనంత జనం వున్నారు.  దిగి నడుస్తుంటే అంతా నావంక అదోలా చూడటం నాకేమీ అర్ధం కాలేదు.  ఇంతలో నాన్న ఎదురొచ్చారు..అమ్మని జాగ్రత్తగా చూసుకోమన్నావమ్మా, నాకు చేతకాక దేవుడిదగ్గరకు పంపేశాను అని ఏడుస్తూ.  నాకేమిటో అంతా అయోమయంగావుంది.  చీకటిపడకుండా కానివ్వాలని అప్పటికే అమ్మని పంపించే ఏర్పాట్లు చేశారు.  నేనొస్తే అక్కడికే తీసుకురమ్మనే సూచనలుకూడా ఇచ్చారుట.  నా ఆ అయోమయంలోనే తర్వాత కార్యక్రమాలు అయిపోయాయి.నేను చెప్పే ఈ సంఘటనలు మాత్రం మీరు నమ్ముతారో లేదోగానీ నేను నిజంగా అనుభవించాను.  ఊహించాను అనటానికి అప్పుడు నాకిలాంటి విషయాలు తెలిసే వయసుకానీ, అనుభవంకానీ లేదు.

ఆ రోజు రాత్రి కలలో అమ్మ నాకు పాలు, పంచదార వేసిన అన్నంలో (చిన్నప్పుడు ఇష్టంగా తినేదాన్ని) కారం కలిపి పెడుతూ, జీవితం అంటే ఇంతేనమ్మా, మంచేకాదు, చెడుకూడా వుంటుంది.  అన్నీ అనుభవించాలి అని చెప్పింది అమ్మ.  అంతకుముందే నిద్రలో ఆలాపనగా వినిపించింది .. నీకోసం చాలాసేపు చూశానే.  వీళ్ళింక ఆగట్లేదు..నన్ను లాక్కెళ్తున్నారు ..  అని నేను పడుకున్న హాల్ లో పైన గోడమీదనుంచి అమ్మగొంతు వినిపించింది.  అమ్మ నాకోసం ఎంత ఎదురు చూసిందోకదా. తర్వాత ఉద్యోగం, హైదరాబాదు...ఎప్పుడూ అనిపించేది..అమ్మ కొన్నాళ్ళు వుంటే  ఈ ఊరు తీసుకొచ్చి పెద్ద డాక్టర్లకి చూపించి అమ్మని కాపాడుకునేదాన్నికదా అని. పిల్లలకోసం ప్రాణాలుపెట్టే అమ్మని  బాగా చూసుకునే అవకాశం మాకు ఇవ్వలేదా భగవంతుడు అనిపిస్తుంది ఇవ్వన్నీ తల్చుకుంటే.