RELATED EVENTS
EVENTS
Stage Set For 12th ATA Conference & Youth Convention

అట్లాంటా, జార్జియా (అమెరికా) లో జూలై 6 నించి 8 వరకు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జరుగనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) 12 వ మహాసభలకు సన్నాహాలు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నించి హాజరవుతున్న వేలాది మంది తెలుగు వారికి స్వాగతం చెప్పడానికి అట్లాంటా మహానగరం సరికొత్త శోభలను సంతరించుకుంది.  వందలాది కార్యకర్తలు ఈ మహాసభలను దిగ్విజయంగా నడిపించడానికి రాత్రింబగళ్ళు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. మూడురోజులపాటు అత్యంత ఆసక్తి కరంగా జరుగనున్న ఈ కార్యక్రమాలకు అతిథుల రాక ఆరంభమైంది.

 



ఆరవ తేది ఉదయం జార్జియా టెక్ లో ఆటా వారు క్రికెట్ కప్ పోటీ నిర్వహిస్తున్నారు. దేశం నలుములల నించి పోటీకి తరలి వస్తున్న జట్టులలో విజేతలకు మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్, ప్రముఖ రాజకీయవేత్త మహమ్మద్ అజారుద్దీన్ బహుమతి ప్రదానం చేస్తారు. ఈ మహాసభలకు హాజరవుతున్న  వారందరినీ, ఆర్థిక సహకారం అందించిన దాతలను, ముఖ్య అతిథులను జులై 6 సాయంత్రం జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ బాల్ రూమ్ నందు బాంక్వెట్ శైలిలో జరుగనున్న విందు, సంగీత విభావరి కార్యక్రమానికి ఆటా కార్యనిర్వాహక వర్గం సాదరంగా ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 5 గంటల నించి సోషల్ అవర్ తో ప్రారంభం కానుంది.

స్థానిక కళాకారులచే అత్యంతసుందరంగా రూపుదిద్దుకున్న వేదికపై ప్రతిష్టాత్మకమైన ఆటా అవార్డుల బహుకరణ, టాలీవుడ్ ప్రముఖులు ఇలియానా, దిల్ రాజు, సురేందర్ రెడ్డి, స్నేహా ఉల్లాల్, హంసనందిని తదితరుల సరదా కబుర్లు, స్థానిక గాయనీ గాయకులతో పాటు బాలగాయని భువనకృతి, ప్రముఖ గాయని విజయలక్ష్మిల ఉర్రూతలూగించే సంగీతం ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయి. ఈ సభలో ఘజల్ శ్రీనివాస్ గారిని తెలుగు ఘజల్ ప్రక్రియకు, సమాజానికి వారు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా సన్మానించనున్నారు. ఘజల్ శ్రీనివాస్ గారు వారి ఘజల్స్ తో సభికులను అలరించనున్నారు. నలభీమపాకం అంటే ఇదేనా అనిపించే విందుభోజనాలు వినోద కార్యక్రమానికి జోడీ కానున్నాయి.

జూలై 7వ తేదీ ఉదయం మన సంస్కృతి, దాని యొక్క పురోగమనానికి అమెరికాలోని తెలుగువారు అందిస్తున్న సేవలని గుర్తిస్తూ రూపొందిన సంగీత నృత్య రూపకం సాంస్కృతిక కార్యక్రమాలకు నాంది పలుకనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖామాత్యులు శ్రీ పల్లం రాజు గారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆహ్వానితులు రాష్ట్రమంత్రులు శ్రీమతి డి.కే.అరుణ, శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి. శనివారం మధ్యాహ్నం జరుగనున్న కార్యక్రమాలలో “ఝుమ్మంది నాదం” పాటలు, “సయ్యంది పాదం” నృత్యం సెమీ ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. ఇవికాక వివిధ కాన్ఫరెన్స్ గదులలో మీ అభిరుచులకి తగినట్లుగా అనేక చర్చావేదికలు, ప్రసంగాలు, శిక్షణా శిబిరాలు జరుగనున్నాయి. వివిధ మీడియా చానళ్లద్వారా అటు ఇండియాలోను, ఇటు అమెరికాలోను కూడా వివిధ కార్యక్రమాల ప్రత్యక్షప్రసారం జరుగనుంది.

సాయంత్ర కార్యక్రమంలో భాగంగా యువతీయువకుల శాస్త్రీయ మరియూ టాలీవుడ్ నృత్యప్రదర్శనలు, కూచిపూడి నాట్యాచార్య శ్రీ వెంపటి చినసత్యం గారికి జీవన సాఫల్య పురస్కారం, టాలీవుడ్ హాస్యనటులు ఏ.వీ.యస్., వేణుమాధవ్, రఘుబాబు, గుండు హనుమంతరావు, హేమ, మరియు శ్రీనివాస రెడ్డి యొక్క హాస్యభరిత కార్యక్రమాలు ప్రధానాకర్షణగా నిలువనున్నాయి. జూలై 8 ఉదయం సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానం జరుగనున్నది. వైద్యవృత్తిలోని వారికి శిక్షణా శిబిరాలు, రాజకీయవేత్తలతో సభికుల ముఖాముఖి, సాహితీ సదస్సులు, వాణిజ్య పరమైన, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన సెమినార్లు శనివారం, ఆదివారం కూడా జరుగనున్నాయి. ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో భాగంగా శ్రీ గోరేటి వెంకన్న గేయరూప కవిత్వం, “దూకుడు”, “బిజినెస్ మేన్” సంగీత దర్శకులు తమన్ బృందం సంగీత విభావరి సభికులను అలరించనున్నాయి.

ఈ మహాసభలలో ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వడ్డించబడే ఆటా వారి విందుభోజనాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారి రుచులు, అభిరుచులకు తగ్గట్లు ఉంటాయి. కార్యక్రమవివరాలకు www.ata2012.org ను సంప్రదించండి.

TeluguOne For Your Business
About TeluguOne
;