|
|

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చావో రేవోగా తీసుకున్న భీజేపీ, ఆప్ ల మధ్య ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాటల యుద్ధం మంటలు రేపుతోంది. బీజేపీ టార్గెట్ చేస్తూ ఆప్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యపై హర్యానా బీజేపీ నేతల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేజ్రీవాల్ హర్యానాలోని తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
హర్యానా నుంచి పరిశ్రమల వ్యర్థాలను యమునానదిలోకి వదులుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ ఆరోపణలు వాస్తవ మేనంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మంగళవారం (జనవరి 28) మరో బాంబు పేల్చారు. అమోనియా శాతం అధికంగా ఉన్న యమునా నది నీటిని శుద్ధి చేయడం కష్టమని, ఈ నీటిని ప్రజలకు సరఫరా చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆమె అన్నారు. ఢిల్లీ జల్ బోర్డు అమోనియా స్థాయిని 1 పిపిఎమ్ వరకు శుద్ధి చేయగలదని, అయితే హర్యానా నుంచి యమునా నది నీటిలో అమోనియా స్థాయి 700 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఇక కేజ్రీవాల్ అయితే ఒక అడుగు ముందుకు వేసి హర్యానాలో బీజేపీ నాయకులు కావాలని నీటిలో విషం కలుపుతున్నారు. ఈ నీరు త్రాగితే ఢిల్లీలో చాలా మంది చనిపోతారు. నీటిని శుద్ధి చేయడం కష్టమయ్యే స్థాయిలో యుమునను విషపూరితం చేశారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో హర్యానా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించారు. తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పరిశ్రమల వ్యర్థాలను యమునలోకి వదులుతోందన్న ఆప్ ప్రచారం పూర్తిగా వాస్తవ విరుద్ధమన్నారు. అసత్య ఆరోపణలు కేజ్రీవాల్ నైజమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ హర్యానా ప్రజలకు, ఢిల్లీ ప్రజలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.